కాలుష్యం నుంచి విముక్తి
ABN, Publish Date - May 29 , 2025 | 01:39 AM
జీవీఎంసీ 87వ వార్డు తిరుమలనగర్, సిద్ధార్థ నగర్, పాత వడ్లపూడి, కాళింగుల వీధి, తారకరామా నగర్‌లను దీర్ఘకాలంగా వేధిస్తున్న చెత్త సమస్యకు పరిష్కారం లభించింది. ఐలా కమిషనర్ ఎ.కిషోర్ ఆదేశాల మేరకు బుధవారం నుంచి చెత్తను కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలించడం ప్రారంభించారు. ఆటోనగర్ బ్లాకులో పలు కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలను మూడేళ్ల నుంచి ఓ ఖాళీ స్థలంలో వేయడంతో డంపింగ్ యార్డుగా మారింది.
అనధికార డంపింగ్ యార్డు చుట్టూ ప్రహరీ గోడ నిర్మించిన ఐలా కమిషనర్
ఇప్పటికే అక్కడ ఉన్న చెత్త కాపులుప్పాడ యార్డుకు తరలింపు
తిరుమలనగర్ వాసుల హర్షం
కూర్మన్నపాలెం, మే 28 (ఆంధ్రజ్యోతి):
జీవీఎంసీ 87వ వార్డు తిరుమలనగర్, సిద్ధార్థ నగర్, పాత వడ్లపూడి, కాళింగుల వీధి, తారకరామా నగర్‌లను దీర్ఘకాలంగా వేధిస్తున్న చెత్త సమస్యకు పరిష్కారం లభించింది. ఐలా కమిషనర్ ఎ.కిషోర్ ఆదేశాల మేరకు బుధవారం నుంచి చెత్తను కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలించడం ప్రారంభించారు. ఆటోనగర్ బ్లాకులో పలు కర్మాగారాల నుంచి వెలువడే వ్యర్థాలను మూడేళ్ల నుంచి ఓ ఖాళీ స్థలంలో వేయడంతో డంపింగ్ యార్డుగా మారింది. పరిశ్రమల నిర్వాహకులతో పాటు వివిధ ప్రాంతాలవారు రాత్రి పూట వాహనాలలో వ్యర్థాలను తీసుకువచ్చి అక్కడ పడేసేవారు. ప్రతి శనివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆ వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో తిరుమలనగర్, సిద్ధార్థ నగర్, పాత వడ్లపూడి ప్రాంతాల వాసులు పొగతో ఇబ్బందిపడేవారు. వృద్ధులు, చిన్నారులు అస్వస్థతకు గురై శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొనేవారు. అక్కడ వ్యర్థాలను తొలగించాలని జీవీఎంసీ అధికారులకు, ప్రజా ప్రతినిధులకు, ఐలా అధికారులకు స్థానికులు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో జనవరి 28న తిరుమలనగర్‌లో ‘ఆంధ్రజ్యోతి’ నిర్వహించిన ‘అక్షరం అండగా, పరిష్కారమే అజెండా’గా కార్యక్రమంలో పాల్గొన్న అధికారుల దృష్టికి స్థానికులు ఈ సమస్యను తీసుకువచ్చారు. ఆ ఖాళీ స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని కోరారు. కార్పొరేటర్ బొండా జగన్ ఈ సమస్యను ఏఎంహెచ్‌ఓ కిరణ్ కుమార్, ఐలా కమిషనర్ విల్లి కిషోర్‌ల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఐలా కమిషనర్ కిషోర్ సుమారు రూ.7 లక్షలతో డంపింగ్ యార్డుగా మారిన స్థలం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించారు. సెక్యూరిటీ గార్డును ఏర్పాటుచేశారు. ఇప్పటికే అక్కడ ఉన్న చెత్తను కాపులుప్పాడ డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. చెత్తను పూర్తిగా తరలించాక, సీసీ కెమెరాలను కూడా ఏర్పాటుచేయనున్నట్టు ఐలా కమిషనర్ అయినవిల్లి కిషోర్ తెలిపారు. తమ సమస్యకు పరిష్కారం చూపిన ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికకు, ఐలా కమిషనర్‌కు, కార్పొరేటర్ బొండా జగన్‌కు తిరుమల నగర్ కాలనీ వాసులు ధన్యవాదాలు తెలిపారు.
Updated Date - May 30 , 2025 | 03:04 PM