ప్రయోగాత్మకంగా బేంబూసా తుల్డా వెదురు అభివృద్ధి
ABN, Publish Date - Jul 11 , 2025 | 12:35 AM
అత్యంత విలువైన బహుళార్ధ సాధక వెదురు జాతులలో ఒకటైన బేంబుసా తుల్డాని జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ వెదురుతో చేసిన ఫర్నిచర్ అందంగా ఉండడంతో పాటు మన్నిక ఎక్కువ ఉంటుంది.
ఏజెన్సీలో లభించే వెదురు కంటే ఏపుగా పెరుగుదల
బుట్టలు, చాపలు, ఫర్నిచర్ తయారీకి వినియోగం
ఈ ప్రాంతంలో విత్తనాలు వేసి చూడాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ ఆదేశం
రెండు నెలల క్రితం త్రిపుర నుంచి విత్తనాలు తెప్పించిన అటవీశాఖ సోషల్ ఫారెస్ట్
నర్సీపట్నం, జూలై 10 (ఆంధ్రజ్యోతి): అత్యంత విలువైన బహుళార్ధ సాధక వెదురు జాతులలో ఒకటైన బేంబుసా తుల్డాని జిల్లాలో మొట్టమొదటిసారిగా ప్రయోగాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ వెదురుతో చేసిన ఫర్నిచర్ అందంగా ఉండడంతో పాటు మన్నిక ఎక్కువ ఉంటుంది. ఈ వెదురు త్రిపుర, బెంగాల్, బిహార్ రాష్ట్రాల్లో పెరుగుతుంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశాలతో సోషల్ ఫారెస్ట్ అధికారులు నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, చింతపల్లి, పాడేరు రేంజ్‌ల్లోని నర్సరీల్లో బేంబూసా తుల్డా మొక్కలను పెంచుతున్నారు. రెండు నెలల క్రితం త్రిపుర నుంచి 60 కిలోల విత్తనాలు రప్పించారు. 30 కిలోలు నర్సీపట్నం, ఎలమంచిలి, చోడవరం, మిగిలిన 30 కిలోలు చింతపల్లి, పాడేరుకి సరఫరా చేశారు. ఏజెన్సీలో సాధన, ముళ్లం రకం వెదురు లభిస్తుంది. బేంబూసా తుల్డా 5 నుంచి 10 సెంటీ మీటర్లు మందం, 15 నుంచి 20 మీటర్లు పొడవు పెరుగుతాయి. ఇవి చాలా వేగంగా పెరుగుతాయి. వచ్చే సంవత్సరం ప్లాంటేషన్ చేయడానికి సోషల్ ఫారెస్ట్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. నర్సీపట్నం కలప డిపోలో నెల రోజుల క్రితం విత్తనాలు నాటారు. ఇప్పుడు వెదురు మొక్క దశలో ఉంది. విత్తనాలు మొలకెత్తాయి కాబట్టి... ఇక్కడ వాతావరణంలో కూడా వెదురు పెరగడానికి అనుకూలంగా ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. ప్రయోగం విజయవంతం అయితే ఫారెస్టుతో పాటు రైతులతో కూడా నాటించాలని ప్లాన్ చేస్తున్నారు. దీని వలన ఉపాధి అవకాశాలు మెరుగుపడడంతో పాటు రైతులకు రాబడి బాగుంటుందని అంటున్నారు.
ఫర్నిచర్ తయారీలో వినియోగం
బేంబూసా తుల్డా వివిధ రకాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగిస్తారు. హస్త కళలు, బుట్టలు, చాపలు, అగరబత్తీ కర్రలు, ఫర్నిచర్ తయారు చేయడానికి వాడతారు. ఈ వెదరుతో చేసిన ఫర్నిచర్ చాలా గట్టిగా ఉండి, మన్నిక ఎక్కువ ఉంటుందని జిల్లా అటవీ అధికారి శామ్యూల్ తెలిపారు.
Updated Date - Jul 11 , 2025 | 12:35 AM