ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

నకిలీ ఏసీబీ అధికారి అరెస్టు

ABN, Publish Date - May 08 , 2025 | 01:11 AM

ఏసీబీ అధికారినంటూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి డబ్బులు డిమాండ్‌ చేసిన వ్యక్తిని విశాఖ పీఎం పాలెం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదులు ఉన్నాయని డబ్బులు డిమాండ్‌

విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి):

ఏసీబీ అధికారినంటూ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి డబ్బులు డిమాండ్‌ చేసిన వ్యక్తిని విశాఖ పీఎం పాలెం పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. శ్రీకాకుళం జిల్లా పాతపట్నానికి చెందిన బలగా సుధాకర్‌ చాలాకాలం కిందట విశాఖ వచ్చి ఆదర్శనగర్‌ పాత డెయిరీఫారం వద్ద నివాసం ఉంటున్నాడు. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తుంటాడు. మంగళవారం మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి వెళ్లి, జాయింట్‌ సబ్‌రిజిస్ట్రార్‌ చక్రపాణిని కలిశాడు. తాను ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌నని పరిచయం చేసుకున్నాడు. కార్యాలయంలో అవినీతిపై తమకు చాలా ఫిర్యాదులు అందాయని, వాటిపై కేసు నమోదుచేయాల్సి ఉంటుందని బెదిరించాడు. కేసు నమోదుచేయకుండా విడిచిపెట్టాలంటే తనకు రూ.ఐదు లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. దీంతో అనుమానం వచ్చిన చక్రపాణి బుధవారం వస్తే డబ్బులు ఇస్తానని చెప్పి పంపించారు. అనంతరం ఏసీబీ అధికారులకు సమాచారం ఇవ్వగా, అలాంటివారు డిపార్టుమెంట్‌లో ఎవరూ లేరని చెప్పి, బుధవారం మధ్యాహ్నం కార్యాలయం వద్ద మాటువేశారు. సుధాకర్‌ కారులో సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయానికి రాగా, అప్పటికే అక్కడ మాటువేసి ఉన్న ఏసీబీ, పీఎం పాలెం పోలీసులు సంయుక్తంగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. సుధాకర్‌ తాను ఏసీబీ అధికారిగా చెప్పుకోవడంతోపాటు గతంలో దోపిడీ కేసులో అరెస్టయి ప్రస్తుతం వేరొక జిల్లాలో పనిచేస్తున్న ఒక మహిళా పోలీస్‌ అధికారిని జాయింట్‌ డైరెక్టర్‌గా పేర్కొంటూ ఫోన్‌లో జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌తో మాట్లాడించినట్టు తేలింది. సుధాకర్‌ను పీఎంపాలెం పోలీసులు అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో మరింత విచారణ చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.

సుధాకర్‌కు టీడీపీ నేతలతో పరిచయాలు...

సుధాకర్‌కు టీడీపీ నేతలతో పరిచయాలు ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. జీవీఎంసీ పదో వార్డు టీడీపీ బీసీ సెల్‌ అధికార ప్రతినిధిగా పేర్కొంటూ ఆ పార్టీ నేతలతో దిగిన ఫొటోలు అతని ఫోన్‌లో ఉన్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. అతని ఫోన్‌ను స్వాధీనం చేసుకుని పీఎం పాలెం పోలీసులకు అప్పగించారు. తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కార్యాలయంలో సుధాకర్‌ తరచూ కనిపిస్తుంటారని పోలీసులు సైతం చెబుతుండడం విశేషం.

ఆమె ఎవరు?

ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌నంటూ

జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌తో ఫోన్‌లో మాట్లాడిన మహిళ గురించి పోలీసుల ఆరా

విశాఖపట్నం, మే 7 (ఆంధ్రజ్యోతి):

ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌నంటూ ఫోన్‌లో మధురవాడ సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయంలో జాయింట్‌ సబ్‌ రిజిస్ర్టార్‌తో మాట్లాడిన మహిళ ఎవరనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. నకిలీ ఏసీబీ అధికారి సుధాకర్‌ జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ చక్రపాణి వద్దకు వెళ్లి ‘మీ కార్యాలయంపై అనేక ఫిర్యాదులు ఉన్నాయి కాబట్టి నాకు బాగా పరిచయస్తురాలైన ఏసీబీ జాయింట్‌ డైరెక్టర్‌ మేడమ్‌తో మాట్లాడి సెటిల్‌ చేస్తానని’ చెప్పారు. సబ్‌రిజిస్ర్టార్‌ ఎదురుగానే ఆమెకు సుధాకర్‌ ఫోన్‌ చేసి స్పీకర్‌ ఆన్‌ చేసి మాట్లాడారు. ఆమె...‘సుధాకర్‌ చెప్పినట్టు చేయండి, మిగిలింది నేను చూసుకుంటానని’ అంటూ తనకు భరోసా ఇచ్చినట్టు పోలీసులకు చక్రపాణి తెలిపారు. దీంతో పోలీసులు సుధాకర్‌ ఫోన్‌ స్వాధీనం చేసుకుని ఆ నంబర్‌ను పరిశీలించగా గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న ఒక మహిళా ఏఆర్‌ పోలీస్‌ అధికారిణిగా తేలింది. ఈ కేసులో ఆమె పాత్ర ఏమిటనే దానిపై ఆరా తీస్తున్నట్టు తెలిసింది. సదరు మహిళా అధికారిణి గతంలో నగరంలో పనిచేసినప్పుడు నోట్ల మార్పిడి కేసులో కానిస్టేబుల్‌ ద్వారా భారీగా డబ్బులు గుంజారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై బాధితుల ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదుచేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కొన్నాళ్లపాటు సస్పెన్షన్‌లో ఉన్న ఆమె ప్రస్తుతం గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నట్టు సమాచారం. నకిలీ ఏసీబీ అధికారితో కలిసి ఆమె ఏమైనా మోసాలకు పాల్పడ్డారా? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్టు తెలిసింది.

Updated Date - May 08 , 2025 | 01:11 AM