కరక కొండపై రంగురాళ్ల తవ్వకాలు?
ABN, Publish Date - Jul 13 , 2025 | 12:47 AM
కరక కొండపై రంగురాళ్ల తవ్వకాలు జరిగినట్టు తెలిసింది. రెండో శనివారం, ఆదివారం సెలవు రోజులు కలిసిరావడంతో అటవీశాఖ అధికారులు ఉండరనే ఉద్దేశంతో పలువురు తవ్వకాలు చేపట్టి ఉంటారని భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి రంగురాళ్ల కోసం తవ్వకాలకు కొందరు వ్యక్తులు పాల్పడినట్టు అటవీశాఖ అధికారులకు సమాచారం వెళ్లింది. రెండు రోజుల క్రితం బయట ప్రాంతం నుంచి వచ్చిన రంగురాళ్ల వ్యాపారులు స్థానిక లాడ్జిలో దిగినట్టు తెలుస్తుంది. వారే కూలీలను పెట్టి తవ్వకాలు జరిపించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రెండు రోజుల సెలవుల నేపథ్యంలో పలువురు వ్యాపారులు తవ్వకాలు జరిపినట్టు అనుమానాలు
నర్సీపట్నం, జూలై 12 (ఆంధ్రజ్యోతి): కరక కొండపై రంగురాళ్ల తవ్వకాలు జరిగినట్టు తెలిసింది. రెండో శనివారం, ఆదివారం సెలవు రోజులు కలిసిరావడంతో అటవీశాఖ అధికారులు ఉండరనే ఉద్దేశంతో పలువురు తవ్వకాలు చేపట్టి ఉంటారని భావిస్తున్నారు. శుక్రవారం రాత్రి రంగురాళ్ల కోసం తవ్వకాలకు కొందరు వ్యక్తులు పాల్పడినట్టు అటవీశాఖ అధికారులకు సమాచారం వెళ్లింది. రెండు రోజుల క్రితం బయట ప్రాంతం నుంచి వచ్చిన రంగురాళ్ల వ్యాపారులు స్థానిక లాడ్జిలో దిగినట్టు తెలుస్తుంది. వారే కూలీలను పెట్టి తవ్వకాలు జరిపించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ మేరకు శనివారం నర్సీపట్నం రేంజ్ అధికారి రాజేశ్వరరావు కరక రంగురాళ్ల క్వారీని సందర్శించారు. బేస్ క్యాంప్ సిబ్బందిని విచారించారు. గతంలో రంగురాళ్ల తవ్వకాలు జరిపిన చెదురు క్వారీ, బొగ్గు క్యారీ, టెంట్ క్వారీ, తాటిచెట్ల క్వారీలను ఆయన పరిశీంచారు. అక్కడ తవ్వకాలు జరిపినట్టు ఎటువంటి ఆనవాళ్లు లేవని రేంజర్ పేర్కొన్నారు. కాగా జనవరి 31న ఇద్దరు రంగురాళ్ల వ్యాపారులను తీసుకుని మైనింగ్ అధికారులు కరక కొండపై సర్వే చేశారు. అటవీశాఖ అధికారుల అనుమతి లేకుండా మైనింగ్ అధికారులను రేంజ్ కార్యాలయానికి పిలిపించి రెండు రోజులపాటు విచారణ కూడా జరిపారు. అయితే నిషేధిత రిజర్వ్ ఫారెస్టు పరిధిలో ఉన్న కరక కొండ పైకి వెళ్లిన మైనింగ్ అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా మళ్లీ కరక రంగు క్యారీలో తవ్వకాలు జరిపినట్టు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. దీనిపై రేంజర్ రాజేశ్వరరావును వివరణ కోరగా... కరకలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయన్నారు. ఎవరైనా అక్రమంగా తవ్వకాలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కరక కొండపై రెండు బేస్ క్యాంపులు, స్ర్టైకింగ్ ఫోర్సును నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
Updated Date - Jul 13 , 2025 | 12:47 AM