అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందాలి
ABN, Publish Date - Apr 24 , 2025 | 11:21 PM
మారుమూల గిరిజన గ్రామాల్లో నివసించే చిట్టచివరి గిరిజనుడి వరకు ప్రభుత్వ పథకాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని 20 సూత్రాల ఆర్థిక ప్రణాళిక అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు.
అప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యం
20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్
అరకు నియోజకవర్గంలోని మారుమూల గ్రామాల్లో పర్యటన
అరకులోయ, ఏప్రిల్ 24(ఆంధ్రజ్యోతి): మారుమూల గిరిజన గ్రామాల్లో నివసించే చిట్టచివరి గిరిజనుడి వరకు ప్రభుత్వ పథకాలు అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యమని 20 సూత్రాల ఆర్థిక ప్రణాళిక అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ అన్నారు. అరకు నియోజకవర్గం అనంతగిరి మండలం పైనంపాడు, అరకులోయ మండలం సిమిలిగుడ గ్రామాల్లో జాతీయ పంచాయతీరాజ్ దివస్ సందర్భంగా గురువారం నిర్వహించిన గ్రామ సభల్లో ఆయన పాల్గొని ప్రధానమంత్రి జన్‌మన్ పథకం లబ్ధిదారులతో సమావేశమయ్యారు. అనంతరం ఆ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ పీఎం నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నేతృత్వంలో గిరిజనులకు మౌలిక వసతుల కల్పన, ప్రభుత్వ పథకాలు అందించడం వంటి కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయన్నారు. వాటిని వినియోగించుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. పైనంపాడు పంచాయతీ పరిధి కాకరపాడు, ఎగువ సోనభ, దిగువ సోనభ, కొంగుపుట్టు, దుర్గం, పల్లి మామిడి, గ్రామాల లబ్ధిదారులు తమ సమస్యలను ఆయనకు వివరించారు. ప్రధానంగా పైనంపాడు, కాకరపాడు గ్రామాల మధ్య రహదారి సరిగా లేనందువల్ల ఇటుక, ఇసుక సిమెంట్ తెచ్చుకోవడం చాలా కష్టంగా ఉందని, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లి తమ ప్రాంతంలో రోడ్డు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం కాకరపాడులో పీఎం జన్‌మన్ పథకం కింద నిర్మిస్తున్న ఇళ్లను ఆయన పరిశీలించారు. సిమిలిగుడ గ్రామంలో లబ్ధిదారులకు గృహ మంజూరు పత్రాలను ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో లవరాజు, త్రెడ్స్ సంస్థ ప్రతినిధి రాజు, పైనంపాడు సర్పంచ్ సీదరి చెల్లమ్మ, ఎంపీటీసీ సభ్యుడు వంతల రామన్న, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Apr 24 , 2025 | 11:21 PM