రైతుకు ఆర్థిక ఆసరా!
ABN, Publish Date - Aug 02 , 2025 | 12:32 AM
సూపర్ సిక్స్ హామీల్లో మరో ప్రధానమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం శ్రీకారం చుట్టనున్నది. అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన్‌తో అనుసంధానం చేస్తూ ఏటా మూడు విడతల్లో ఒక్కో రైతుకు రూ.20 వేల చొప్పున నగదు ఇవ్వనున్నది.
నేడు అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం
జిల్లాలో 2,42,536 మంది రైతులు అర్హులు
ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున రూ.121,26,80,000 సాయం
2,00,915 మందికి పీఎం కిసాన్ యోజన
రూ.2 వేల చొప్పున రూ.40,18,30,000 సాయం
ఒక్కో రైతు బ్యాంకు ఖాతాలో రూ.7 వేలు జమ
అనకాపల్లి, ఆగస్టు 1 (ఆంధ్రజ్యోతి): సూపర్ సిక్స్ హామీల్లో మరో ప్రధానమైన ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం శనివారం శ్రీకారం చుట్టనున్నది. అర్హులైన రైతులకు పెట్టుబడి సాయం అందించనున్నది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ యోజన్‌తో అనుసంధానం చేస్తూ ఏటా మూడు విడతల్లో ఒక్కో రైతుకు రూ.20 వేల చొప్పున నగదు ఇవ్వనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలివిడత రూ.7 వేలు (రాష్ట్రం రూ.5 వేలు, కేంద్రం రూ.2 వేలు) సాయాన్ని శనివారం నుంచి ఆయా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నది. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన అనంతరం జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకానికి 2,42,536 మంది రైతులను అర్హులుగా గుర్తించారు. ఒక్కొక్కరికి రూ.5 వేల చొప్పున మొత్తం రూ.121,26,80,000 రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది. ఈ పథకం కింద జిల్లాలో అత్యధికంగా బుచ్చెయ్యపేట మండలంలో 14,377 మంది రైతులు, అత్యల్పంగా పరవాడ మండలంలో 4,866 మంది లబ్ధి పొందనున్నారు. అదే విధంగా పీఎం కిసాన్ యోజనకు జిల్లాలో 2,00,915 మంది రైతులను అర్హులుగా నిర్ధారించారు. ఒక్కొక్కరికి రూ.2 వేల చొప్పున రూ.40,18,30,000 కేంద్ర ప్రభుత్వం విడుదల చేయనున్నది. జిల్లాలో అత్యధికంగా బుచ్చెయ్యపేట మండలంలో 11,978 మంది, అత్యల్పంగా పరవాడ మండలంలో 4,018 మందికి సాయం అందనున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మిగిలిన రూ.13 వేలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా రెండు విడతల్లో (డిసెంబరులో రూ.7 వేలు, వచ్చే ఏడాది మార్చిలో రూ.6 వేలు) రైతులకు అందజేస్తాయి. మొత్తం మీద ఒక్కో రైతుకు ఏటా రూ.20 వేల చొప్పున లబ్ధి చేకూరనున్నది.
Updated Date - Aug 02 , 2025 | 12:32 AM