ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఐదుగురి గుప్పిట్లో నైట్‌ ఫుడ్‌ కోర్టు

ABN, Publish Date - Jul 01 , 2025 | 01:33 AM

పాత జైలురోడ్డులో అనధికారికంగా నడుస్తున్న నైట్‌ ఫుడ్‌కోర్డులో రాజకీయ నేతల అండదండలు కలిగిన కొందరు చక్రం తిప్పుతున్నారు.

  • నాడు వైసీపీ నేతల అండదండలతో అనధికారికంగా ఏర్పాటు

  • ఒక్కొక్కరి చేతిలో పదేసి దుకాణాలు

  • నెలకు రూ.15 వేలకు చొప్పున అద్దెకు ఇచ్చుకుంటున్న వైనం

  • మిగిలిన స్థలం 36 చదరపు గజాల స్థలం చొప్పున మార్కింగ్‌ చేసి

  • రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు అమ్మకం

  • ఎవరైనా ప్రశ్నిస్తే రాజకీయ నేతల పేర్లు చెప్పి బెదిరింపు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

పాత జైలురోడ్డులో అనధికారికంగా నడుస్తున్న నైట్‌ ఫుడ్‌కోర్డులో రాజకీయ నేతల అండదండలు కలిగిన కొందరు చక్రం తిప్పుతున్నారు. అక్కడ దుకాణం పెట్టుకోదలచిన వారి నుంచి నెలకు రూ.15 వేలు అద్దె వసూలుచేస్తున్నారు. అంతకంటే ఎవరైనా ఎక్కువ అద్దె ఇస్తామని వస్తే అప్పటికే ఉన్నవారిని ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఎవరైనా అభ్యంతరం చెబితే తమ పొలిటికల్‌ బ్యాక్‌ గ్రౌండ్‌ను తట్టుకుని బతకలేవంటూ బెదిరిస్తున్నారు.

నగరంలో రాత్రివేళ ఆహారం అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతో 2019లో జీవీఎంసీ, వీఎంఆర్‌డీఏ సంయుక్తంగా పాతజైలురోడ్డులో నైట్‌ఫుడ్‌కోర్ట్‌ను ప్రారంభించాయి. జీవీఎంసీ యూసీడీ ద్వారా ఎంపిక చేసిన 32 మంది ఫుడ్‌కోర్ట్‌లో స్టాళ్లు ఏర్పాటుచేసుకున్నారు. కరోనా సమయంలో ఫుడ్‌కోర్ట్‌ను మూసివేశారు. ఆ తర్వాత జీవీఎంసీ ఫుడ్‌కోర్ట్‌కు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో అక్కడ వ్యాపారాలు సాగించిన ఐదుగురు...అప్పటి వైసీపీ నేతలను ప్రసన్నం చేసుకుని 170 దుకాణాలను ఏర్పాటుచేశారు. పదేసి చొప్పున దుకాణాలను తమ చేతిలో ఉంచుకుని అద్దెకు ఇచ్చుకున్నారు. మిగిలిన వాటిని ఆసక్తి కలిగిన వ్యాపారులకు 36 చదరపు గజాలు స్థలం చొప్పున మార్కింగ్‌ చేసి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు అమ్ముకున్నారు. ఫుడ్‌కోర్టు కారణంగా పారిశుధ్య సమస్య తలెత్తుతుండడం, అదేవిధంగా జీవీఎంసీకి ఒక్క రూపాయి ఆదాయం కూడా రాకపోవడంతో దానిని ఎత్తివేయాలంటూ టీడీపీ, జనసేన కార్పొరేటర్లు కౌన్సిల్‌ సమావేశంలో డిమాండ్‌ చేశారు. దీంతో ఏడాది కిందట కౌన్సిల్‌ సమావేశంలో ఫుడ్‌కోర్డును తొలగించాలని తీర్మానం చేశారు. అయినప్పటికీ జీవీఎంసీ అధికారులు ఫుడ్‌కోర్ట్‌ను తొలగించే ప్రయత్నం చేయలేదు. దీనిపై జనసేన కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌ ఇటీవల హైకోర్టులో పిల్‌ దాఖలు చేయడంతో జూన్‌ 16లోగా కౌంటర్‌ దాఖలు చేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించింది.

ఇటీవల ఫుడ్‌కోర్టులో ఒక యువకుడు ఐస్‌క్రీమ్‌ దుకాణం ఏర్పాటుచేయాలనుకున్నాడు. అందుకోసం ఆ ఐదుగురిలో ఒకరిని సంప్రతించాడు. దుకాణాలు ఖాళీ లేవని చెబుతూ, 18 చదరపు అగురులు స్థలం కలిగినవి ఉన్నాయని, వారంతా రూ.12 వేలు అద్దె ఇస్తున్నందున, రూ.15 వేలు అద్దె ఇవ్వడానికి సిద్ధపడితే ఒకరిని ఖాళీ చేయించి ఆ స్థలం ఇస్తానని ప్రతిపాదించాడు. దీనికి యువకుడు సరేననడంతో రెండు నెలలు అద్దెను అడ్వాన్స్‌గా తీసుకున్నాడు. యువకుడు దుకాణం ఏర్పాటుకు స్టాల్‌ను తయారుచేయించుకుని ఫుడ్‌కోర్టు సమీపంలో ఉంచాడు. గుజరాత్‌ నుంచి రూ.3.5 లక్షలు వెచ్చించి యంత్రాలను కొనుగోలు చేశాడు. వచ్చే నెల నాలుగున దుకాణం ప్రారంభించాలనుకుంటున్నట్టు స్థలం అద్దెకు ఇచ్చిన వ్యక్తికి చెప్పాడు. అయితే ఆ స్థలాన్ని తాను ఇవ్వడం లేదని, అడ్వాన్స్‌ను వెనక్కి ఇచ్చేస్తున్నానంటూ ఫోన్‌పే ద్వారా యువకుడికి తిరిగి చెల్లించాడు. దీంతో కంగుతిన్న యువకుడు తాను రూ.3.5 లక్షలు పెట్టి యంత్రాలు కొనుగోలు చేయడంతోపాటు స్టాల్‌ను తయారుచేయించుకున్నానని, ఇప్పుడు కాదంటే తన పరిస్థితి ఏమిటని ప్రశ్నించాడు. తాను దుకాణం పెట్టి తీరతానని చెప్పడంతో ‘నా పొలిటికల్‌ బ్యాంక్‌ గ్రౌండ్‌ తెలిస్తే తట్టుకుని బతకలేవు. ఎమ్మెల్యేలు నాకు అండగా ఉన్నారని’ బెదిరించాడు. ఇదే తరహాలో ఐదుగురిలో మరొకరు...అధిక అద్దె ఆశపడి...ఇప్పటికే ఉన్న దుకాణాన్ని తొలగించాడు. ఫుడ్‌కోర్ట్‌లో దళారీల ఆగడాలను అరికట్టడంతోపాటు తమకు దుకాణం పెట్టుకుని ఉపాధి పొందేలే స్థలం ఇప్పించాలని కోరేందుకు బాధితులు ఇద్దరూ సోమవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు వెళ్లారు. ఈ విషయం అడ్వాన్స్‌ వెనక్కి ఇచ్చిన వ్యక్తికి తెలియడంతో... ఒకరు బాధిత యువకుడికి ఫోన్‌ చేసి ‘అనవసరంగా నన్ను రెచ్చగొడుతున్నావ్‌...తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం ఉండదని’ బెదిరించాడు. దీంతో వారిద్దరూ తమకు ఎక్కడైనా దుకాణం పెట్టుకునేందుకు స్థలం ఇప్పించి ఉపాధి కల్పించాలని కోరుతూ కమిషనర్‌కు వినతిపత్రం అందజేసి వెనుతిరిగారు. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు అనధికార ఫుడ్‌కోర్టు విషయంలో ఎందుకు జోక్యంచేసుకోవడం లేదనేది అర్థం కావడం లేదని కార్పొరేటర్లు, ఇతర అధికారులు అంటున్నారు.

Updated Date - Jul 01 , 2025 | 01:33 AM