సొత్తు కోసమే వృద్ధ దంపతుల హత్య
ABN, Publish Date - May 04 , 2025 | 12:53 AM
దువ్వాడ సమీపాన గల రాజీవ్ కాలనీలో వారం కిందట జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసుని పోలీసులు ఛేదించారు.
దువ్వాడ జంట హత్యల కేసులో వీడిన మిస్టరీ
నిందితుడు ఒడిశా వాసి
మృతురాలితో వివాహేతర సంబంధం
ఆభరణాల కోసమే ఆమెను చంపాడు
ఆ దారుణం చూశాడని ఆమె భర్తను హత్య చేశాడు
విశాఖపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి):
దువ్వాడ సమీపాన గల రాజీవ్ కాలనీలో వారం కిందట జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసుని పోలీసులు ఛేదించారు. మహిళ మెడలోని ఆభరణాలను దొంగిలించేందుకు ఆమెతో సన్నిహిత సంబంఽధం కలిగిన వ్యక్తే హత్యకు పాల్పడినట్టు నిర్ధారించారు. నిందితుడి నుంచి రెండు సెల్‌ఫోన్‌లు, రూ.4.18 లక్షల నగదు, హత్యకు వాడిని కత్తిని పోలీసులు స్వాధీనం చచేసుకున్నారు. నగర పోలీస్ కమిషనరేట్‌లో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సీపీ శంఖబ్రతబాగ్చి దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
గంపల యోగేంద్రబాబు (66), ఆయన భార్య లక్ష్మి (58) కలిసి దువ్వాడలోని రాజీవ్‌కాలనీలో సొంత ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఒడిశా రాష్ట్రం పూరీకి చెందిన ప్రసన్నకుమార్‌మిశ్రా (58) కూడా వారి ఇంటికి సమీపంలోనే నివాసం ఉండేవాడు. పక్కపక్క ఇళ్లు కావడంతో ప్రసన్నకుమార్‌మిశ్రా భార్య, గంపల లక్ష్మి స్నేహంగా ఉండేవారు. కొవిడ్ సమయంలో ప్రసన్నకుమార్‌మిశ్రా భార్య మరణించడంతో అతను ఇల్లు ఖాళీ చేసి ద్వారకా నగర్ ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలోని ఒక డార్మెటరీలో ఉంటున్నాడు. రాజీవ్ కాలనీలో ఉన్నప్పుడే ప్రసన్నకుమార్‌మిశ్రాకు గంపల లక్ష్మితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ సంబంధం కొనసాగిస్తూ వచ్చారు. ప్రసన్నకుమార్ మిశ్రాకు ఆర్థిక ఇబ్బందుల కారణంగా అప్పులు చేసేశాడు. వాటిని తీర్చేందుకు ఆభరణాలు ఇవ్వల్సిందిగా లక్ష్మిని కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో ఆమెను చంపేసి ఆభరణాలను తీసుకువెళ్లాలని ప్రసన్నకుమార్‌మిశ్రా పథకం రచించాడు. గత నెల 24న గాజువాకలోని ఒక సూపర్‌మార్కెట్‌కు వెళ్లి కత్తి కొనుగోలుచేసి నేరుగా లక్ష్మి ఇంటికి వెళ్లాడు. బంగారం ఇవ్వాలని మరోసారి అడిగాడు. ఆమె ససేమిరా అనడంతో మెడను కత్తితో కోసి హత్య చేశాడు. ఆమె మెడలోని ఆభరణాలను తెంచుకుని వెళ్లిపోతుండగా, మరో గదిలో ఉన్న లక్ష్మి భర్త యోగేంద్రబాబు రావడంతో ఆయన్ను కూడా హత్యచేశాడు. అనంతరం యోగేంద్రబాబుకు చెందిన స్కూటీపై వెళ్లిపోయాడు. హత్య చేసిన తర్వాత డైమండ్ పార్కు సమీపంలోని సాయిరాం డార్మెటరీకి వెళ్లి రెండు గంటలు ఉన్నాడు. అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌కు వెళ్లి స్కూటీని పార్కింగ్‌లో వదిలేసి, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో భువనేశ్వర్, అక్కడి నుంచి పూరీ వెళ్లిపోయాడు. చోరీచేసిన బంగారు ఆభరణాలను అక్కడ తన సోదరి చేతికి ఇచ్చి అమ్మి తనకు డబ్బులు తేవాలని కోరాడు. ఆమె బంగారం దుకాణానికి వెళ్లి ఆభరణాలను కరిగించి రూ.4.28 లక్షలకు విక్రయించింది. ఆ సొమ్మును తన సోదరుడైన ప్రసన్నకుమార్‌మిశ్రాకు ఇచ్చింది.
ఈ హత్య కేసు దర్యాప్తులో భాగంగా మృతురాలు లక్ష్మి సెల్‌ఫోన్‌ను పోలీసులు పరిశీలించారు. కాల్ డేటాను తీశారు. కొన్ని నంబర్లు ఆమె డిలీట్ చేసినట్టు గుర్తించారు. ఓ నంబర్ గల వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా, గతనెల 21న తాను దువ్వాడ మాక్స్ షోరూమ్ వద్ద ఉండగా సుమారు 56 ఏళ్ల వయస్సు కలిగిన వ్యక్తి వచ్చి కాగితంపై రాసుకున్న నంబర్‌కు తన ఫోన్ నుంచి కాల్ చేసినట్టు చెప్పారు. అక్కడవున్న సీసీ కెమెరాలను పరిశీలించగా ప్రసన్నకుమార్‌మిశ్రా ఫోన్ మాట్లాడినట్టు నమోదైంది. ఆ ఫొటోను దువ్వాడ ప్రాంతంలో పలువురికి చూపించగా ప్రసన్నకుమార్‌మిశ్రాగా, అతనిస్వస్థలం ఒడిశా అని నిర్ధారించడంతోపాటు వారివద్ద ఉన్న ఫోన్ నంబర్‌ను ఇచ్చారు. ఆ ఫోన్ నంబర్ రాణిశర్మ అనే మహిళ పేరుతో ఉన్నట్టు గుర్తించారు. కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని రావడంతో సీపీ శంఖబ్రతబాగ్చి ఆదేశాల మేరకు సౌత్ ఏసీపీ టి.త్రినాథ్ ఆధ్వర్యంలో 15 మంది సీఐలు, వంద మంది సిబ్బంది ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఒడిశాలో ఉన్న ప్రసన్నకుమార్‌మిశ్రాను గుర్తించి అదుపులోకి తీసుకున్నాయి. మొదట తాను ఇద్దరినీ హత్య చేయలేదని చెప్పాడు. గంపల లక్ష్మికి తనతో వివాహేతర సంబంధం ఉందని తెలిసి ఆమె భర్త యోగేంద్రబాబు హత్య చేస్తే, తాను యోగేంద్రబాబును హత్య చేసినట్టు చెప్పాడు. తర్వాత పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో సొత్తుకోసం లక్ష్మిని తాను హత్యచేసి వెళ్లిపోతుండగా యోగేంద్రబాబు చూడడంతో ఆయన్ను కూడా హత్యచేసినట్టు అంగీకరించాడు. నిందితుడు గతంలో యూఏఈలో ఉన్నప్పుడు చోరీకి పాల్పడి, ఐదేళ్లు జైలుశిక్ష అనుభవించాడని, విడుదలైన తర్వాత ఇండియాకు వచ్చి విశాఖలో నివాసం ఉంటున్నాడని సీపీ వివరించారు. ఈ సమావేశంలో డీసీపీలు అజితా వేజెండ్ల, మేరీప్రశాంతి, లతామాధురి, ఏసీపీలు త్రినాథరావు, లక్ష్మణరావు పాల్గొన్నారు.
Updated Date - May 04 , 2025 | 12:53 AM