పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వ తోడ్పాటు
ABN, Publish Date - Jul 20 , 2025 | 01:02 AM
పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం ఆయన ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో పర్యటించారు. ముందుగా సెజ్‌లో గల ఏపీఐఐసీ జోనల్ కార్యాలయాన్ని సందర్శించి సెజ్‌లో గల పారిశ్రామిక వేత్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు.
- ఎల్లప్పుడూ అండగా ఉంటాం
- సీఎం చంద్రబాబు బ్రాండ్‌తో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు
- 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయం
- మంత్రి టీజీ భరత్
అచ్యుతాపురం, జూలై 19 (ఆంధ్రజ్యోతి): పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు. శనివారం ఆయన ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో పర్యటించారు. ముందుగా సెజ్‌లో గల ఏపీఐఐసీ జోనల్ కార్యాలయాన్ని సందర్శించి సెజ్‌లో గల పారిశ్రామిక వేత్తలతో ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఇక్కడి పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వం నుంచి కోరుతున్న ఉపశమనాలు, స్థానికంగా ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. తమ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ వర్క్స్ చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బ్రాండ్‌తో ఏడాదిలోనే రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయని తెలిపారు. ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అంతకు ముందు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, ఇంజనీరింగ్ విభాగం సిబ్బందితో అనకాపల్లి జోన్‌లో ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్ట్ పనుల పురోగతిని సమీక్షించారు. నక్కపల్లి క్లస్టర్‌లో బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్, ఏఎంఎన్‌ఎస్ ప్రాజెక్టుల పురోగతి గురించి సిబ్బంది, కాంట్రాక్టర్‌లతో చర్చించారు. పూడిమడక వద్ద గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు పనుల పురోగతి గురించి సమీక్ష చేశారు. అలాగే ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధి, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన భూ కేటాయింపుల వివరాలు, ప్రాజెక్టుల అమలు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా అచ్యుతాపురం ఈటీపీ కేంద్రాన్ని సందర్శించి ప్రస్తుత వ్యర్థాల నిర్వహణ సామర్థ్యం, వ్యర్థాల నిర్వహణ కెపాసిటీ పెంపు గురించి ఆరా తీశారు. అనంతరం బ్రాండిక్స్, యోకోహామా, లారస్ కర్మాగారాలను సందర్శించారు.
Updated Date - Jul 20 , 2025 | 01:02 AM