ప్రభుత్వ భూమి కబ్జా
ABN, Publish Date - Aug 04 , 2025 | 11:45 PM
మండలంలోని వాడచీపురుపల్లి (ఈస్టు) రెవెన్యూ పరిధి సర్వే నంబరు 205లోగల ప్రభుత్వ భూమి ఆక్రమణను రెవెన్యూ సిబ్బంది సోమవారం అడ్డుకున్నారు.
వాడచీపురుపల్లిలో 55 సెంట్లు ఆక్రమణకు యత్నం
ఎక్స్‌కవేటర్‌తో చెట్లు కూల్చివేత
స్థానికుల ఫిర్యాదుతో అడ్డుకున్న రెవెన్యూ సిబ్బంది
పరవాడ, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని వాడచీపురుపల్లి (ఈస్టు) రెవెన్యూ పరిధి సర్వే నంబరు 205లోగల ప్రభుత్వ భూమి ఆక్రమణను రెవెన్యూ సిబ్బంది సోమవారం అడ్డుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. నాయుడుపాలెం పంచాయతీకి చెందిన కొంతమంది వ్యక్తులు, వాడచీపురుపల్లి (ఈస్టు) రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 205లోగల 55 సెంట్ల ప్రభుత్వ భూమిలో తాటిచెట్లు, జీడిమామిడి చెట్లను తొలగించి కబ్జా యత్నించారు. స్థానికులు ఈ విషయాన్ని రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు వీఆర్వో అప్పారావు, వీఆర్‌ఏలు వచ్చారు. వీరి రాకను గమనించిన ఆక్రమణదారులు అక్కడి నుంచి జారుకున్నారు. చెట్ల తొలగించడానికి ఉపయోగించిన ఎక్స్‌కవేటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా వాడచీపురుపల్లి (ఈస్టు) రెవెన్యూ పరిధి సర్వే నంబరు 205లో వున్న ప్రభుత్వ భూమిని కాపాడాలంటూ ముత్యాలమ్మపాలెం సర్పంచ్ చింతకాయల సుజాత సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌లో కలెక్టర్ విజయకృష్ణన్‌కు అర్జీ అందజేశారు. నాయుడుపాలెం పంచాయతీకి చెందిన బండారు పైడంనాయుడు, బండారు శ్రవణ్, బాలకృష్ణ, అప్పలరాజు, మరికొంతమంది వ్యక్తులు కలిసి ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు.
Updated Date - Aug 04 , 2025 | 11:45 PM