అందుబాటులోకి ఆర్థిక శాఖ భవనం
ABN, Publish Date - Jun 28 , 2025 | 01:11 AM
రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని విభాగాల కోసం జిల్లా పరిషత్ కార్యాలయం రోడ్డులోని జల వనరుల శాఖ కార్యాలయ ఆవరణలో నిర్మించిన బహుళ అంతస్థుల భవనం ఎట్టకేలకు వినియోగంలోకి వచ్చింది.
ఫస్ట్ ఫ్లోర్‌లో జిల్లా ఖజానా కార్యాలయం ఏర్పాటు
గ్రౌండ్ ఫ్లోర్‌కు త్వరలో సీతమ్మధార సబ్‌ట్రెజరీ తరలింపు
మిగిలిన అంతస్థుల్లో ఏపీ ప్రభుత్వ బీమా సంస్థ, ఆడిట్ విభాగం, పే అండ్ అకౌంట్స్, ఇతర అనుబంధ విభాగాల ఏర్పాటు
విశాఖపట్నం, జూన్ 27 (ఆంధ్రజ్యోతి):
రాష్ట్ర ఆర్థిక శాఖ పరిధిలోని విభాగాల కోసం జిల్లా పరిషత్ కార్యాలయం రోడ్డులోని జల వనరుల శాఖ కార్యాలయ ఆవరణలో నిర్మించిన బహుళ అంతస్థుల భవనం ఎట్టకేలకు వినియోగంలోకి వచ్చింది. ఐదు అంతస్థులు, యాభై వేల చదరపు అడుగుల విస్తీర్ణంతో నిర్మించిన భవనంలోకి శుక్రవారం జిల్లా ఖజానా కార్యాలయాన్ని తరలించారు. జిల్లా ఖజానా విభాగం ఇన్‌చార్జి డిప్యూటీ డైరెక్టర్ గోవిందరావు కొత్త కార్యాలయంలో పూజలు చేశారు. అసిస్టెంట్ ట్రెజరీ అధికారులు నితిన్, వెంకటేశ్వరరావు, ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఆనంద్, ఇతర ఉద్యోగులు కొత్త కార్యాలయంలో తమకు కేటాయించిన సీట్ల నుంచి విధులు నిర్వహించారు. కాగా భవనం మొదటి అంతస్థును జిల్లా ఖజానా కార్యాలయానికి కేటాయించారు. సీతమ్మధార తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని ఇదే భవనం గ్రౌండ్ ఫ్లోర్‌లోకి తరలించనున్నారు. రెండు నెలల్లో సబ్‌ట్రెజరీ కార్యాలయం ఇక్కడ నుంచే పనిచేస్తుందని ఇన్‌చార్జి డీడీ గోవిందరావు తెలిపారు. కలెక్టరేట్ భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న స్ట్రాంగ్ రూమ్ అక్కడే కొనసాగుతుందన్నారు.
కాగా ఖజానా కార్యాలయం దశాబ్దాలుగా కలెక్టరేట్‌లోని గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్‌లో కొనసాగింది. అయితే ఫస్ట్ ఫ్లోర్ పైకప్పు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో పలుమార్లు మరమ్మతులు చేశారు. అయినా వర్షాకాలం వస్తే ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ విధులు నిర్వహించేవారు. రెండేళ్ల క్రితం ఫస్ట్ ఫ్లోర్‌లో ఒక వైపు పూర్తిగా కూలిపోయింది. మిగిలిన భాగం ఎప్పుడు కూలిపోతుందోనన్న ఆందోళన వ్యక్తమైంది. గత నెల గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్‌కు వచ్చే మెట్లు కూలిపోయి అటెండర్ తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కలెక్టర్ స్పందించి వెంటనే కొత్త భవనంలోకి మార్చాలని ఆదేశించారు. కొత్త భవనంలో విద్యుత్ సరఫరాకు సంబంధించి ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు పూర్తి కావడంతో శుక్రవారం ఖజానా కార్యాలయాన్ని తరలించారు.
భవనంలోకి ఆర్థిక శాఖ అనుబంధ విభాగాలు
ఆర్థిక శాఖ పరిధిలో అనుబంధ విభాగాల కోసం జల వనరుల శాఖ ఈఈ కార్యాలయ ఆవరణలో బహుళ అంతస్థుల భవన నిర్మాణానికి గతం (2014-19)లో టీడీపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఏపీ ప్రభుత్వ బీమా సంస్థ, సబ్ ట్రెజరీ, ఫస్ట్ ఫ్లోర్‌లో జిల్లా ట్రెజరీ, మిగిలిన అంతస్థులలో ఆడిట్ విభాగం, పే అండ్ అకౌంట్స్, ఇతర అనుబంధ విభాగాల ఏర్పాటుకు అనుగుణంగా భవనం డిజైన్ చేశారు. ఏపీ విద్యా మౌలిక వసతుల ఇంజనీరింగ్ సంస్థ సుమారు రూ.25.1 కోట్లతో పనులు చేపట్టింది. 2019 నాటికి మెజారిటీ నిర్మాణ పనులు పూర్తిచేశారు. మిగిలిన పనులు పూర్తి, ఫర్నీచర్, ఏసీలు, విద్యుత్ సౌకర్యం కల్పించడానికి గత ప్రభుత్వానికి ఐదేళ్లు పట్టింది. వైసీపీ హయాంలో కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లించలేదు. గత ఏడాది కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కాంట్రాక్టర్‌కు కొంతమేర బిల్లులు, విద్యుత్ సౌకర్యం కోసం ఈపీడీసీఎల్‌కు రుసుం చెల్లించింది.
Updated Date - Jun 28 , 2025 | 01:11 AM