స్వర్ణాంధ్ర- 2047 లక్ష్య సాధనకు కృషి
ABN, Publish Date - May 06 , 2025 | 12:31 AM
స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యాలను చేరుకునేందుకు, జిల్లా వృద్ధి రేటు 15 శాతానికి పెంచేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు.
అధికారులకు కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశం
పాడేరు, మే 5(ఆంధ్రజ్యోతి): స్వర్ణాంధ్ర- 2047 లక్ష్యాలను చేరుకునేందుకు, జిల్లా వృద్ధి రేటు 15 శాతానికి పెంచేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన స్వర్ణాంధ్ర- 47 వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. అన్ని రంగాల్లోనూ వృద్ధి రేటు 15 శాతం సాధించేందుకు లక్ష్యం మేరకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. ప్రధానంగా ఉద్యాన, వ్యవసాయ రంగాల్లోనూ చక్కని పురోగతి సాధించేందుకు జిల్లాలో ఎక్కువగా అవకాశం ఉందన్నారు. వాటి ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేసి గిరిజనులకు లబ్ధి చేకూర్చాలన్నారు. రైతులను రైతు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పాటు చేసి, వారికి మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. గతంతో పోలిస్తే కాఫీ, మిరియాలు ద్వారా గిరిజన రైతులు రూ.లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్నారన్నారు. జిల్లాలో 15 శాతం ఉత్పాదకతను పెంచేందుకు వివిధ శాఖల అధికారులు కృషి చేయాలన్నారు. రానున్న ఐదేళ్లలో జిల్లాను ఆర్గానిక్‌గా మార్చేందుకు చర్యలు చేపడుతున్నామని, 2028 నాటికి పాడేరు డివిజన్, 2029 నాటికి రంపచోడవరం, 2030కి చింతూరు డివిజన్లను సంపూర్ణంగా ఆర్గానిక్‌గా మారుస్తామన్నారు.
అటవీ ఉత్పత్తుల మారె ్కటింగ్‌కు ట్రైబల్ ఈకామ్
జిల్లాలోని గిరిజనులు పండించే, సేకరించే అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పించేందుకు ట్రైబల్ ఈకామ్ ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. మార్కెటింగ్‌పై వివిధ శాఖల అధికారులతో సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. వ్యవసాయ, ఉద్యావనాధికారులు పంట సాగు విస్తీర్ణం పెంచడంతోపాటు అధిక దిగుబడులు సాధించేలా రైతులను ప్రోత్సహించాలన్నారు. జీసీసీ ద్వారా అటవీ ఉత్పత్తుల మార్కెటింగ్, గిట్టుబాటు ధర కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే.అభిషేక్‌గౌడ, సబ్‌కలెక్టర్ శౌర్యమన్‌పటేల్, జిల్లా వ్యవసాయాధికారి ఎస్‌బీఎస్ నంద్, జిల్లా ఉద్యానవనాధికారి రమేశ్‌కుమార్‌రావు, మైక్రో ఇరిగేషన్ పీడీ రహీమ్, డ్వామా పీడీ విద్యాసాగరావు, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, నీతి ఆయోగ్ ప్రతినిధి ఛైతన్యరెడ్డి, జీసీసీ అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
వరదల పట్ల యంత్రాంగం అప్రమత్తం
పాడేరు, మే 5(ఆంధ్రజ్యోతి): వాతావరణంలో మార్పులతో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేయడంతో పాటు టోల్ ఫ్రీ నంబర్: 18004256826ను అందుబాటులోకి తీసుకు వచ్చింది. వరదల నేపథ్యంలో ఎటువంటి సమాచారం, సమస్యనైనా టోల్ ఫ్రీ నంబర్‌కు తెలపాలని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ సూచించారు. భారీ వర్షాలతో పాటు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించిందన్నారు. వరదల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండడంతో పాటు గెడ్డలు, వాగులు దాటవద్దని, సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని కలెక్టర్ కోరారు. వివిధ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
Updated Date - May 06 , 2025 | 12:31 AM