గిరిజనులు సుభిక్షంగా ఉండాలని మొక్కుకున్నా..
ABN, Publish Date - May 13 , 2025 | 11:05 PM
గిరిజనులు సుభిక్షంగా ఉండాలని మోదకొండమ్మ అమ్మవారిని మొక్కుకున్నానని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మోదకొండమ్మ ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం ఆమె మోదకొండమ్మను దర్శించుకున్నారు.
జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి
పాడేరు, మే 3(ఆంధ్రజ్యోతి): గిరిజనులు సుభిక్షంగా ఉండాలని మోదకొండమ్మ అమ్మవారిని మొక్కుకున్నానని రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. మోదకొండమ్మ ఉత్సవాల ముగింపు సందర్భంగా మంగళవారం ఆమె మోదకొండమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ లాంఛనాలతో మంత్రికి ఆలయ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. గర్భాలయంలో మోదకొండమ్మకు మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు సతకంపట్టులో కొలువు తీరిన మోదకొండమ్మను దర్శించుకున్నారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ప్రజలను చల్లగా చూడాలని మోదకొండమ్మను వేడుకున్నానన్నారు. అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారన్నారు. రద్దయిన జీవో:3కి ప్రత్యామ్నాయంగా గిరిజనులకు మేలు జరిగేలా మరో జీవోను జారీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త్వరలోనే జిల్లాను సందర్శిస్తారని మంత్రి తెలిపారు. అధికారులు, ఉత్సవ కమిటీ సమన్వయంతో మోదకొండమ్మ జాతరను విజయవంతం చేశారని అభినందించారు. అనంతరం ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ శాఖల స్టాల్స్‌ను ఆమె సందర్శించారు. ఽగిరిజన మహిళలతో థింసా నృత్యం చేశారు. అడ్డాకులతో తయారు చేసిన టోపీని ధరించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి కలెక్టర్, జేసీ ఎంజే.అభిషేక్‌గౌడ, ఎస్‌పీ అమిత్‌బర్ధార్, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ వి.అభిషేక్, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్‌కుమార్, ఎస్టీ కమిషన్ చైర్మన్ సొల్ల బొజ్జిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఐటీడీఏ ఏపీవో ఎం.వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి, గిరిజన సంక్షేమ శాఖ డీడీ ఎల్.రజిని, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - May 13 , 2025 | 11:05 PM