ఉపాధ్యాయుల సమయపాలనపై దృష్టి
ABN, Publish Date - Jun 25 , 2025 | 12:58 AM
ఉపాధ్యాయుల సమయపాలనపై విద్యా శాఖ దృష్టి సారించింది. విద్యార్థులకు కిట్లు పంపిణీ, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో సిలబస్ బోధన, పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల విధులకు సంబంధించి పక్కాగా వ్యవహరించాలని నిర్ణయించింది.
ఉదయం 9 గంటలకల్లా హాజరుకావాలి
సాయంత్రం 4 గంటల వరకూ బడిలోనే ఉండాలి
జూలై ఒకటో తేదీ నుంచి అమలు
పాఠశాలల నిర్వహణపైనా ప్రత్యేక ఫోకస్
పాఠశాలల పనితీరుపై ప్రతిరోజు ఆర్జేడీలు, డీఈవోలు, ఎంఈవోలతో విద్యా శాఖ కమిషనర్
టీచర్లను పాఠాలకే పరిమితం చేయాలి:
ఉపాధ్యాయ సంఘాలు
విశాఖపట్నం, జూన్ 24 (ఆంధ్రజ్యోతి):
ఉపాధ్యాయుల సమయపాలనపై విద్యా శాఖ దృష్టి సారించింది. విద్యార్థులకు కిట్లు పంపిణీ, ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో సిలబస్ బోధన, పాఠశాలల నిర్వహణ, ఉపాధ్యాయుల విధులకు సంబంధించి పక్కాగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఈ మేరకు టీచర్లకు ఫండమెంటల్ లెర్నింగ్ పేరిట శిక్షణ ఇవ్వనున్నది. ఆ తరువాత జూలై ఒకటి నుంచి పాఠశాలల నిర్వహణపై విద్యా శాఖ రూపొందించే మార్గదర్శకాలను అమలు చేయనున్నది.
సమయపాలపై దృష్టి
ఇందులో భాగంగా ఉపాధ్యాయులు ప్రతిరోజూ ఉదయం తొమ్మిది గంటలకు పాఠశాలకు హాజరుకావాలని, సాయంత్రం నాలుగు గంటల వరకూ ఉండాలని ఆదేశించింది. ఉదయం 9.30 గంటలకు ఉపాధ్యాయుడు, విద్యార్థి హాజరు పూర్తిచేయాలి. ఈ ప్రక్రియ పూర్తిచేయకపోతే వెంటనే ఎంఈవో సమాచారం తెప్పించుకోవాలి. పాఠశాలలో సమావేశాలను సాయంత్రం నాలుగు గంటల తరువాత మాత్రమే నిర్వహించాలి. ప్రభుత్వ పాఠశాలల పనితీరు, విద్యార్థుల ప్రవేశంపై విమర్శలు వెల్లువెత్తుతుండడంతో పాఠశాల విద్యా శాఖ ఈ కార్యక్రమాన్ని రూపొందించిందనే వాదన వినిపిస్తోంది. విద్యార్థులకు అన్ని రకాల వస్తువులతో కిట్లు, మధ్యాహ్న భోజన పథకం కోసం కొత్తగా సన్నబియ్యం పంపిణీ చేశారు. సిలబస్‌లో మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో పాఠశాలల్లో టీచర్ల సమయపాలన, వారి పరితీరును మదింపుచేయాలని అధికారులు నిర్ణయించారు.
ఒకటో తేదీ నుంచీ అమలు
జూలై ఒకటో తేదీ నుంచి పాఠశాలల పనితీరుపై విద్యా శాఖ కమిషనర్ ప్రతిరోజు ఉదయం పది గంటలకు ఆర్జేడీలు, డీఈవోలు, ఎంఈవోలతో వెబెక్స్ నిర్వహించనున్నారు. ప్రతి జిల్లాలో పాఠశాలలు, టీచర్ల పనితీరు, హాజరు, సమయపాలనను అమరావతిలో మానటరింగ్ సెల్ పర్యవేక్షించనున్నది. ఈ నేపథ్యంలో టీచర్లు అకడమిక్‌గా దృష్టిసారించడంతోపాటు సమయపాలన పాటించాలని డీఈవో ప్రేమ్‌కుమార్ పేర్కొన్నారు. రెండు, మూడు రోజుల్లో టీచర్లకు ఫండమెంటల్ లెర్నింగ్, ఇతర అంశాలపై శిక్షణ ఇస్తామన్నారు.
బోధనకే పరిమితం చేయండి
టీచర్లకు సమయపాలన అమలుచేయడం మంచిదేనని ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమంది పైడిరాజు అన్నారు. విధి నిర్వహణలో టీచర్లు ఎప్పుడూ ముందుంటారని, అయితే కేవలం బోధన విధులు మాత్రమే అప్పగించాలని కోరారు. సంబంధం లేని పనులు అప్పగిస్తే బోధనపై తీవ్ర ప్రభావం చూపుతుందని, గతంలో అనవసర యాప్‌ల పేరిట తీవ్ర మానసిక వేదనకు గురయ్యామన్నారు.
Updated Date - Jun 25 , 2025 | 12:58 AM