ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మన్యంలో అంతరించిపోతున్న తేనెటీగలు

ABN, Publish Date - Jun 06 , 2025 | 10:51 PM

మన్యంలో తేనెటీగలు అంతరించిపోతుండడంతో వలిసెల సాగు ప్రశ్నార్థకంగా మారింది. వలిసెల పంటకు, తేనెటీగలకు విడదీయలేని అవినాభావ సంబంధం వుంది. వలిసెల సాగుకు గిరిజన ప్రాంతం అనుకూలమైనప్పటికీ దిగుబడులకు తేనెటీగల పాత్ర అత్యంత కీలకం. ఇటీవల కాలంలో తేనెటీగల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో తేనె మకరందంతోపాటు వలిసెల దిగుబడులు భారీగా పడిపోతున్నాయి.

మకరందం కోసం వచ్చి పరాగ సంపర్కం చేస్తున్న తేనెటీగ(ఫైల్‌)

ప్రశ్నార్థకంగా మారిన వలిసెల సాగు

గణనీయంగా పడిపోతున్న దిగుబడులు

దూరమైన తేనెల మకరందం

సహజ వనరులు సంరక్షించుకోవాలి : శాస్త్రవేత్తలు

చింతపల్లి, జూన్‌ 6 : దక్షిణ భారతదేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో వలిసెల పంట పండుతోంది. ఈప్రాంత వాతావరణం సహకరించడంతో 50 ఏళ్లగా ఆదివాసీలు సాగు చేస్తున్నారు. వలిసెల నూనెకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ వుంది. దీంతో ఆదివాసీలు పండించే వలిసెలకు మార్కెట్‌లో మంచి ధర లభిస్తుంది. పాడేరు రెవెన్యూ డివిజన్‌ పరిధిలో 12 ఏళ్ల క్రితం వరకు 8,500 హెక్టార్లలో వలిసెలను గిరిజన రైతులు సాగు చేసేవారు. కాలక్రమంగా ఆకాశపందిరి కలుపు, దిగుబడులు తగ్గడం వల్ల సాగు విస్తీర్ణం పడిపోయింది. గిరిజన ప్రాంతంలో ప్రస్తుతం సాధారణ సాగు విస్తీర్ణం 3,037 హెక్టార్లు కాగా.. గత ఏడాది కేవలం 725 హెక్టార్లలో మాత్రమే గిరిజనులు ఈ పంటను సాగు చేశారు.

తేనెటీగలు పాలినేషన్‌ చేస్తేనే దిగుబడులు

వలిసెల దిగుబడులు రావాలంటే తేనెటీగలు పాలినేషన్‌ (పరాగ సంపర్కం) చేయాలి. వలిసెల మొక్కలు స్వయంగా పాలినేషన్‌ చేసుకోలేవు. ఒక మొక్క పూలపై వాలిన తేనెటీగలు మరో మొక్క పూలపై వాలితే పాలినేషన్‌ జరుగుతుంది. తేనెటీగలు మినహా ఇతర కీటకాలు వలిసెల పాలినేషన్‌ చేయలేవు. గతంలో గిరిజన ప్రాంతంలో తేనెటీగలు అత్యధిక సంఖ్యలో ఉండేవి. దీంతో వలిసెల పంట ఎక్కడ ఉన్నా తేనెటీగలు మకరందం సేకరించేందుకు వెతుక్కుంటూ వచ్చేవి. దీంతో పాలినేషన్‌ జరిగేది. సెల్‌ సాంకేతాల రేడియేషన్‌, వాతావరణ కాలుష్యం పెరిగిపోవడంతో తేనెటీగల సంఖ్య గణనీయంగా పడిపోయింది. గతంలో అడవి తేనె విస్తృతంగా లభించేది. ప్రస్తుతం తేనె దొరకడం అరుదుగా మారింది. ప్రస్తుతం అందుబాటులోనున్న అతి తక్కువ తేనెటీగలు తేనెను అందిస్తున్నాయి. అలాగే వలిసెల పంట దిగుబడులకు కొంత వరకు సహకరిస్తున్నాయి.

వలిసెలపై ఆర్‌ఏఆర్‌ఎస్‌లో పరిశోధనలు

ఆదివాసీ రైతులకు మేలిజాతి వలిసెల వంగడాలను అందించేందుకు 2018లో ప్రభుత్వం ఆల్‌ ఇండియా కోఆర్డినేటెడ్‌ రీసెర్చ్‌ ప్రాజెక్టు(ఏఐసీఆర్‌పీ) పథకం చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానానికి మంజూరు చేసింది. ఈ పథకంలో భాగంగా మధ్యప్రదేశ్‌ జబదల్‌పూర్‌ నుంచి మేలిజాతి వలిసెల వంగడాలను దిగుమతి చేసుకుని ఏడేళ్లుగా విత్తనాల అభివృద్ధిపై శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారు. గత ఏడాది సీపీఎల్‌(చింతపల్లి)-1, 2 రకాలు మేలిజాతి వంగడాలుగా ఎంపికచేశారు. ఈ రెండు రకాలు హెక్టారుకు ఐదు-ఆరు టన్నుల దిగుబడినిస్తున్నాయి. తెగుళ్లు, ఆకాశపందిరి కలుపును తట్టుకుంటుంది. దీంతో శాస్త్రవేత్తలు ఈ రెండు రకాలను విడుదల చేసేందుకు తుది దశ పరిశోధనలు చేస్తున్నారు. అయితే తేనెటీగలు ఆశించిన మేరకు లేకపోవడంతో పరిశోధనలకు సైతం సమస్యలు తలెత్తుతున్నాయి.

ప్రకృతి అందాలకు వలిసెల వన్నె

గిరిజన ప్రాంతంలో వలిసెల పంట ప్రకృతి అందాలకు వన్నె తెస్తుంది. వలిసెల పంటను రబీకాలంలో రైతులు సాగు చేస్తారు. అదే సమయంలో పర్యాటక సీజన్‌ ప్రారంభమవుతుంది. దీంతో వలిసెల అందాలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో పొరుగు రాష్ట్రాలు, దేశాల నుంచి పర్యాటకులు గిరిజన ప్రాంతానికి వస్తున్నారు. వలిసెల పంట వద్ద ఫొటోలు తీసుకుని ఎంజాయ్‌ చేస్తుంటారు.

సహజ వనరులను సంరక్షించాలి

డాక్టర్‌ ఆళ్ల అప్పలస్వామి, ఏడీఆర్‌, వ్యవసాయ పరిశోధన స్థానం, చింతపల్లి

గతంలో తేనెటీగల నివాసానికి గిరిజన ప్రాంతంలో అనువైన వాతావరణం ఉండేది. అడవుల శాతం తగ్గడం, జలవనరులు అంతరించిపోతుండడంతోపాటు వాహనాలు, సెల్‌ టవర్లు సంఖ్య పెరగడం వల్ల వాతావరణ కాలుష్యం పెరిగిపోతుంది. ఫలితంగా తేనెటీగలు కనిపించకుండా పోతున్నాయి. తేనెటీగలపై ఆధారపడిన వలిసెల పంట దిగుబడులు పడిపోతున్నాయి. ప్రజలు అడవులు, సహజ వనరులను కాపాడుకోవడం వల్ల కొంత వరకు తేనెటీగలను సంరక్షించవచ్చు.

Updated Date - Jun 06 , 2025 | 10:51 PM