సింహగిరికి ఉత్సవ శోభ
ABN, Publish Date - Jul 09 , 2025 | 01:07 AM
సింహ‘గిరి ప్రదక్షిణ’ బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్నది.
నేడే గిరి ప్రదక్షిణ
మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం
అప్పన్న ప్రచార రథాన్ని ప్రారంభించనున్న దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు,
స్థానిక శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు
విస్తృత ఏర్పాట్లు చేసిన అధికారులు
దారిపొడవునా తాగునీరు, వైద్య శిబిరాలు
3,000 మందితో బందోబస్తు
సింహాచలం, జూలై 8 (ఆంధ్రజ్యోతి):
సింహ‘గిరి ప్రదక్షిణ’ బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్నది. కొండదిగువన తొలిపావంచా వద్ద స్వామివారి పుష్పతేరు (ప్రచార రథం)ను దేవస్థానం అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు, స్థానిక శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు జెండా ఊపి లాంఛనంగా ప్రారంభిస్తారు. అనంతరం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు గోవింద నామస్మరణలతో గిరి ప్రదక్షిణకు ఉపక్రమిస్తారు.
ఏటా ఆషాఢ మాసంలో శుక్లపక్ష చతుర్దశినాడు లక్షలాది మంది కొండంత భక్తితో వరాహ లక్ష్మీనృసింహస్వామి కొలువుదీరి ఉన్న సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేయడం ఆచారంగా వస్తోంది. భక్తులు కొండ దిగువన తొలిపావంచా వద్ద ప్రారంభించి అడివివరం, ముడసర్లోవ, హనుమంతువాక, విశాలాక్షి నగర్, జోడుగుళ్లపాలెం, ఎం.వి.పి.డబుల్ రోడ్డు, వెంకోజీపాలెం, సీతమ్మధార, బాలయ్యశాస్త్రి లేఅవుట్, మాధవధార, మురళీనగర్, కుమారి కల్యాణ మండపం, పాతగోశాల మీదుగా సింహాచలం చేరుకుని (మొత్తం 32 కిలోమీటర్లు) ప్రదక్షిణ ముగిస్తారు. గిరి ప్రదక్షిణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లన్నీ పూర్తిచేసింది. తొలిపావంచా వద్ద మాత్రమే కాకుండా పురాతన భైరవద్వారం (పాత తొలిపావంచా) వద్ద కొబ్బరికాయలు కొట్టేందుకు ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. సుమారు ఐదు నుంచి ఆరు లక్షల మంది హాజరవుతారని భావించి అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మూడు వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటుచేశారు. ప్రతి 6 కి.మీ.కు అధికారులతో బృందాన్ని పెట్టారు. ఎక్కడికక్కడ మరుగుదొడ్లు, తాగునీటి సదుపాయం కల్పించారు. ఏదైనా అవసరమైతే ఫోన్ ద్వారా చెప్పడానికి టోల్ ఫ్రీ నంబర్లను దారి పొడవునా డిస్‌ప్లే చేశారు. అలాగే ప్రదక్షిణ మార్గంలో 750 విద్యుద్దీపాలు, 32 ప్రాంతాల్లో 200 వాట్స్ సామర్థ్యం కలిగిన హైమాస్ట్ లైట్లు పెట్టారు. కొండ పైకి వెళ్లేందుకు 50 బస్సులను ఉచిత సర్వీస్‌లుగా నడుపుతున్నారు. కలెక్టర్ హరేంధిర ప్రసాద్ మంగళవారం రాత్రి సింహాచలం వెళ్లి ఏర్పాట్లు పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ అప్పుఘర్ వద్ద ఏర్పాట్లు తనిఖీ చేశారు.
గిరి ప్రదక్షిణ సందర్భంగా బుధ, గురువారాల్లో దేవస్థానంలో నిత్యకల్యాణం, సుప్రభాత సేవ, ఆరాధనసేవ, అష్టోత్తర, సహస్ర నామార్చన వంటి ఆర్జిత సేవలు రద్దు చేశారు. అదేవిధంగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రెండు రోజులు నీలాద్రి గమ్మం వద్ద నుంచి అప్పన్న దర్శనాలు కల్పించనున్నారు.
పదో తేదీన...
పదో తేదీ తెల్లవారుజామున ఒంటి గంటకు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలుపుతారు. 2.30 గంటల నుంచి 4 గంటల వరకూ మూడు మణుగుల చందనం సమర్పిస్తారు. 4 నుంచి ఐదు గంటల వరకు ప్రభాత ఆరాధన, బాలభోగం, రాజభోగాల నివేదనలు కావిస్తారు. ఉదయం 5.30 నుంచి మధ్యాహ్నం 3.30 గంటల వరకూ నిరంతరాయంగా భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 4.00 గంటల వరకూ పవళింపుసేవ, ఢిల్లీ విజయం ఉత్సవం జరుగుతాయి. ఈ కారణంగా మధ్యాహ్నం 3.30 నుంచి 5.30 గంటల వరకు భక్తులకు దర్శనాలు లభించవు. సాయంత్రం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకు భక్తులకు స్వామివారి దర్శనాలు ఉంటాయి. రాత్రి 7 నుంచి 8.30 గంటల వరకకూ రాత్రి ఆరాధన (భక్తులకు దర్శనాలు లభించవు), 9 గంటలకు పవళింపుసేవ ఉంటాయి. అనంతరం కవాట బంధనం చేస్తారు.
కాగా, పదో తేదీ ఉదయం మూడు గంటల నుంచి భక్తులను ఆలయ ప్రదక్షిణకు అనుమతిస్తారు. భక్తుల సౌకర్యార్థం కార్పెట్లు పరచి, ఆలయం చుట్టూ విద్యుత్ దీపాలను ఏర్పాటు చేశారు. ఆలయ ప్రదక్షిణ చేసే భక్తుల వల్ల సాధారణ భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఉత్తర, దక్షిణ రాజగోపురాల వద్ద రెండు పుట్ ఓవర్ బ్రిడ్జిలను ఏర్పాటుచేశారు.
భక్తులకు సూచనలు
- చక్కెర వ్యాధిగ్రస్తులు కాళ్లకు చెప్పులు లేకుండా నడవరాదు.
- గుండె జబ్బు ఉన్నవారు గిరి ప్రదక్షిణ చేయరాదు.
- బీపీ ఉన్నవారు నిర్దేశిత మందులు వేసుకొని నడవాలి. అత్యవసర పరిస్థితుల్లో దగ్గరలో ఉన్న వైద్య శిబిరంలో బీపీ తనిఖీ చేయించుకోవాలి.
- నీరసంగా ఉన్నప్పుడు ఓఆర్‌ఎస్ తీసుకోవాలి. తగినంత విశ్రాంతి తీసుకోవాలి.
- గంటకు ఒకసారి తగినంత మోతాదులో మంచినీరు తీసుకోవాలి.
- అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సేవలను వినియోగించుకోవాలి.
- నడిచే సమయంలో శరీరానికి బాగా గాలి తగిలేలా వదులుగా ఉన్న దుస్తులను ధరించాలి.
- ఆయాసం వస్తే వెంటనే ఆగి, తగినంత విశ్రాంతి తీసుకోవాలి. అవసరమైతే వెంటనే వైద్య సాయం పొందాలి.
గిరి ప్రదక్షిణకు 200 ప్రత్యేక బస్సులు
ద్వారకా బస్‌స్టేషన్, జూలై 8 (ఆంధ్రజ్యోతి):
గిరి ప్రదక్షిణను పురస్కరించుకుని ఆర్టీసీ యాజమాన్యం 200 ప్రత్యేక బస్సులు నడపనున్నది. గురువారం ఉదయం 5.00 నుంచి శుక్రవారం సాయంత్రం 5.00 గంటల వరకూ ఈ ప్రత్యేక సర్వీసులు ఆపరేట్ చేయనున్నట్టు రీజనల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తెలిపారు. ద్వారకా బస్‌స్టేషన్, గాజువాక, రామకృష్ణా బీచ్, కొత్తవలస, సింథియా, ఉక్కునగరం, కొత్తవలస, తదితర ప్రాంతాల నుంచి కొండ దిగువన తొలి పావంచా వరకూ 150 బస్సులు నడపనున్నామన్నారు. అలాగే కొండ దిగువ నుంచి పైకి షటిల్ సర్వీసులుగా 50 బస్సులు నడపనున్నట్టు వెల్లడించారు. రీజియన్‌లో ఏడు డిపోల మేనేజర్లు, అసిస్టెంట్ మేనేజర్లు, సూపర్‌వైజర్లు, కంట్రోలర్లు ప్రధానకూడళ్లలో ఉండి ట్రాఫిక్‌ను నియంత్రించనున్నారని పేర్కొన్నారు.
సింహగిరి ప్రదక్షిణ భూప్రదక్షిణ సమానం
భక్తుల విశ్వాసం
కోర్కెలు నెరవేరుతాయని నమ్మకం
సింహాచలం, జూలై 8 (ఆంధ్రజ్యోతి):
భారతీయ సంస్కృతికి మూలం వేదాలు. వేదం ప్రకృతిని పరమాత్మ స్వరూపంగా చెప్పింది. అందుకే అనాదిగా భారతీయులు చెట్లను, పుట్టలను, నదులను, సముద్రాలను, పర్వతాలను పూజిస్తుంటారు. పర్వతాలకు భూధరాలని పేరు. అంటే భూమి ధరించేవని అర్థం. వేదాల ప్రకారం విష్ణుః పర్వతానాం అధిపతిః. అందుకే పర్వతాలు పూజించబడుతున్నాయి. భూమి సమతుల్యతను కాపాడేవి పర్వతాలు. సాధారణంగా స్వయంభువుడుగా భగవానుడు వెలసిన క్షేత్రాలన్నీ అధికశాతం పర్వతాలపైనే ఉంటాయి. అదే పర్వతాలపై పురాణాల కాలంలో మునులు, యోగులు తపస్సులు చేసి జ్ఞానసముపార్జన చేశారు. అటువంటి అనేక దైవీ భావనలు ఉండడం చేతనే పర్వతాలను పూజించడం, వాటి చుట్టూ ప్రదక్షిణలు చేయడం వేదకాలం నుంచే జరుగుతున్నట్టు విజ్ఞులు చెబుతారు.
వరాహ లక్ష్మీనృసింహస్వామి ద్వయావతారుడుగా వెలసిన దివ్యధామం సింహగిరి. అందుకే సింహగిరి చుట్టూ ప్రదక్షిణం చేయడం భూ ప్రదక్షిణతో సమాన ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. సింహగిరి చుట్టూ ప్రదక్షిణలు చేసిన వారికి విద్యాభివృద్ధి, ఉద్యోగప్రాప్తి, వివాహ అనుకూలత వంటివి ఈడేరుతాయని పెద్దలు చెబుతుంటారు. కోర్కెలు లేకుండా సింహగిరి ప్రదక్షిణ చేసినవారు ఇహపర సౌఖ్యాలు పొందుతారని పండితుల మాట. భౌతికంగా సింహగిరి చుట్టుకొలత 32 కిలోమీటర్లు. సింహాచల క్షేత్ర మహాత్మ్యం ప్రకారం హిరణ్యకశ్యపుని సంహరించే సమయంలో విష్ణువు 32 రూపాలు ధరించాడని, అదేవిధంగా నృసింహస్వామి మూలమంత్రంలో 32 బీజాక్షరాలు ఉన్నాయని అందుకే 32 కిలోమీటర్ల వ్యాసార్థం కలిగిన సింహగిరి చుట్టూ ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసినంత ఫలాన్ని ఇస్తుందని అంటారు.
గురుపౌర్ణమిగా నాడే సింహగిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలంటే...వేదవ్యాసుడు వేదాలను విభజించి మానవాళికి గురువుగా పూజించబడుతున్నాడు. భగవానుడి తత్వాన్ని విశ్వానికి తెలిపిన వ్యాసుడు జయంతికి ప్రత్యేకత ఉంది. గురువు అంటే పెద్దది, విశ్వం అని అర్థాలు ఉన్నాయి. ఏటా వైశాఖమాస శుక్లపక్ష తదియ, పౌర్ణమి, జేష్ట, ఆషాఢ పౌర్ణమిలలో నాలుగు విడతలుగా చందనాన్ని పైపూతగా సమర్పించడంతో సింహాద్రినాథుడు గురు(పెద్ద)రూపం సంతరించుకుంటాడు. అందుకే వ్యాసపూర్ణిమనాడు గిరి ప్రదక్షిణ చేస్తారని సింహాద్రి అప్పన్న ఆలయ స్థానాచార్యులు తెలిపారు.
Updated Date - Jul 09 , 2025 | 01:07 AM