ఆయిల్ పామ్ తోటల్లో గంజాయి డెన్
ABN, Publish Date - May 30 , 2025 | 01:04 AM
రోలుగుంట మండలం కొంతలం- అడ్డసరం గ్రామాల మధ్య వున్న ఆయిల్ పామ్ తోటల్లో గురువారం తెల్లవారుజామున పోలీసులు దాడులు నిర్వహించి 750 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
పక్కా సమాచారంతో పోలీసుల దాడులు
750 కిలోల గంజాయి స్వాధీనం
తొమ్మిది మంది అరెస్టు, ఇద్దరు పరారీ
ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో కొనుగోలు
సీలేరు, మారేడుమిల్లి మీదుగా రోలుగుంట మండలానికి చేరిక
కొంతలం- అడ్డసరం మధ్య ఆయిల్ పామ్ తోటల్లో నిల్వ
రోలుగుంట/ అనకాపల్లి రూరల్, మే 29 (ఆంధ్రజ్యోతి) : రోలుగుంట మండలం కొంతలం- అడ్డసరం గ్రామాల మధ్య వున్న ఆయిల్ పామ్ తోటల్లో గురువారం తెల్లవారుజామున పోలీసులు దాడులు నిర్వహించి 750 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ తుహిన్ సిన్హా వెల్లడించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా వున్నాయి.
రోలుగుంట మండలం గొల్లపేటకు చెందిన వియ్యపు గోవింద, మాకవరపాలెం మండలం చంద్రయ్యపాలెం గ్రామానికి చెందిన బంగారు అప్పలనాయుడు కలిసి ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా కలిమెల గ్రామానికి చెందిన పాపుల వెంకటేశ్ నుంచి ఇటీవల 750 కిలోల గంజాయి కొనుగోలు చేశారు. అక్కడి నుంచి గంజాయిని రోలుగుంట మండలానికి తరలించడానికి అల్లూరి సీతారామరాజు జిల్లా, జీకేవీధికి చెందిన మడుల శివకుమార్, మరిగెల లక్ష్మణ్‌రెడ్డి కారును సమకూర్చారు. గంజాయిని ఇక్కడకు చేర్చడానికి, నిల్వ చేయడానికి రోలుగుంటకు చెందిన తమరాన వెంకట శ్రీనివాస రాజా, రోలుగుంట మండలం అంట్లపాలెం గ్రామానికి చెందిన బొడ్డు నానాజీ, నర్సీపట్నం మండలం, దుగ్గాడకు చెందిన నల్లబెల్లి అంజిబాబు, నర్సీపట్నం మునిసిపాలిటీకి చెందిన కడిమి రాజేశ్ సహకరించారు. ఒడిశాలో కొనుగోలు చేసిన గంజాయిలో తొలుత 600 కిలోల సరకును నాలుగు రోజుల క్రితం కారులో మల్కన్‌గిరి జిల్లా నుంచి సీలేరు, మారేడుమిల్లి మీదుగా రోలుగుంట మండలం కొంతలం- అడ్డసరం గ్రామాల మధ్య వున్న ఆయిల్‌పామ్ తోటల వద్దకు చేర్చారు. గురువారం తెల్లవారుజామున మరో 150 కిలోల గంజాయిని కారులో నిల్వ స్థావరం వద్దకు తీసుకువచ్చారు. అప్పటికే మాటువేసిన పోలీసులు వాహనాన్ని పట్టుకున్నారు. కారులో వున్న గంజాయితోపాటు ఆయిల్ పామ్ తోటలో నిల్వ చేసిన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పరారయ్యారు. ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయిని తూకం వేసి 750 కిలోలు వున్నట్టు నిర్ధారించారు. వియ్యపు గోవిందకు ఇప్పటికే నాలుగు నల్లబెల్లి అంజిబాబుపై రెండు గంజాయి కేసులు వున్నాయి. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. భారీ మొత్తంలో గంజాయిని, నిందితులను పట్టుకున్న రోలుగుంట ఎస్‌ఐరామకృష్ణారావు, కొత్తకోట ఎస్‌ఐ ఎం.శ్రీనివాసరావు, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ప్రశంసా పత్రాలు, నగదు రివార్డులను అందించారు. మీడియా సమావేశంలో అదనపు ఎస్పీలు ఎం.దేవప్రసాద్, ఎల్.మోహనరావు, సబ్ డివిజన్ డీఎస్పీ ఎం.శ్రావణి, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 30 , 2025 | 01:04 AM