ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

భూ సమీకరణలో గోల్‌మాల్‌!

ABN, Publish Date - May 17 , 2025 | 12:45 AM

భూ సమీకరణ పరిహారం చెల్లింపుల ముసుగులో నిధులు స్వాహా అవుతున్నాయి. అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని అడ్డాగా చేసుకొని కొంతమంది పాలక పెద్దలు ఇటీవల గుట్టుగా సాగించిన భూసమీకరణ పరిహారం చెల్లింపుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కూటమి నేతల అండదండలతో భూ సమీకరణ నిబంధనలను పక్కన పెట్టి బినామీలకు పరిహారాన్ని దోచి పెట్టారు.

అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయం

ప్రభుత్వ భూమి.. రైతుల సాగులో ఉన్నట్టు రికార్డుల్లో నమోదు

‘సమీకరణ’ నిబంధనలు ఉల్లంఘన

కూటమికి చెందిన ఓ నేత, రెవెన్యూ అధికారులు, బినామీ రైతులు కుమ్మక్కు

ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లింపునకు డివిజన్‌స్థాయి అధికారి గ్రీన్‌ సిగ్నల్‌

ఆర్డీఓ కార్యాలయం నుంచే కదిలిన ఫైలు

31.38 ఎకరాలకు రూ.6.27 కోట్లు చెల్లింపు

అక్రమాలపై సీఎంఓకు వామపక్షాలు ఫిర్యాదు

(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)

భూ సమీకరణ పరిహారం చెల్లింపుల ముసుగులో నిధులు స్వాహా అవుతున్నాయి. అనకాపల్లి రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని అడ్డాగా చేసుకొని కొంతమంది పాలక పెద్దలు ఇటీవల గుట్టుగా సాగించిన భూసమీకరణ పరిహారం చెల్లింపుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కూటమి నేతల అండదండలతో భూ సమీకరణ నిబంధనలను పక్కన పెట్టి బినామీలకు పరిహారాన్ని దోచి పెట్టారు.

అనకాపల్లి మండలం కోడూరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబరు 20లోని 39 ఎకరాల 38 సెంట్ల ప్రభుత్వ భూమి 2009లో ఏపీఐఐసీకి దఖలు పడింది. అయితే ఈ భూమిని తొమ్మిది కుటుంబాలకు చెందిన 34 మంది సాగు చేస్తున్నట్టు రికార్డులు సృష్టించి, రూ.6.27 కోట్లు పరిహారం చెల్లించడం చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ అధికారులు, కూటమిలో ఒక పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, బినామీ రైతులు కుమ్మక్కై నిబంధనలను తుంగలో తొక్కారు. భూ సమీకరణ నిబంధనలను పక్కనపెట్టి, కోట్లాది రూపాయలు పరిహారంగా విడుదల చేయించారు. దీనిపై ‘నాడు అక్రమం.. నేడు సక్రమమా?’ శీర్షికతో గురువారం ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే.

వాస్తవానికి భూసమీకరణ చట్ట నిబంధనల ప్రకారం స్థానికంగా ఉంటూ ప్రభుత్వ భూములను సాగు చేసుకుంటున్న నిరుపేద రైతులకు మాత్రమే పరిహారం చెల్లించేందుకు గ్రామ సభలు నిర్వహించి అర్హులుగా ఎంపిక చేయాలి. కానీ అధికారులు నిబంధనలు పాటించలేదు. గ్రామ సభ నిర్వహించలేదు. కోడూరులోని 20వ సర్వే నంబరులో ఇతర మండలాలకు చెందిన రైతుల పేర్లను, సుమారు 40 నుంచి 50 కిలో మీటర్ల దూరంలో ఉన్న వారి పేర్లను చేర్చారు. అక్కడ నుంచి వచ్చి సాగు చేసుకొని వెళుతున్నట్టు రికార్డుల్లో నమోదు చేసి పరిహారం చెల్లించినట్టు తెలిసింది. అంతే కాకుండా 10 నుంచి 15 ఏళ్ల కిందట పెళ్లి అయి, భర్తతో కలిసి ఇతర ప్రాంతాల్లో నివాసం వుంటున్న ఇద్దరు మహిళలకు పరిహారం మంజూరు చేసినట్టు సమాచారం. వాస్తవానికి పరిహారం చెల్లింపుల వివరాలు, అర్హుల జాబితా, ఎవరికి ఎంత చెల్లించారనే వివరాలు ప్రభుత్వ ఆన్‌లైన్‌లో పొందుపర్చాలి. కానీ అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయంలో కోడూరులో 20వ సర్వే నంబరు భూసమీకరణ లావాదేవీలకు సంబంధించిన రికార్డులు ఏవీ అందుబాటులో లేకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. కూటమి నేతల ఒత్తిళ్లతకు తలొగ్గిన అధికారి ఒకరు ఫైలుపై సంతకం చేసి వ్యక్తిగత సెలవుపై వెళ్లినట్టు తెలిసింది.

ఆర్డీఓ కార్యాలయమే అడ్డాగా....

కోడూరులోని సర్వే నంబరు 20లో భూ సమీకరణ కింద భూములు ఇచ్చిన తొమ్మిది కుటుంబాలకు చెందిన 34 మందికి అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయ అధికారులు ఎకరాకు రూ.20 లక్షల చొప్పున 31 ఎకరాల 38 సెంట్లకు సుమారు రూ.6.27 కోట్లు ఈ నెల 10వ తేదీన విడుదల చేశారు. మిగిలిన ఎనిమిది ఎకరాలకు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ భూమి ప్రభుత్వ వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో ఇప్పటికీ ప్రభుత్వ బంజరుగానే నమోదై ఉంది. పరిహారం చెల్లింపులకు సంబంధించిన ఫైలు అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయం నుంచే కదిలింది. గతంలో తహసీల్దారు సమర్పించిన నివేదిక ఆధారంగా మొత్తం వ్యవహారం నడిపించినట్టు తెలిసింది. కూటమి నేత ఒకరు తెర వెనుక ఉండడంతో ఒక ముఖ్య అధికారి ఆదేశాలతో భూసమీకరణ పరిహారం చెల్లింపుల ఫైలు చకచకా కదిలిందని సమాచారం.

ర్డీఓ కార్యాలయంలో వివరాలు లేవట!

కోడూరులో భూ సమీకరణ కోసం భూముల ఇచ్చిన రైతుల వివరాలు, ఎంత మొత్తం చెల్లింపులు జరిగాయనే వివరాలు తమవద్ద లేవని, తహసీల్దారు కార్యాలయంలో ఉంటాయని ఇన్‌చార్జి ఆర్డీఓ శ్రీనివాసరావు, అనకాపల్లి ఆర్డీఓ కార్యాలయ సూపరింటెండెంట్‌ సుధాకర్‌ ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి తెలిపారు. అనకాపల్లి తహసీల్దారు విజయ్‌కుమార్‌ను వివరాలుఅడగ్గా.. ఆర్డీఓ కార్యాలయం ద్వారానే పరిహారం చెల్లింపులు జరిగాయని, తాను బాధ్యతలు చేపట్టక ముందే ఫైలు ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లిందని చెబుతున్నారు. మొత్తం వ్యవహారంలో అధికారుల తీరు అనుమానాలకు తావిస్తున్నది. ప్రభుత్వ భూమిని వేరే వ్యక్తుల సాగులో వున్నట్టు రికార్డుల్లో చూపించి ఆరు కోట్లరూపాయాలకుపైగా ప్రజా ధనాన్ని దోచిపెట్టిన/ దోచుకున్న వారిపై ఉన్నతస్థాయి అధికారులు లోతుగా విచారణకు జరిపిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. కాగా కోడూరులో భూసమీకరణ పేరుతో సాగిన అక్రమ చెల్లింపులపై ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కార్యాలయాలకు, సీసీఎల్‌ఏకు ఫిర్యాదు చేసేందుకు సీపీఐ, సీపీఎం నాయకులు సిద్ధమవుతున్నారు.

Updated Date - May 17 , 2025 | 12:45 AM