ప్రభుత్వ భూమి కబ్జా
ABN, Publish Date - May 26 , 2025 | 12:33 AM
మండలంలోని బాటజంగాలపాలెంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. మూడేళ్ల క్రితం సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకోగా.. పత్రికల్లో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. భూమిని స్వాధీనం చేసుకుని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మళ్లీ ఇటీవల ఈ భూమిని ఆక్రమించి, అందులో వున్న యూకలిప్టస్ తోటను ఆమేశాడు. అంతేకాక భూమిని చదును చేశాడు. ఇంతవరకు అధికారులు పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
బాటజంగాలపాలెంలో రెండు ఎకరాలు ఆక్రమణ
అందులో ఉన్న యూకలిప్టస్ తోట అమ్మకం
జిరాయితో కలిపి దున్నేసిన కబ్జాదారుడు
చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు
ఆక్రమించిన ప్రభుత్వ భూమి విలువ రూ.5 కోట్లు
సబ్బవరం, మే 25 (ఆంధ్రజ్యోతి): మండలంలోని బాటజంగాలపాలెంలో ప్రభుత్వ భూములకు రక్షణ లేకుండా పోయింది. మూడేళ్ల క్రితం సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని ఓ వ్యక్తి ఆక్రమించుకోగా.. పత్రికల్లో కథనాలు రావడంతో రెవెన్యూ అధికారులు స్పందించారు. భూమిని స్వాధీనం చేసుకుని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. మళ్లీ ఇటీవల ఈ భూమిని ఆక్రమించి, అందులో వున్న యూకలిప్టస్ తోటను ఆమేశాడు. అంతేకాక భూమిని చదును చేశాడు. ఇంతవరకు అధికారులు పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
మండలంలోని బాటజంగాలపాలెంలో రెవెన్యూ పరిధి సర్వే నంబరు 195లో 5.5 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమి మధ్యలో నుంచి కోడురు జంక్షన్-నారపాడు రోడ్డు వుంది. అంటే రోడ్డుకు ఇరువైపులా ప్రభుత్వ భూమి ఉంది. పక్కనే వున్న జిరాయితీ భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి నాలుగేళ్ల క్రితం సుమారు రెండు ఎకరాల మేర ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నాడు. ప్రభుత్వ భూమిలో అప్పటిఇకే యూకలిప్టస్ తోట వుంది. భూమి చుట్టూ కాంక్రీట్ పోల్స్‌తో ఫెన్సింగ్ వేస్తుండగా స్థానికులు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా రెవెన్యూ అధికారులు స్పందించకపోవడంతో ‘ఆంధ్రజ్యోతి’లో 2022 ఆగస్టు 24న ‘దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా’ శీర్షికతో కఽథనం వచ్చింది. దీంతో స్పందించిన అప్పటి తహసీల్దార్ కె.రమాదేవి ఆదేశాల మేరకు ఆర్‌ఐ రమణ ఫెన్సింగ్ తొలగించి, హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. కాగా ఇటీవల ఆక్రమణదారుడు ప్రభుత్వ భూమిలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డును తీసేశాడు. యూకలిప్టస్ తోటను ఆమ్మేసుకున్నాడు. జిరాయితీతోపాటు సర్వే నంబరు 195లో సుమారు రెండు ఎకరాల ప్రభుత్వ భూమిని చదును చేసి. ప్రభుత్వ భూమి ఆనవాళ్లు లేకుండా చేశాడు. కానీ ఇంతవరకు రెవెన్యూ అధికారులెవరూ అటువైపు కన్నెత్తి అయినా చూడలేదు. ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి జాతీయ రహదారికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ ఎకరా రూ.2.5 కోట్లు విలువ చేస్తుంది. కబ్జాకు గురైన ప్రభుత్వం భూమి రూ.5 కోట్లు వుంటుందని స్థానికులు చెబుతున్నారు. రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతోపాటు ఆక్రమించిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Updated Date - May 26 , 2025 | 12:33 AM