ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మహా మాయ

ABN, Publish Date - Jul 16 , 2025 | 01:27 AM

జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి సమీపంలో గల ఫేకర్‌ లేఅవుట్‌లోని పార్కులో వైసీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

  • పార్కు అభివృద్ధి పేరిట మేసేశారు

  • ఫేకర్‌ లేఅవుట్‌లోని పార్కు అభివృద్ధికి రూ.1.6 కోట్లతో రెండేళ్ల క్రితం వైసీపీ హయాంలో టెండర్లు

  • ఒక్కొక్క పనికి రూ.20 లక్షలు కేటాయింపు

  • ఒక్కటి మినహా అన్నీ పూర్తయినట్టు బిల్లుల చెల్లింపు

  • అక్కడ చూస్తే...జరిగింది ఒక్కటే

  • అన్నింటి నిధులు ప్రహరీ గోడ నిర్మాణానికే వెచ్చించినట్టు చెబుతున్న కాంట్రాక్టర్‌

  • ప్రహరీ మినహా మిగిలిన పనులు జరగకపోయినా బిల్లు రికార్డు చేసిన అధికారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి సమీపంలో గల ఫేకర్‌ లేఅవుట్‌లోని పార్కులో వైసీపీ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్కులో పనులకు రెండేళ్ల క్రితం జీవీఎంసీ రూ.1.6 కోట్లతో టెండర్లు పిలిచింది. అందులో రూ.20 లక్షలు విలువైన పని మినహా మిగిలినవన్నీ పూర్తిచేసినట్టు రికార్డుల్లో చూపించారు. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించేశారు. అయితే పార్కులో చూస్తే ఒక ప్రహరీ మినహా మిగిలిన పనులు జరిగిన ఆనవాళ్లే లేవు.

వాల్తేరు టౌన్‌ సర్వేనంబర్‌ 76లో ఫేకర్‌ లేఅవుట్‌ లేఅవుట్‌ (28వ వార్డు పరిధి) వేశారు. అందులో సుమారు 4,500 గజాల స్థలాన్ని పార్కు స్థలంగా చూపించి జీవీఎంసీకి మార్టిగేజ్‌ చేశారు. అప్పటి నుంచి ఆ స్థలం పిచ్చిమొక్కలతో ఖాళీగానే ఉంది. దానిని చేజిక్కించుకునేందుకు కొందరు చాలాకాలంగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో లేఅవుట్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు పార్కు స్థలాన్ని అభివృద్ధి చేయాలంటూ జీవీఎంసీ అధికారులను కోరడంతో రెండేళ్ల కిందట రూ.1.6 కోట్లతో ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతిపాదనలు తయారుచేశారు. పార్కు లోపల రూ.20 లక్షలతో వాకింగ్‌ ట్రాక్‌, రూ.20 లక్షలతో పార్కింగ్‌, వాచ్‌మెన్‌ గది నిర్మాణం, రూ.20 లక్షలతో పార్కు ప్రవేశద్వారం, గేటు ఏర్పాటు, రూ.20 లక్షలతో వాటర్‌ ఫౌంటెయిన్‌, రూ.20 లక్షలు వ్యయంతో రక్షణ గోడల నిర్మాణం, రూ.20 లక్షలతో సాఫ్ట్‌ ల్యాండ్‌స్కేపింగ్‌, పిల్లల ఆట పరికరాల ఏర్పాటు, స్టేజీ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించి వేర్వేరుగా టెండర్లు పిలిచారు. అందులో రూ.20 లక్షల విలువైన పని మినహా మిగిలిన రూ.1.4 కోట్ల విలువైన పనులను ఒకేకాంట్రాక్టర్‌ దక్కించుకున్నారు. అయితే పార్కులో ఒకవైపు ప్రహరీ నిర్మాణం మినహాయిస్తే మిగిలిన పనులేవీ జరగలేదు. కానీ అన్నిపనులు పూర్తయినట్టు అధికారులు మాత్రం కాంట్రాక్టర్‌కు రూ.1.4 కోట్లు చెల్లించేశారు. ఆయా పనులను చేపట్టిన కాంట్రాక్టర్‌ను పనుల గురించి ఆరా తీయగా, అన్ని వర్కులకు మంజూరైన నిధులను ప్రహరీ నిర్మాణానికే వెచ్చించామని చెప్పుకొచ్చారు.

చేయని పనులకు బిల్లు చేసిన అధికారులెవరు?

ఏదైనా పని జరుగుతున్నట్టయితే ఇంజనీరింగ్‌ విభాగం నుంచి సంబంధిత వార్డు వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌/అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ దగ్గరుండి పర్యవేక్షించాలి. నాణ్యతతోపాటు డ్రాయింగ్‌లో పేర్కొన్నట్టు పని జరుగుతోందా?, లేదా? అని చూడాలి. పని పూర్తయిన తర్వాత క్వాలిటీ కంట్రోల్‌ అధికారులు వెళ్లి నాణ్యతను పరిశీలించి సర్టిఫికెట్‌ జారీచేయాలి. అనంతరం ఏఈ స్థాయి అధికారి అక్కడ జరిగిన పనికి కొలతలు వేసి, ఎం-బుక్‌లో రికార్డు చేయాలి. ఎం-బుక్‌ను డీబీలకు పంపించి సంబంధిత జోన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ద్వారా సంబంధిత అధికారికి బిల్లు పంపించాలి. అవసరమైతే ఏ అధికారి అయినా బిల్లుపై సంతకం చేసేముందు ఆయా పనులను పరిశీలించాలి. అయితే ఫేకర్‌ లేఅవుట్‌ పార్కులో పనులకు సంబంధించి ఈ ప్రక్రియ జరిగిందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అది సక్రమంగా జరిగినట్టయితే జరగని పనులకు బిల్లు చెల్లించాలని ఎలా ప్రతిపాదిస్తారంటూ ఎవరో ఒకరు ప్రశ్నించాలి. కానీ పనులు జరగకపోయినా కాంట్రాక్టర్‌కు బిల్లులు ఎలా చెల్లించారనేది అర్థం కావడం లేదు. ఒకవేళ అధికారులు, కాంట్రాక్టర్‌ చెబుతున్నట్టు వర్క్‌ డీవియేషన్‌ వెసులుబాటు కింద ఒకేపనికి ఆన్ని పనులకు సంబంధించిన డబ్బును ఖర్చు పెట్టేశారనుకున్నా...అక్కడ ప్రహరీ గోడ ఆ స్థాయిలో కనిపించడం లేదని ఇంజనీరింగ్‌ అధికారులు కొందరు చెబుతున్నారు. ఒకవేళ వర్క్‌ డీవియేషన్‌కు వెళ్లాలనుకుంటే ముందస్తు ఆమోదం తీసుకోవడంతోపాటు టెండర్‌ పిలిచిన వర్కు స్వభావానికి తగిన పనికే ఆ మొత్తాన్ని సర్దుబాటు చేయాల్సి ఉంటుంది తప్పితే, ఫౌంటెయిన్‌ కోసం మంజూరుచేసిన గ్రాంటును ప్రహరీకి ఖర్చు చేయడానికి వీల్లేదని అంటున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో పెద్దఎత్తున అవినీతి జరిగిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయా పనులు జరిగినట్టు రికార్డులో చూపించిన అధికారులు ఎవరు?, వాటిని గుడ్డిగా ధ్రువీకరించి బిల్లుకు సిఫారసు చేసింది ఎవరు?...ఎవరి పాత్ర ఎంత?...అనేది ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి నిగ్గుతేల్చాల్సిన అవసరం ఉంది.

Updated Date - Jul 16 , 2025 | 01:27 AM