అల్లూరి స్మారక ప్రదేశాలపై అంతులేని నిర్లక్ష్యం
ABN, Publish Date - May 07 , 2025 | 12:23 AM
బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక ప్రదేశాలు ఆలనా పాలనా లేక అధ్వానంగా తయారయ్యాయి. మండలంలోని మంప, రాజేంద్రపాలెంలో గల అల్లూరి స్మారక ప్రదేశాలను పట్టించుకునే నాథుడే లేక దారుణంగా ఉన్నాయి.
- మంప, రాజేంద్రపాలెంలలో అధ్వానం
- అసంపూర్తి నిర్మాణాలతో వెలవెల
- ఏటా అల్లూరి జయంతి, వర్ధంతి నాడు అధికారుల ఆర్భాటం
- ఆ తరువాత పట్టించుకోని వైనం
- నేడు అల్లూరి సీతారామరాజు వర్ధంతి సందర్భంగా...
కొయ్యూరు, మే 6(ఆంధ్రజ్యోతి): బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు స్మారక ప్రదేశాలు ఆలనా పాలనా లేక అధ్వానంగా తయారయ్యాయి. మండలంలోని మంప, రాజేంద్రపాలెంలో గల అల్లూరి స్మారక ప్రదేశాలను పట్టించుకునే నాథుడే లేక దారుణంగా ఉన్నాయి.
మంప స్మారక ప్రదేశంలో రెండేళ్ల క్రితం విశాఖపట్నానికి చెందిన రాజ్‌కుమార్ పర్యవేక్షణలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల క్షత్రీయ సంఘం ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. అల్లూరి స్నానమాచరించిన కొలనును అభివృద్ధి చేశారు. అల్లూరిని బ్రిటిష్ పాలకులు పట్టుకుని కట్టేసిన ప్రదేశంలో గతంలో ఏర్పాటు చేసిన స్థూపాన్ని తొలగించి దాని స్థానంలో కొత్త స్థూపాన్ని కొంత మేర నిర్మించారు. అయితే దానిపై చరిత్రను తెలిపే శిలాఫలకాన్ని ఏర్పాటు చేయకుండా అసంపూర్తిగా ఉంచారు. కొలను మధ్యలో అల్లూరి ధ్యానం చేసే విగ్రహాన్ని ఏర్పాటు చేశారు గానీ కొలను నిర్వహణను గాలికి వదిలేశారు. దీంతో కొలను నాచు పట్టి పిచ్చి మొక్కలతో అధ్వానంగా మారింది. ఇక అల్లూరి విగ్రహం ఉన్న స్మారక మందిరాన్ని వాచ్‌మన్ నివాస గృహంగా మార్చేయడంతో పర్యాటకులు ఇక్కడికి వచ్చే పరిస్థితి లేకుండాపోయింది. ఇక పార్కు విషయానికి వస్తే పచ్చదనం కరువై బోసిపోయి దర్శనమిస్తోంది. స్మారక ప్రదేశం అభివృద్ధి పనులను క్షత్రీయ సంఘం ఆధ్వర్యంలో చేస్తున్నారా?, లేక ప్రభుత్వ నిధులతో చేపడుతున్నారా? అనేది స్పష్టత లేదు.
రాజేంద్రపాలెంలో..
రాజేంద్రపాలెం స్మారక మందిరాల విషయానికి వస్తే గత ప్రభుత్వ హయాంలో అల్లూరి శత జయంతి ఉత్సవాల పేరిట ఉన్న భవనాలను కూల్చారు. అల్లూరితో పాటు గంటందొర, మల్లుదొర కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేసి అప్పటి గిరిజన సంక్షేమశాఖా మంత్రి పీడిక రాజన్నదొరతో ఆవిష్కరింపజేశారు. స్మారక ప్రాంతంలో అల్లూరిని కాల్చి చంపిన ప్రదేశం వద్ద చరిత్ర ఆనవాళ్లను సైతం తొలగించి ప్రహరీ నిర్మాణం చేపట్టి భూమిని చదును చేశారు. అయితే దీని నిర్వహణను పట్టించుకోకపోవడంతో స్మారక ప్రదేశం పిచ్చి మొక్కలతో నిండిపోయింది. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అల్లూరి స్మారక ప్రదేశాల వద్ద ప్రతి ఏడాది జయంతి, వర్ధంతి రోజున అధికారులు ఆర్భాటం చేయడం తప్పితే పర్యాటకంగా దీనిని తీర్చిదిద్దే చర్యలు చేపట్టడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2019కి ముందు అప్పటి టీడీపీ ప్రభుత్వం అల్లూరి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. స్మారక ప్రదేశాల అభివృద్ధికి నివేదికలు తయారు చేయించింది. ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం దీనిని పూర్తిగా విస్మరించింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉన్నందున మంప, రాజేంద్రపాలెం స్మారక ప్రదేశాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దే చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.
Updated Date - May 07 , 2025 | 12:23 AM