ఎట్టకేలకు బస్కీ రోడ్డుకు మోక్షం
ABN, Publish Date - Jun 07 , 2025 | 11:10 PM
ఎట్టకేలకు బస్కీ రోడ్డుకు మోక్షం లభించింది. పీఎంజీఎస్‌వై-3 కింద నందిగుడ జంక్షన్ నుంచి వయా పకరగుడ మీదుగా బస్కీ వరకు 11 కిలోమీటర్లు తారురోడ్డు, సీసీ ర్యాంప్‌లు, కల్వర్టుల నిర్మాణానికి రూ.3.7 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే తారు రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి.
రూ.3.7కోట్లతో తారురోడ్డు
మరో 15 రోజుల్లో పనులన్నీ పూర్తి: పీఆర్ డీఈఈ
అరకులోయ, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): ఎట్టకేలకు బస్కీ రోడ్డుకు మోక్షం లభించింది. 2011లో అరకులోయ నుంచి బస్కీ వరకు తారురోడ్డును నిర్మించారు. నేటి వరకు ఆ రహదారికి నిర్వహణ చేపట్టకపోవడంతో తారు రోడ్డు ఆనవాళ్లు కూడా లేకుండా శిఽథిలమైంది. ఈ రహదారి చొంపి, మాడగడ,బస్కీతోపాటు అనంతగిరి, హుకుంపేట మండలాల పరిధిలోని వెంగడ, పైనంపాడు, వాలాసి, బూర్జ, మట్టం పంచాయతీలకు ఇదే రహదారి. ఈ రోడ్డు పాడైపోవడంతో పలుమార్లు మోటారు యూనియన్ సభ్యులు సొంత నిధులతో గ్రావెల్, మట్టి వేసి పూడ్చివేత పనులు చేపట్టారు. ఎట్టకేలకు పీఎంజీఎస్‌వై-3 కింద నందిగుడ జంక్షన్ నుంచి వయా పకరగుడ మీదుగా బస్కీ వరకు 11 కిలోమీటర్లు తారురోడ్డు, సీసీ ర్యాంప్‌లు, కల్వర్టుల నిర్మాణానికి రూ.3.7 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటికే తారు రోడ్డు పనులు దాదాపు పూర్తయ్యాయి. ఇంకా 400 మీటర్ల సీసీ ర్యాంపుల పనులు చేయాల్సి ఉంది. ఈ పనులన్నీ మరో 20 రోజుల్లో పూర్తిచేస్తామని పీఆర్ డీఈఈ డి.రవికుమార్ తెలిపారు. కల్వర్టులు పనులు పూర్తయ్యాయని, సీసీ ర్యాంపుల పనులు ప్రారంభించనున్నట్టు ఆయన తెలిపారు.
మూడు మండలాల్లో 17 తారు రోడ్లు
జన్‌మన్ పథకం కింద అరకులోయ, అనంతగిరి, డుంబ్రిగుడ మండలాల్లో 17 రోడ్లను రూ.28.62 కోట్లతో తారురోడ్లు నిర్మించనున్నట్టు పీఆర్ డీఈఈ డి.రవికుమార్ తెలిపారు. పీవీటీజీ గ్రామాలకు రహదారి సౌకర్యంలో భాగంగా పీఎం జన్‌మన్ పథకంలో ఈ రహదారులు నిర్మిస్తున్నట్టు తెలిపారు. అనంతగిరి మండలంలో ఐదు రోడ్లకు రూ.15.6 కోట్లు మంజూరైనట్టు చెప్పారు. టోకూరు-పూలుగుడ రోడ్డుకు రూ.3.2 కోట్లు, కితలంగి-బొండ్యాగుడ రోడ్డుకు రూ.3.7 కోట్లు, కోనాపురం వయా బొందుగుడ, సారగుడ, లిడ్డంగి రోడ్డుకు రూ.5కోట్లు, గుమ్మంతి-కరకవలస రోడ్డుకు రూ.1.2 కోట్లు, సరసపాడు నుంచి చిడిగరువు రోడ్డుకు రూ.3 కోట్లు మంజూరయ్యాయని, వీటి పనులు ప్రారంభించామని డీఈఈ రవికుమార్ చెప్పారు. అదేవిధంగా అరకులోయ మండలంలో బొరకాలవలస, లండిగుడ రహదారులకు రూ.1.2 కోట్లు మంజూరయ్యాయన్నారు. డుంబ్రిగుడ మండలంలో 10 రహదారులకు రూ.12 కోట్లు మంజూరయ్యాయన్నారు. ఈ రోడ్ల పనులను ప్రారంభించారని, డిసెంబరు నాటికి పనులన్నీ పూర్తిచేస్తామన్నారు.
Updated Date - Jun 07 , 2025 | 11:10 PM