ఏయూ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్!
ABN, Publish Date - Jul 07 , 2025 | 12:36 AM
నగరం డ్రగ్స్ వినియోగం, సరఫరాకు కేంద్రంగా మారుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి విమానాలు, కొరియర్ సర్వీసుల ద్వారా దిగుమతి చేసుకుని విక్రయించే వారి సంఖ్య పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.
తరచూ వర్సిటీ పరిసరాల్లోనే పట్టుబడుతున్న కొకైన్
నగరంలో పెరుగుతున్న వినియోగం
గంజాయితో పాటు కొకైన్, హెరాయిన్
ఢిల్లీ, బెంగళూరు నుంచి విమానం, కొరియర్ ద్వారా దిగుమతి
నిబంధనలకు విరుద్ధంగా మత్తుకలిగించే మందుల విక్రయిస్తున్న మెడికల్ షాపుల నిర్వాహకులు
తాజా ఘటనలతో నగరవాసుల్లో ఆందోళన
(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)
నగరం డ్రగ్స్ వినియోగం, సరఫరాకు కేంద్రంగా మారుతోంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి విమానాలు, కొరియర్ సర్వీసుల ద్వారా దిగుమతి చేసుకుని విక్రయించే వారి సంఖ్య పెరుగుతుండడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. ఈ వ్యవహారాల్లో కొన్ని మాత్రమే వెలుగుచూస్తుండగా, గుట్టు చప్పుడు కాకుండా సాగుతున్నవి ఎన్నో. ఇక ఏజెన్సీ నుంచి గంజాయి విచ్చలవిడిగా సరఫరా అవుతుండడంతో మైనర్లు కూడా మత్తుకు బానిసలై నేరాలకు పాల్పడుతున్నారు.
‘ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో 25 గ్రాములు కొకైన్‌తో నగరానికి చెందిన యువకుడితోపాటు దక్షిణాఫ్రికా వాసిని ఈనెల 5న త్రీటౌన్ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఢిల్లీ నుంచి విమానంలో కొకైన్‌ను తీసుకువచ్చినట్టు తేలింది.’
‘గోపాలపట్నం సమీపంలోని మందులదుకాణంలో టాస్క్‌ఫోర్స్, ఔషధ నియంత్రణ మండలి అధికారులు ఈనెల ఐదున దాడిచేశారు. వైద్యుడి ప్రిస్కిప్షన్ లేకుండా మత్తుకలిగించే మందులను విక్రయిస్తున్నట్టు తేలడంతో దుకాణం సీజ్‌చేసి నిర్వాహకులపై కేసు నమోదుచేశారు.’
‘ఇటీవల హైదరాబాద్ నుంచి ఓ యువతి ట్రావెల్స్ బస్సులో ఎండీఎంఏ పౌడర్, ట్యాబ్‌లెట్లను నగరానికి తీసుకువస్తుండగా టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో మర్రిపాలేనికి చెందిన యువకుడు హైదరాబాద్ నుంచి తరచూ దిగుమతి చేసుకుంటున్నట్టు తేలింది.’
అత్యంత ఖరీదైన కొకైన్, హెరాయిన్,ఎండీఎంఏ పౌడర్, బోల్ట్స్ వంటి సింథటిక్ డ్రగ్స్‌తో పాటు మత్తు మందులను యువత ఏస్థాయిలో వినియోగిస్తున్నారనేదానికి పైన పేర్కొన్న ఉదాహరణలు అద్దంపడుతున్నాయి. తరచూ ఎక్కడో ఒకచోట గంజాయి, డ్రగ్స్ పోలీసులకు పట్టుబడుతుండడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రంలో అతిపెద్ద నగరమైన విశాఖ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వసంస్థలతోపాటు ఐటీ కంపెనీలు, జాతీయస్థాయి విద్యాసంస్థలు ఉండడంతో దేశ, విదేశాల యువత చేరుతున్నారు. ఇండియన్‌నేవీ, కోస్ట్‌గార్డ్, వైజాగ్‌పోర్టు, గంగవరం పోర్టు, హెచ్‌పీసీఎల్ వంటి సంస్థల్లో ఉద్యోగాలకు వివిధ ప్రాంతాల వారు వచ్చి నివసిస్తున్నారు. దీంతో కాస్మోపాలిటన్ సంస్కృతి పెరుగుతోంది. ఈ క్రమంలోనే యువత కొకైన్, హెరాయిన్, ఎండీఎంఏ పౌడర్, ఎండీఎంఏ బోల్ట్స్ (ట్యాబ్‌లెట్) వంటి సింథటిక్ డ్రగ్స్‌కు బానిసలవుతున్నారు. ఇక ఏజెన్సీ నుంచి గంజాయి దిగుమతి అవుతుండడంతో మైనర్లు కూడా బానిసలుగా మారడంతో వారిలో నేర ప్రవృత్తి పెరుగుతోంది. అత్యవసర అనారోగ్యపరిస్థితిలో వైద్యుల సూచన మేరకు వినియోగించాల్సిన మత్తు మందులను దుకాణాల నుంచి కొనుగోలు చేసి, వినియోగిస్తున్న వారి సంఖ్యా పెరుగుతోంది. మెడికల్ షాపుల యజమానులు వైద్యుల ప్రిస్కప్షన్ లేకుండానే విచ్చలవిడిగా విక్రయించేస్తున్నారు.
విమానం, కొరియర్ ద్వారా దిగుమతి
నగరానికి చెందిన యువత ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వెళ్లినపుడు అక్కడ డ్రగ్స్ వినియోగించేవారు, సరఫరా చేసేవారితో పరిచయం పెంచుకుంటున్నారు. వారితో ఒప్పందం కుదుర్చుకుని డ్రగ్స్ కొనుగోలుచేస్తున్నారు. ఆన్‌లైన్‌లో చెల్లింపులు జరిపి, కొరియర్ ద్వారా దిగుమతి చేసుకుంటున్నారు. మరికొందరు ఏజెంట్ల ద్వారా విమానంలో దిగుమతిచేసుకుంటున్నారు. తాజాగా త్రీటౌన్ పోలీసులు ఏయూ ఇంజనీరింగ్ మైదానంలో అనుమానాస్పదంగా ఉన్న కారుని చుట్టుముట్టారు. అందులోని ఇద్దరిని అదుపులోకి తీసుకుని వేర్వేరుగా విచారించగా ఢిల్లీ నుంచి దక్షిణాఫ్రికాకు చెందిన వ్యక్తితో 25 గ్రాముల కొకైన్‌ను విమానంలో రప్పించామని నిందితుడు అక్షయ్ వివరించాడు. పోలీసులకు పట్టుబడిన దక్షిణాఫ్రికా జాతీయుడు తనకేమీ తెలియదని, ఒక వ్యక్తి కొంత డబ్బు ఇస్తానని, విశాఖ వెళ్లి ఒకరికి అందజేయాలనడంతో వచ్చానన్నాడు. అయితే అక్షయ్ పలుమార్లు ఢిల్లీ నుంచి కొకైన్ తెప్పించుకున్నట్టు పోలీసుల విచారణలో తేలడంతో లోతుగా విచారిస్తున్నారు. రామాటాకీస్ వద్దగల కొరియర్ ఏజెన్సీలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు డ్రగ్స్ ప్యాకెట్ గుర్తించి, విచారణ జరిపి యువకుడిని అరెస్ట్‌చేశారు. బెంగళూరు నుంచి వచ్చిన ట్రావెల్స్ బస్సులో కొకైన్‌ను పంపించగా, నగరానికి చెందిన రౌడీషీటర్ రామ్‌కిషోర్ దానిని తీసుకెళుతుండగా ఇంటెలిజెన్స్, త్రీటౌన్ పోలీసులు పట్టుకుని రూ.4.5 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అతడిచ్చిన సమాచారంతో మరో ముగ్గురిని అరెస్ట్‌చేసి వారి వద్ద 24.5 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
ఏయూ కేంద్రంగానే ....
నగరంలో డ్రగ్స్, గంజాయి వినియోగిస్తున్నవారిలో విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే అధికం. వీరంతా ఏయూలోని స్నేహితుల ద్వారా దందాను సాగిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నగరంలో డ్రగ్స్, గంజాయి పట్టుబడిన సందర్భాల్లో తరచూ ఏయూ ప్రస్తావన రావడం దీనికి బలాన్ని చేకూర్చుతోంది. కొన్నాళ్ల కిందట ఏయూలో ఆకస్మికసోదాలు నిర్వహించగా ఓ హాస్టల్‌లో గంజాయి లభ్యమైంది. ఇంజనీరింగ్ మైదానం విశాలంగా ఉండడం, హాస్టళ్ల సముదాయంలో రాత్రివేళ అంధకారం నెలకొనడం గంజాయి, డ్రగ్స్ సేవించేవారికి అడ్డాగా మారిందనే విమర్శలున్నాయి. బీచ్‌రోడ్డుతోపాటు శివారులోని ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల పరిసరాల్లోనూ డ్రగ్స్ వినియోగం పెరిగిందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో నగరవాసులతోపాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
Updated Date - Jul 07 , 2025 | 12:36 AM