రేషన్ కార్డులకు దరఖాస్తుల వెల్లువ
ABN, Publish Date - May 28 , 2025 | 12:30 AM
కొత్త రేషన్ కార్డులతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లోకి కొత్తగా కుటుంబ సభ్యుల చేరిక, కార్డుల విభజన, చిరునామా మార్పు, తప్పుల సవరణ వంటి వాటి కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. అయితే పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్, సర్వర్ మొరాయిస్తుండడంతో దరఖాస్తు ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
ఇంతవరకు 23,010 అప్లికేషన్లు అప్‌లోడ్
సర్వర్ మొరాయిస్తుండడంతో దరఖాస్తుదారుల ఇక్కట్లు
వాట్సాప్ ‘మన మిత్ర’లో పౌరసరఫరాల సేవలు
(అనకాపల్లి-ఆంధ్రజ్యోతి)
కొత్త రేషన్ కార్డులతోపాటు ఇప్పటికే ఉన్న కార్డుల్లోకి కొత్తగా కుటుంబ సభ్యుల చేరిక, కార్డుల విభజన, చిరునామా మార్పు, తప్పుల సవరణ వంటి వాటి కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. అయితే పౌరసరఫరాల శాఖ వెబ్‌సైట్, సర్వర్ మొరాయిస్తుండడంతో దరఖాస్తు ప్రక్రియ మందకొడిగా సాగుతున్నది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో వాట్సాప్ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది.
కొత్త రేషన్ కార్డుల జారీ, ఇప్పటికే వున్న కార్డుల్లో తప్పుల సవరణ, చిరునామాల మార్పు, కుటుంబంలో కొత్తగా పెళ్లయిన వారి కోసం కార్డుల విభజన, చనిపోయిన వారి పేర్ల తొలగింపు, తదితర వాటి కోసం ఈ నెల ఏడో తేదీ నుంచి పౌరసరఫరాల శాఖ అధికారులు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తరువాత సమీపంలోని సచివాలయానికి వెళ్లి ఓటీపీ ద్వారా ఈకేవైసీ చేయించుకోవాలి. అయితే పౌరసరఫరాల శాఖ సర్వర్ మొరాయిస్తుండడంతో దరఖాస్తులు అప్‌లోడ్, ఈకేవైసీ వంటివి బాగా ఆలస్యం అవుతున్నాయి. శివారు పంచాయతీల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీ సరిగా లేకపోవడంతో సచివాలయాలకు పలుమార్లు వెళ్లాల్సి వస్తున్నది. ప్రభుత్వ డ్యాష్ బోర్డులోని వివరాల ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు 23,010 దరఖాస్తులు అందాయి. వివిధ కారణాల వల్ల 439 దరఖాస్తులను తిరస్కరించారు. అత్యధికంగా అనకాపల్లి మండలంలో 1,530, అత్యల్పంగా ఎలమంచిలి మండలంలో 428 మంది దరఖాస్తు చేసుకున్నారు.
వాట్సాప్ ద్వారా దరఖాస్తు
సచివాలయాల్లో సర్వర్లు మొరాయిస్తుండడంతో ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్‌లో భాగంగా శనివారం నుంచి ‘మన మిత్ర’లో పౌరసరఫరాల సేవలను అందుబాటులోకి తెచ్చింది. వాట్సాప్‌లోకి వెళ్లి 95523 00009 నంబర్‌ను టైప్ చేస్తే ‘మన మిత్ర’ అని వస్తుంది. ఇక్కడ ఇంగ్లిష్‌లో ‘హాయ్’ అని టైప్ చేస్తే ప్రభుత్వానికి సంబంధించి పలు శాఖల సేవలు కనిపిస్తాయి. ఇందులో పౌరసరఫరాల శాఖ సేవలు కూడా వుంటాయి. రేషన్ కార్డులకు సంబంధించిన దరఖాస్తులను ‘మన మిత్ర’ ద్వారా చేసుకోవచ్చు. తరువాత ఈకేవైసీ కోసం సమీపంలోని సచివాలయానికి వెళ్లాల్సి వుంటుంది.
రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
కేవీఎల్‌ఎన్ మూర్తి, జిల్లా సరఫరాల అధికారి
కొత్త రేషన్ కార్డుల జారీ అనేది నిరంతర ప్రక్రియ. దరఖాస్తుకు గడువు అంటూ లేదు. కొత్త రేషన్ కార్డులు, ఇప్పటికే వున్న కార్డుల్లో చేర్పులు, మార్పుల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు అందుతున్నాయి. కొన్నిచోట్ల సర్వర్లు మొరాయిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ సమస్యను అధిగమించడానికి ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా పౌరసరఫరాల సేవలను అందుబాటులోకి తెచ్చింది. ఆండ్రాయిడ్ ఫోన్ వుంటే ‘మన మిత్ర’ ద్వారా సేవలను పొందవచ్చు.
Updated Date - May 28 , 2025 | 12:30 AM