మామూళ్ల కోసం ఫోర్స్
ABN, Publish Date - Jul 03 , 2025 | 01:13 AM
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక అధికారాలు కలిగిన ఒక విభాగం మద్యం దుకాణాల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విభాగం పేరుతో కొందరు కానిస్టేబుళ్లు మద్యం దుకాణం నుంచి నెలకు రూ.రెండు వేలు, బార్‌ల నుంచి రూ.ఐదు వేలు చొప్పున వసూలు చేస్తున్నారు.
ఒక్కో మద్యం దుకాణం నుంచి నెలకు రూ.2 వేలు
బార్‌ల నుంచి రూ.ఐదు వేలు
డబ్బులు తీసుకుంటూ కూడా కేసులు
నమోదు చేస్తున్నారంటూ వ్యాపారులు గగ్గోలు
నగర పోలీస్ కమిషనర్ హెచ్చరికలు బేఖాతరు
విశాఖపట్నం, జూలై 2 (ఆంధ్రజ్యోతి):
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక అధికారాలు కలిగిన ఒక విభాగం మద్యం దుకాణాల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విభాగం పేరుతో కొందరు కానిస్టేబుళ్లు మద్యం దుకాణం నుంచి నెలకు రూ.రెండు వేలు, బార్‌ల నుంచి రూ.ఐదు వేలు చొప్పున వసూలు చేస్తున్నారు.
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో 142 మద్యం దుకాణాలు, 125 బార్‌లు ఉన్నాయి. దుకాణాల నుంచి నెలకు రూ.రెండు వేలు చొప్పున రూ.2.84 లక్షలు, బార్‌ల నుంచి నెలకు రూ.ఐదు వేలు చొప్పున రూ.6.25 లక్షలు వసూలవుతోంది. ఆ మొత్తం ఎవరెవరికి చేరుతుందనే దానిపై అనేక రకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం దుకాణాల నుంచి పోలీసులు నెలవారీ మామూళ్లు వసూలుచేయడం, పెట్రోలింగ్ సిబ్బంది బీచ్‌కు వచ్చే సందర్శకులు, పర్యాటకులు ఎవరైనా మద్యం సేవిస్తే వారిని బెదిరించి డబ్బులు వసూలు చేయడంపై నేరుగా సీపీకి కొందరు ఫిర్యాదు చేయడంతో అధికారులను పిలిచి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరైనా మద్యం దుకాణాల జోలికి వెళితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో కొందరు పోలీసులు మద్యం దుకాణాలకు దూరంగా ఉండగా, మరికొందరు మాత్రం ఇప్పటికీ వసూళ్లపర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఇక పోలీస్ శాఖలో ప్రత్యేక అధికారాలు కలిగిన ఒక విభాగం కూడా మామూళ్ల కోసం మద్యం వ్యాపారులను ‘ఫోర్స్’ చేస్తున్నట్టు వ్యాపారులే ఆరోపిస్తున్నారు. తమ నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటూనే ఎవరైనా పండుగలు, ఫంక్షన్లకు కాస్త ఎక్కువ సంఖ్యలో మద్యం సీసాలను తీసుకువెళ్లినా, ఇంట్లో దాచిపెట్టుకున్నా దాడులు చేసి వారిపై కేసులు నమోదుచేస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. సీపీ శంఖబ్రతబాగ్చి ఇప్పటికైనా పోలీస్ శాఖలో మామూళ్ల కోసం ’ఫోర్స్’ చేస్తున్న విభాగంపై దృష్టిసారించాలని కోరుతున్నారు.
Updated Date - Jul 03 , 2025 | 01:13 AM