బదిలీ అయినా... అక్కడే!
ABN, Publish Date - Jul 21 , 2025 | 12:35 AM
పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది.
పాత పాఠశాలల్లోనే టీచర్ల విధులు
100 మందికిపైగా హిందీ పండిట్లు వెనక్కి
కొన్నిచోట్ల సబ్జెక్టు టీచర్లకూ తప్పని అవస్థలు
ఇప్పటికీ రిలీవ్ కాలేని పరిస్థితి
ఆ స్థానంలో కొత్తవారు రాకపోవడమే కారణం
డీఎస్సీ నియామకాలు జరిగే వరకు ఇదే పరిస్థితి
విశాఖపట్నం, జూలై 20 (ఆంధ్రజ్యోతి):
పాఠశాల విద్యాశాఖలో ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ప్రహసనంగా మారింది. మొత్తం బదిలీల్లో 40 శాతం మంది ఇప్పటికీ పాత స్థానాల్లోనే పనిచేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 100 మంది హిందీ పండిట్లు, మరికొన్ని సబ్జెక్టుల టీచర్లు కొత్త పాఠశాలల్లో చేరలేదు. టీచర్ల కొరత నేపథ్యంలో బదిలీ అయినా రిలీవ్ చేయడంలో సమస్య ఉత్పన్నమైంది. డీఎస్సీ ఫలితాలు వెల్లడించిన తరువాత కొత్తవారికి పోస్టింగ్స్ ఇచ్చే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని విద్యాశాఖ వర్గాలు చెబుతున్నాయి.
గత నెలలో నిర్వహించిన ప్రక్రియలో ఉమ్మడి జిల్లాలోని అన్ని కేటగిరీలకు చెందిన సుమారు ఐదువేల మంది టీచర్లకు బదిలీ అయింది. ఒకేచోట ఎనిమిదేళ్లు పూర్తిచేసుకున్న ఎస్జీటీలు, స్కూలు అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు బదిలీ అయ్యారు. అయితే అంతేస్థాయిలో టీచర్లు ఏజెన్సీ, మారుమూల గిరిజన, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లలేదు. నిబంధనల మేరకు ఉపాధ్యాయుడు ఒక పాఠశాల నుంచి రిలీవ్ కావాలంటే ఆ స్థానంలో మరొకరు బాధ్యతలు తీసుకోవాలి. కానీ కొరత నేపథ్యంలో వీరంతా బదిలీ అయిన పాఠశాలల్లో జాయినింగ్ రిపోర్టు ఇచ్చి, తిరిగి పాత పాఠశాలల్లోనే పాఠాలు బోధించాల్సిన పరిస్థితి నెలకొంది.
టీచర్ల కొరతే కారణం
ఉమ్మడి జిల్లాలో పోస్టులకు తగినంతమంది హిందీ పండిట్లు లేరు. మూడు జిల్లాల పరిధిలో సుమారు 100 మంది హిందీ పండిట్లు అవసరం. కొత్త డీఎస్సీలో 28 హిందీ పండిట్ పోస్టులు మాత్రమే భర్తీకానున్నాయి. ఈ ఏడాది జీవో నంబరు 177 రద్దు చేసిన తరువాత చేపట్టిన సంస్కరణలతో కొన్ని ఉన్నత పాఠశాలల్లో రెండు, మూడో హిందీ పోస్టు అవసరం ఏర్పడింది. ఎక్కువగా విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని రోడ్లకు ఆనుకుని ఉన్న ఉన్నత పాఠశాలల్లో కొత్త పోస్టులు కేటాయించారు. బదిలీల సమయంలో ఏజెన్సీ, మారుమూల ప్రాంతాల్లోని హిందీ పండిట్లు ఈ పాఠశాలలకు ఆప్షన్ ఇచ్చారు. వారి స్థానంలో కొత్తవారు వచ్చేందుకు పండిట్ల కొరత ఏర్పడింది. దీంతో 100 మంది హిందీ పండిట్లు కొత్త స్థానాల్లో రిపోర్టుచేసి, తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. దీంతో ఆయా పాఠశాలల్లో బోధనకు సరిపడా హిందీ పండిట్లు లేరని సంబంధిత హెచ్‌ఎంలు వాపోతున్నారు. మిగిలిన సబ్జెక్టులకు సంబంధించి కొన్నిచోట్ల స్కూలు అసిస్టెంట్లు కొత్త పాఠశాలలో రిపోర్టుచేసి తిరిగి వెళ్లిపోయారు. మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్ ఎంలుగా పోస్టింగ్ పొందిన స్కూలు అసిస్టెంట్లదీ అదే పరిస్థితి. దీనికితోడు జూన్ నెలాఖరున ఉమ్మడి జిల్లాలో 100 మందికిపైగా టీచర్లు ఉద్యోగ విరమణ చేశారు. ఈనెలలో మరో 100 మంది వరకు రిటైర్ కానున్నారు. దీంతో పలుపాఠశాలల్లో టీచర్ల కొరత ఏర్పడింది.
నగరంలోని హెచ్‌సీ వెంకటాపురం పాఠశాలలో రెండు బయాలజీ అసిస్టెంట్ పోస్టులున్నాయి. బదిలీపై ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన ఇద్దరు టీచర్లలో ఒకరు గతనెలలో ఉద్యోగ విరమణ చేశారు. మరొకరు గతంలో పనిచేసిన పాఠశాలలోనే ఉండాల్సి రావడంతో ఇక్కడ పాఠాలు బోధించేవారు కరవయ్యారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యామ్నాయం అన్వేషించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
Updated Date - Jul 21 , 2025 | 12:35 AM