ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

ఫిల్మ్‌ క్లబ్బు...రాజకీయ గబ్బు

ABN, Publish Date - Apr 27 , 2025 | 01:36 AM

వైజాగ్‌ ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (ఫిల్మ్‌ క్లబ్‌)లో రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి.

  • తారస్థాయికి రాజకీయాలు

  • భూ కేటాయింపు కోరుతూ ఇన్‌చార్జి మంత్రికి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు లేఖ

  • దానిని క్లబ్‌ వాట్సాప్‌ గ్రూపులో పోస్టు చేసిన ప్రస్తుత అధ్యక్షుడు

  • తనకు కనీస సమాచారం లేకుండా లేఖ ఇవ్వడంపై గంటా ఆగ్రహం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వైజాగ్‌ ఫిల్మ్‌ నగర్‌ కల్చరల్‌ సెంటర్‌ (ఫిల్మ్‌ క్లబ్‌)లో రాజకీయాలు తారస్థాయికి చేరుకున్నాయి. భీమిలి నియోజకవర్గంలో ఉన్న ఆ క్లబ్‌ వ్యవహారాలపై స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కంటే విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఎక్కువ ఆసక్తి చూపడం కొత్త వివాదానికి తెర తీసింది. ఈ క్లబ్‌లో వర్గాలు ఉన్నాయి. మొన్నటి వరకూ క్లబ్‌ను నడిపించిన వైసీపీ నాయకులే విష్ణుకుమార్‌రాజును పోటీకి దించేందుకు తెర వెనుక మంత్రాంగం నడుపుతున్నారు. ఇందులో పాత చైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, ఎంఎస్‌ఎన్‌ రాజు, మరికొందరు కీలకంగా వ్యవహరిస్తున్నారు. క్లబ్‌ ఎన్నికల్లో చైర్మన్‌గా విష్ణుకుమార్‌రాజును బరిలో దించారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఎటువంటి అభ్యంతరం వ్యక్తంచేయలేదు. ఎవరి ఆసక్తి వారిదని సరిపెట్టుకున్నారు.

లేఖతో కట్టలు తెంచుకున్న ఆగ్రహం

క్లబ్‌కు ప్రభుత్వం నుంచి భూమి ఇప్పించడంలో గతంలో గంటా శ్రీనివాసరావు కీలకంగా వ్యవహరించారు. అప్పుడు క్లబ్‌కు అధ్యక్షులుగా సినీ నిర్మాత కేఎస్‌ రామారావు ఉండేవారు. మధురవాడ సర్వే నంబరు 426/3లో (పాత సర్వే నంబరు 336) ఐదు ఎకరాలు కేటాయిస్తూ 2019మార్చి 7న జీఓ వచ్చింది. అందులో ‘లీజు’ అనే అంశం లేకపోవడం వల్ల అధికారులు భూమి అప్పగించలేదు. ఎకరాకు రూ.2 లక్షలు చొప్పున ఏడాదికి రూ.10 లక్షలు చెల్లించేలా నాడు ఉత్తర్వులు ఇచ్చారు. తాజాగా ఆ భూమి క్లబ్‌కు వచ్చేలా చూస్తానని వారికి గంటా హామీ ఇచ్చారు. అయితే కలెక్టరేట్‌లో శుక్రవారం జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో ఫిల్మ్‌ క్లబ్‌కు భూమి కేటాయించాలంటూ విష్ణుకుమార్‌రాజు పాత జీఓ నంబర్లు, నాటి విషయాలు ఉటంకిస్తూ ఇన్‌చార్జి మంత్రి వీరాంజనేయస్వామికి, కలెక్టర్‌లకు ఒక లేఖ రాసి ఇచ్చారు. దానిపై విశాఖ ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌ సంతకాలు చేశారు. ఈ విషయం గంటా శ్రీనివాసరావుకు చెప్పలేదు.

క్లబ్‌ వాట్సాప్‌ గ్రూపులో ప్రచారం

మంత్రికి ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఇచ్చిన లేఖను ప్రస్తుత క్లబ్‌ అధ్యక్షులు ఆర్‌వీ చంద్రమౌళిప్రసాద్‌ 1,600 మంది సభ్యులు కలిగిన క్లబ్‌ వాట్సాప్‌ గ్రూపులో పెట్టారు. మంత్రికి బీజేపీ ఫ్లోర్‌ లీడర్‌, ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ అధికారికంగా ఇచ్చిన లేఖ అని, త్వరలోనే భూమి వస్తుందని పేర్కొన్నారు. అందులో కొందరు సభ్యులు దానిని గంటా శ్రీనివాసరావుకు పంపించి, ఈ విషయం మీకు తెలుసా?...అని ప్రశ్నించారు. అంత వరకూ మంత్రికి లేఖ ఇచ్చిన విషయం గంటాకు తెలియదు. అంతేకాకుండా శుక్రవారం జరిగిన డీఆర్‌సీ సమావేశంలో భీమిలి నియోజకవర్గంలో మాస్టర్‌ప్లాన్‌ రహదారి పనులపై టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తంచేసిన విషయం కూడా ఆయన దృష్టికి వెళ్లింది. ఇదే క్రమంలో జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌పై పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఓటు వేయడానికి రావాలనే విషయాన్ని కూడా ముందుగా చెప్పకుండా శనివారం ఉదయం ఫోన్‌ చేయడంపైనా ఆయన అసంతృప్తికి లోనయ్యారు. వీటన్నింటి నేపథ్యంలో శనివారం జీవీఎంసీకి వెళ్లి సమావేశంలో పాల్గొని బయటకు వస్తున్నప్పుడు ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు ఎదురై మంత్రికి లేఖ ఇచ్చిన విషయం ప్రస్తావించారు. దాంతో గంటా ఒక్కసారి భగ్గుమన్నారు. తన నియోజకవర్గానికి సంబంధించిన విషయంపై తనతో చర్చించాల్సిన అవసరం లేదా? అని నిలదీశారు. అప్పటికప్పుడు తీసుకున్న నిర్ణయం అంటూ విష్ణుకుమార్‌రాజు సమర్థించుకోవాలని చూడగా, ఆ లేఖను క్లబ్‌ సభ్యుల వాట్సాప్‌ గ్రూపులో పెట్టిన విషయాన్ని గుర్తు చేసి మరింత ఆగ్రహం వ్యక్తంచేశారు.

నిబంధనలన్నీ గాలికి...

- క్లబ్‌ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కనీసం ఐదేళ్లు సభ్యులుగా ఉండాలి. అయితే కొందరు కీలకమైన వ్యక్తులు పోటీ చేస్తున్నందున జనరల్‌ బాడీలో చర్చించకుండా ఆ గడువు మూడేళ్లకు తగ్గిస్తూ బైలాకు సవరణ చేసి, దానిని జిల్లా రిజిస్ట్రార్‌ వద్ద నమోదుచేశారు. ఎవరి కోసం ఈ పనిచేశారో చెప్పాలని సభ్యులు నిలదీస్తున్నారు.

- క్లబ్‌ను చిత్ర పరిశ్రమలో పనిచేసే వారి కోసం ఏర్పాటుచేశారు. గతంలో వారి సారధ్యంలోనే నడిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక పరిశ్రమకు చెందిన వారిని పక్కకునెట్టి కాయల వెంకటరెడ్డి, ఏయూ మాజీ వీసీ ప్రసాదరెడ్డి, ఎస్‌ఆర్‌ షాపింగ్‌ మాల్‌ గోపీనాథ్‌రెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడు శరత్‌ చంద్రారెడ్డిలను పెట్టి నడిపించారు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తరువాత కూడా సినీ పరిశ్రమకు చెందిన వారికి అవకాశం ఇవ్వకుండా వైసీపీ నాయకులు తెర వెనుక ఉంటూ రాజకీయ ప్రముఖులను పోటీకి దింపుతున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ ఊహించని పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Updated Date - Apr 27 , 2025 | 01:36 AM