టీచర్ల బదిలీలకు సర్వం సిద్ధం
ABN, Publish Date - May 20 , 2025 | 01:36 AM
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కసరత్తును విద్యా శాఖ పూర్తిచేసింది. అన్ని కేటగిరీలు కలిపి 4,811 మందికి బదిలీ కానున్నది.
4,811 మందికి స్థాన చలనం
ఐదు/ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తిచేసినవారు 2,121 మంది
సర్దుబాటు ద్వారా ఏర్పడిన ఖాళీలు 1,851
ఇప్పటికే ఉన్న ఖాళీలు 780
విశాఖపట్నం, మే 19 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన కసరత్తును విద్యా శాఖ పూర్తిచేసింది. అన్ని కేటగిరీలు కలిపి 4,811 మందికి బదిలీ కానున్నది. ఉమ్మడి జిల్లాలో జడ్పీ, ప్రభుత్వ, మునిసిపల్ పాఠశాలల్లో సుమారు 15 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా వారిలో మూడో వంతు టీచర్లు ప్రస్తుతం పనిచేసే చోట నుంచి మరో చోటకు వెళ్లనున్నారు. జీవో 117 రద్దు చేసిన కూటమి ప్రభుత్వం పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో ఏడు రకాల పాఠశాలలు ఏర్పాటుకానున్నాయి. దీనికి అనుగుణంగా విద్యార్థి, టీచర్ నిష్పత్తిని పరిగణనలోకి తీసుకున్న విద్యా శాఖ అధికారులు 1,851 పోస్టులను ఒక చోట నుంచి మరోచోటకు సర్దుబాటు చేశారు. సర్దుబాటు ద్వారా పోస్టు బదలాయింపు జరిగిన చోట కొత్తగా టీచర్లను నియమించాల్సి ఉంటుంది. దీంతో 1,851 మంది టీచర్లకు స్థాన చలనం కలగనున్నది. ఇక ఒకేచోట ఐదేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న హెచ్‌ఎంలు, ఎనిమిదేళ్లు సర్వీస్ పూర్తిచేసిన స్కూలు అసిస్టెంట్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, సెకండరీ గ్రేడ్ టీచర్లు 2,121 మంది ఉన్నట్టు గుర్తించారు. దీంతో వారందరికీ తప్పనిసరిగా బదిలీ జరగనున్నది. అలాగే పదవీ విరమణ, పదోన్నతి పొందిన, మరణించిన లేదా ఇతర కారణాల వల్ల 780 ఖాళీలు న్నట్టు గుర్తించారు. త్వరలో జరగనున్న బదిలీల్లో ఆ 780 పోస్టులను భర్తీచేస్తారు. దీర్ఘకాలిక సెలవుపై విదేశాలకు వెళ్లిన టీచర్లు ఐదుగురు, స్టడీ లీవ్‌పై వెళ్లిన 51 మంది, విధులకు గైర్హాజరైన టీచర్లు ముగ్గురి స్థానాలను కూడా బదిలీల ద్వారా భర్తీచేస్తారు. కాగా ఎంతమందికి స్థానచలనం కలుగుతుందన్న దానిపై ఇప్పటికే నివేదిక రూపొందించామని విశాఖ డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు. మొత్తం 4,811మంది టీచర్లకు స్థాన చలనం కలుగుతుందన్నారు.
Updated Date - May 20 , 2025 | 01:36 AM