యోగాంధ్రాలో యుద్ధ విమానాల ప్రదర్శన
ABN, Publish Date - Jun 20 , 2025 | 12:53 AM
రామకృష్ణా బీచ్‌లో శనివారం నిర్వహించే యోగాంధ్రాలో తూర్పు నౌకాదళం వైమానిక ప్రదర్శన చేయనుంది.
యోగాంధ్రాలో యుద్ధ విమానాల ప్రదర్శన
వేదికపై ప్రధానితో పాటు గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, ఆయుష్ కేంద్ర మంత్రి
కార్యక్రమం 6.30 గంటలకు మొదలై 7.50 గంటలకు ముగింపు
నరేంద్రమోదీ ప్రసంగం 15 నిమిషాలు
విశాఖపట్నం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి):
రామకృష్ణా బీచ్‌లో శనివారం నిర్వహించే యోగాంధ్రాలో తూర్పు నౌకాదళం వైమానిక ప్రదర్శన చేయనుంది. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ వేదిక వద్దకు చేరుకొని కార్యక్రమం ప్రారంభించే ముందు అంటే 6.31 గంటలకు విమానాల బృందం ఆకాశంలో ‘ఫ్లై పాస్ట్’ చేస్తుంది. ఆ తరువాత కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి జాదవ్ ప్రతాప్‌రావ్ గణపతిరావు నాలుగు నిమిషాలు ప్రసంగిస్తారు. ఆ తరువాత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.పవన్‌కల్యాణ్ రెండు నిమిషాలు, ఆపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాలుగు నిమిషాలు మాట్లాడతారు. చివరిగా ప్రధాని నరేంద్రమోదీ 15 నిమిషాలు ప్రసంగించి ఏడు గంటల కల్లా ముగిస్తారు. గిన్నిస్ బుక్ రికార్డు కోసం 7.01 గంటలకు యోగాసనాలు ప్రారంభించి 7.45 గంటల వరకు కొనసాగిస్తారు. ప్రతి ఆసనం ఒక నిమిషం పాటే ఉంటుంది. ఆ తరువాత యోగా పోటీలు విజేతలైన వారిని అభినందిస్తారు. 7.55 గంటలకు వేదిక నుంచి ప్రధాని బయలుదేరి ఏయూ ఇంజనీరింగ్ కాలేజీ మైదానానికి వెళతారు. అక్కడకు ఎనిమిది గంటలకు వెళ్లి పది నిమిషాలు పాటు గిరిజన విద్యార్థులు చేసే సూర్య నమస్కారాలు తిలకిస్తారు. అక్కడి నుంచి 8.15 గంటలకు బయలుదేరి నేవీ గెస్ట్ హౌస్‌కు వెళ్లిపోతారు. సీఎం చంద్రబాబునాయుడు కలెక్టరేట్‌లో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోర్టు గెస్ట్‌హౌస్‌లో, ఐటీ మంత్రి లోకేశ్ పార్టీ ఆఫీసులో, గవర్నర్ నోవాటెల్ హోటల్‌లో బస చేస్త్తారు.
కోస్టల్ బ్యాటరీ నుంచి వీఐపీలకు ప్రవేశం
ప్రధాన వేదికకు వచ్చే వీఐపీలకు కోస్టల్ బ్యాటరీ, నోవాటెల్ వద్ద నుంచి ప్రవేశానికి ఏర్పాట్లు చేశారు. మిగిలిన వారిని అటువైపు అనుమతించరు. తిరిగి వీఐపీలు వెళ్లడానికి కూడా అదే మార్గం ఉపయోగించనున్నారు.
నేడు సీఎం రాక
రాత్రికి కలెక్టరేట్ ప్రాంగణంలో బస
రేపు ఉదయం ఆర్కే బీచ్‌రోడ్డులో యోగా దినోత్సవానికి హాజరు
విశాఖపట్నం, జూన్ 19 (ఆంధ్రజ్యోతి):
అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శుక్రవారం సాయంత్రం నగరానికి చేరుకుంటారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి 4.45 గంటలకు బయలుదేరి 5.30 గంటలకు విశాఖపట్నం చేరుకుని, అక్కడ నుంచి ఆరుగంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు వెళతారు. యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు వస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీకి సాయంత్రం 6.45 గంటలకు స్వాగతం పలుకుతారు. అనంతరం ఏడు గంటలకు రోడ్డు మార్గంలో బయలుదేరి తూర్పు నౌకాదళానికి చెందిన ఆఫీసర్స్ మెస్‌కు వెళ్లి రాత్రి 7.30 గంటల వరకూ ఉంటారు. రాత్రి 7.30 గంటలకు బయలుదేరిఎనిమిది గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని, అక్కడ బస్సులో బస చేస్తారు. శనివారం ఉదయం 6.10 గంటలకు బయలుదేరి ఆర్కే బీచ్‌కు చేరుకుని, గవర్నర్, ప్రధానమంత్రికి స్వాగతం పలుకుతారు. ఉదయం 6.30 గంటల నుంచి 7.50 గంటల వరకూ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. అనంతరం ఎనిమిది గంటలకు కలెక్టరేట్‌కు చేరుకుని, 11.20 గంటల వరకూ బస్సులోనే ఉంటారు. ఆ తరువాత ఐఎన్‌ఎస్ డేగాకు వెళ్లి, 11.45 గంటలకు ప్రధానికి వీడ్కోలు పలుకుతారు. అక్కడ నుంచి తిరిగి ఎయిర్‌పోర్టుకు చేరుకుని 12.40 గంటలకు విమానంలో హైదరాబాద్ వెళతారు.
Updated Date - Jun 20 , 2025 | 12:53 AM