నేటి నుంచి పూర్తిస్థాయిలో ఇంటర్ మూల్యాంకనం
ABN, Publish Date - Mar 19 , 2025 | 01:22 AM
జిల్లాలో ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని బుధవారం నుంచి పూర్తిస్థాయిలో చేపట్టనున్నారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో ప్రక్రియ
మహిళా కళాశాలలో పకడ్బందీగా ఏర్పాట్లు
నెలాఖరుకు పూర్తి
ఆర్‌ఐవో మురళీధర్
వచ్చే నెల రెండో వారంలో ఫలితాలు విడుదల?
మద్దిలపాలెం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి):
జిల్లాలో ఇంటర్మీడియట్ జవాబుపత్రాల మూల్యాంకనాన్ని బుధవారం నుంచి పూర్తిస్థాయిలో చేపట్టనున్నారు. ప్రస్తుతం జైలు రోడ్డులోని మహిళా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒక్కపూట మాత్రమే నిర్వహిస్తున్న ఈ ప్రక్రియను ఇక నుంచీ రెండు పూటలా కొనసాగిస్తారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మూల్యాంకనం జరుగుతుందని ఆర్‌ఐవో బి.మురళీధర్ తెలిపారు.
పిఠాపురం కాలనీలో ఉన్న ఆర్‌ఐవో కార్యాలయం డీఆర్‌డీసీ సెంటర్‌కు ఇతర జిల్లాల నుంచి సుమారు 3.7 లక్షల జవాబు పత్రాలు వచ్చాయి. ఇతర జిల్లాల నుంచి వచ్చిన నలుగురు అధ్యాపకులను డీఆర్‌డీసీ అధికారులుగా నియమించారు. వారే ప్రతిరోజూ జవాబు పత్రాలను స్పాట్ వాల్యూయేషన్ సెంటర్‌కు తరలిస్తారు. సెంటర్‌లో మరో బృందం జవాబుపత్రాలపై ఉన్న ఓఎంఆర్ షీట్స్ (విద్యార్థి వివరాలు)ను తీసివేసి, కోడింగ్ చేస్తుందని, మూల్యాంకనానికి 1,100 మందిని నియమించినట్టు ఆర్‌ఐవో తెలిపారు. పేపర్లు కోడింగ్ చేసి సిబ్బంది వెళ్లిపోయాక, ఎగ్జామినర్లు వచ్చి మూల్యాంకనం చేస్తారని, సబ్జెక్ట్‌ల వారీగా అధ్యాపకులు రోజుకు 30 పేపర్లు చొప్పున దిద్దుతారని చెప్పారు. ఒక్కో పేపర్‌కు రూ.23.66, టీఏ, డీఏ, లోకల్ కన్వేయన్స్/అవుట్ స్టేషన్ అలవెన్స్ చెల్లిస్తారు.
సీసీ కెమెరాల పర్యవేక్షణలో...
ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. క్యాంప్ ఆఫీసర్, ఏసీవో, సీపీవో, కోడింగ్ అఽధికారులు స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఒకటో విడతలో తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మాథ్స్, సివిక్స్ జవాబుపత్రాల మూల్యాంకనం జరుగుతోంది. 22వ తేదీ నుంచి ప్రారంభమయ్యే రెండో విడతలో ఫిజిక్స్, ఎకానమిక్స్, జీఎఫ్‌సీ, 24వ తేదీ నుంచి జరిగే మూడో విడత కెమిస్ర్టీ, హిస్టరీ, 26వ తేదీ నుంచి నిర్వహించే నాలుగో విడతలో కామర్స్, బోటనీ, జువాలజీ, బ్రిడ్జ్ కోర్సు జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తారు. విధులకు హాజరయ్యే ఎగ్జామినర్ల సంఖ్యను బట్టి ఈ నెల 31 లేదా ఏప్రిల్ రెండో తేదీ నాటికి ప్రక్రియను పూర్తిచేస్తామని ఆర్‌ఐవో తెలిపారు. ప్రథమ, ద్వితీయ పరీక్షా ఫలితాలను ఇంటర్ బోర్డు ఏప్రిల్ రెండో వారంలో విడుదల చేసే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మెట్రో రైలు మొబిలిటీ ప్లాన్‌కు రూ.84.47 లక్షలు
విశాఖపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి):
విశాఖపట్నంలో మెట్రో రైలు ప్రాజెక్టుకు సంబంధించి మొబిలిట్ ప్లాన్ రూపొందించడానికి కేంద్ర అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ విభాగం రూ.71.58 లక్షలు మంజూరు చేసింది. దీనికి సిస్ర్టా ఎంవీఏ సంస్థను కన్సల్టెన్సీగా ఎంపిక చేశారు. వారికి 18 శాతం జీఎస్‌టీతో కలుపుకొని రూ.84.47 లక్షలు చెల్లిస్తారు. ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఈ పనులు జరుగుతాయి.
నేడు టీడీపీలో వైసీపీ కార్పొరేటర్లు చేరిక
విశాఖపట్నం, మార్చి 18 (ఆంధ్రజ్యోతి:
టీడీపీలో వైసీపీ కార్పొరేటర్ల చేరిక వాయిదా పడింది. వైసీపీకి చెందిన ఎనిమిది మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరేందుకు సోమవారం సాయంత్రం ఆ పార్టీ ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివా్‌సతో కలిసి విజయవాడ వెళ్లారు. మంగళవారం ఉదయం మంత్రి నారా లోకేష్ సమక్షంలో వారంతా టీడీపీ కండువాలు కప్పుకోవాల్సి ఉంది. అయితే మంత్రి బిజీగా ఉండడంతో చేరికల కార్యక్రమాన్ని బుధవారం ఉదయానికి వాయిదా వేశారు. టీడీపీలో చేరేందుకు వైసీపీకి చెందిన కెల్ల సునీత, గేదెల లావణ్య, ముర్రు వాణి, భూపతిరాజు సునీత సోమవారం విజయవాడ వె ళ్లారు. వీరితోపాటు మరో నలుగురు కార్పొరేటర్లు కూడా విజయవాడ వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే వారెవరనే సమాచారాన్ని టీడీపీ వర్గాలు గోప్యంగా ఉంచుతున్నాయి. ఇదిలావుండగా మరో ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు రెండు, మూడు రోజుల్లో జనసేనలో చేరతారని ప్రచారం జరుగుతోంది. తమ కార్పొరేటర్లను కాపాడుకునేందుకు వైసీపీ నేతలు ఇప్పటికే రంగంలోకి దిగి వారికి హామీలు ఇచ్చే పనిలో పడ్డారు.
Updated Date - Mar 19 , 2025 | 01:22 AM