యోగా డేకు విస్తృత ఏర్పాట్లు
ABN, Publish Date - May 21 , 2025 | 12:56 AM
వచ్చే నెల 21వ తేదీన నగరంలో నిర్వహించనున్న ‘11వ అంతర్జాతీయ యోగా డే’ ప్రపంచ రికార్డు సృష్టించేలా ఏర్పాట్లుచేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఆదేశం
వచ్చే నెల 21న ఆర్కే బీచ్‌రోడ్డులో నిర్వహణ
హాజరుకానున్న ప్రధాని నరేంద్రమోదీ
రెండున్నర లక్షల మంది పాల్గొనేలా చూడాలని నిర్ణయం
గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ర్టేషన్లు
విశాఖపట్నం, మే 20 (ఆంధ్రజ్యోతి):
వచ్చే నెల 21వ తేదీన నగరంలో నిర్వహించనున్న ‘11వ అంతర్జాతీయ యోగా డే’ ప్రపంచ రికార్డు సృష్టించేలా ఏర్పాట్లుచేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిరప్రసాద్ ఆదేశించారు. ప్రధాని నరేంద్రమోదీ పాల్గొననున్నందున ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ వేడుకలకు సంబంధించి మంగళవారం ఉదయం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో ఆయన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం నుంచి జూన్ 21 వరకు యోగా మంత్‌గా పాటించాలన్నారు. ప్రజలకు యోగాపై శిక్షణ ఇవ్వాలన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా యోగా డే వేడుకల్లో పాల్గొనే వారి నుంచి రిజిస్ర్టేషన్లు తీసుకోవాలని, విద్యార్థులను, డ్వాక్రా మహిళలను, ప్రైవేటు, ప్రభుత్వ సంస్థల ఉద్యోగులను, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను, శిక్షకులు, యోగా అసోసియేషన్లు, నిపుణులను భాగస్వామ్యులను చేయాలని సూచించారు. ఆర్కే బీచ్ నుంచి పార్క్ హోటల్ వరకూ, అదేవిధంగా పార్క్ హోటల్ నుంచి భీమిలి బీచ్ రోడ్డు వరకు సుమారు 2.5 లక్షల మంది యోగాలో పాల్గొనేందుకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ స్పష్టంచేశారు. ఆర్కే బీచ్, రుషికొండ బీచ్, క్రికెట్ స్టేడియం, పోలీస్, స్పోర్ట్, నేవీ ప్రాంగణాలతోపాటు ఖాళీ ప్రదేశాలను యోగా వేడుకల నిర్వహణకు గుర్తించినట్టు వెల్లడించారు. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు, డ్రోన్స్, తాగునీటి సదుపాయం, టిఫిన్, రవాణా సదుపాయం, వాహనాల పార్కింగ్, శానిటేషన్, టాయిలెట్స్, వలంటీర్లు, మెడికల్ టీమ్‌లు ఏర్పాటు, అతిథులకు వసతి, భద్రత, సీసీ కెమెరాలు ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు.
ప్రపంచ రికార్డు నెలకొల్పాలి..
ప్రధాని పాల్గొనే 11వ అంతర్జాతీయ యోగా డే కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. 2023లో సూరత్‌లో 1.53 లక్షల మందితో ఒకేచోట యోగా దినోత్సవాన్ని నిర్వహించి వరల్డ్ రికార్డును సాధించారని, ఈసారి ఆ రికార్డును తిరగరాయలని కలెక్టర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో 2.5 లక్షల మందిని భాగస్వామ్యం చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. బుధవారం ఉదయం 6.30 నుంచి 8 గంటల మధ్యలో విశాఖలో ఆర్కే బీచ్‌రోడ్డులో వేయి మందితో ప్రాథమిక వేడుకలను ప్రారంభించేందుకు చర్యలు చేపట్టినట్టు తెలిపారు. సమీక్ష సమావేశంలో డీసీపీలు మేరీ ప్రశాంతి, అజితా, రెవెన్యూ అధికారి బీహెచ్ భవానీశంకర్‌తోపాటు జిల్లా అధికారులు, యోగా టీచర్లు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Updated Date - May 21 , 2025 | 12:56 AM