ప్రభుత్వ అధికారులపై తప్పుడు ఆరోపణలు తగదు
ABN, Publish Date - Jul 20 , 2025 | 01:05 AM
ప్రభుత్వ అధికారులపై తప్పుడు ఫిర్యాదులు చేయడం మాజీ ఎమ్మెల్యే గణేశ్‌కు తగదని తహశీల్దార్ వెంకటరమణ అన్నారు.
- మాజీ ఎమ్మెల్యే తీరు అభ్యంతరకరం
- తహశీల్దార్ వెంకటరమణ
మాకవరపాలెం, జూలై 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అధికారులపై తప్పుడు ఫిర్యాదులు చేయడం మాజీ ఎమ్మెల్యే గణేశ్‌కు తగదని తహశీల్దార్ వెంకటరమణ అన్నారు. శనివారం ఆయన స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ డివిజన్ సంఘం అధ్యక్షుడు రామారావు ఆదేశాల మేరకు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 737 సర్వే నంబరులో ఉన్న ప్రభుత్వ భూమిలో వాకరోడ్డు నిర్మాణం చేపడుతుంటే అటవీ భూమిలో అనుమతులు లేకుండా రోడ్డు నిర్మాణం చేపడుతున్నారంటూ కలెక్టర్, ఆర్డీవోపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు మాజీ ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. అక్కడ ఏమైనా తప్పు జరుగుతుంటే ముందుగా తహశీల్దార్‌కు గాని, ఆర్డీవోకు గాని, ఉన్నతాధికారులకు గాని ఫిర్యాదు చేయాలని మాజీ ఎమ్మెల్యేకి తెలియకపోవడం శోచనీయమన్నారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు మానుకోవాలని ఆయన సూచించారు. రెవెన్యూ భూమిలో ప్రజల కోరిక మేరకు రోడ్డు నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఏ శాఖ అయినా రెవెన్యూశాఖ నుంచే భూమి తీసుకుంటుందన్న విషయం మాజీ ఎమ్మెల్యే తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందన్నారు. 1956లో ఎరకన్నపాలెం నుంచి ఎలమంచిలి మండలం పెదపల్లికి కాలిబాట వాక రోడ్డు ఉండేదని మరోసారి గుర్తు చేశారు. ఈ రోడ్డు మార్గాన ఈ ప్రాంత ప్రజలు వాణిజ్య పంటలతో పాటు పశువుల సంతలకు, ఎలమంచిలి కోర్టుకు వెళ్లేవారని అక్కడి పూర్వీకులు చెబుతున్నారని తెలిపారు. అయితే 737 సర్వే నంబరులో 1600 ఎకరాల కొండపోరంబోకు భూమి ఉందన్నారు. ఈ భూమి అంతా ఇప్పటికీ రెవెన్యూ ఆధీనంలోనే ఉందన్న దానికి ఉదాహరణ శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ, అటవీ, జిల్లా సర్వే ఏడీ ఆధ్వర్యంలో జాయింట్ సర్వే ద్వారా హద్దుల సర్వే రాళ్లు వేయడమే ఆధారమన్నారు. వాస్తవాలను తెలుసుకొని నాయకులు మాట్లాడాలని, అంతే గాని తప్పడు పత్రాలతో, తప్పుడు సమాచారంతో, ఉన్నతాధికారులపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. మండలాల్లో ప్రభుత్వ భూమి ఎంత ఉందో గుర్తించాలని ఇటీవలే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిందన్నారు. ఈ నేపథ్యంలోనే 737 సర్వే నంబరులో ప్రభుత్వ భూమిలో ఎంత మంది రైతులు సాగులో ఉన్నారో సర్వే చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికైనా అసత్య ఆరోపణలు మానుకొని వాస్తవాలు మాట్లాడాలని ఆయన హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డీటీ నూకరాజు పాల్గొన్నారు.
Updated Date - Jul 20 , 2025 | 01:05 AM