డబుల్ డెక్కర్ ట్రయల్ రన్
ABN, Publish Date - Jul 20 , 2025 | 01:29 AM
విశాఖపట్నంలో పర్యాటక శాఖ ప్రారంభించనున్న డబుల్ డెక్కర్ (హాప్ ఆన్ హాప్ ఆఫ్) బస్సులు బీచ్ రోడ్డులో చక్కర్లు కొడుతున్నాయి.
త్వరలో సీఎం చేతుల మీదుగా ప్రారంభం
ఆర్‌కే బీచ్ నుంచి తొట్లకొండ వరకూ...
మొత్తం 11 బస్టాపులు
ఒకే టిక్కెట్‌తో 24 గంటల పాటు ఎన్నిసార్లయినా తిరగొచ్చు
బస్సు ఎక్కడుందో తెలుసుకొనేలా క్యూఆర్ కోడ్
త్వరలో ఓపెన్ టాప్ బస్సు
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
విశాఖపట్నంలో పర్యాటక శాఖ ప్రారంభించనున్న డబుల్ డెక్కర్ (హాప్ ఆన్ హాప్ ఆఫ్) బస్సులు బీచ్ రోడ్డులో చక్కర్లు కొడుతున్నాయి. గమ్యస్థానం చేరడానికి ఎంత సమయం పడుతుందీ, ఏమైనా అడ్డంకులు ఉన్నాయా? అనే విషయాలు తెలుసుకోవడానికి ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు.
విశాఖపట్నం పోర్టు ఇచ్చిన సామాజిక సేవ నిధులతో పర్యాటక శాఖ అధికారులు రెండు బస్సులను కొనుగోలు చేశారు. ఇవి ఎలక్ర్టిక్ వాహనాలు. పర్యావరణ హితంగా ఉంటాయని ఈ-బస్సులు తీసుకున్నారు. వీటికి చార్జింగ్ చేయడానికి అనువైన ప్రాంతం కోసం అన్వేషించి చివరకు సాగర్‌నగర్‌లో ఇస్కాన్ ఆలయం పక్కనే పాయింట్ పెట్టారు. బస్సులను ప్రస్తుతం అక్కడే ఉంచుతున్నారు.
ఎలా నడుపుతారంటే..?
ఈ బస్సులను రామకృష్టా బీచ్ నుంచి తొట్లకొండ ఆర్చి వరకు నడుపుతారు. ఈ మార్గంలో మొత్తం 11 బస్టాపులు ఉంటాయి. ఎక్కడైనా ఎక్కొచ్చు. ఎక్కడైనా దిగొచ్చు. ఒకసారి టికెట్ తీసుకుంటే 24 గంటలు చెల్లుబాటు అవుతుంది. బస్సులో టూరిస్ట్ గైడ్ ఉంటారు. ఏయే ప్రాంతాల్లో ఏమేమి చూడవచ్చునో వివరిస్తారు. ఈ రెండు బస్సులు ఆర్‌కే బీచ్-తొట్లకొండ మధ్య షటిల్ సర్వీసుల్లా నడుస్తాయి. పర్యాటకులు టికెట్ తీసుకొని ఆర్‌కే బీచ్‌లో కురుసుర, టీయూ-142, సీహ్యారియర్ అన్నీ తాపీగా చూసుకోవచ్చు. ఇంతలో బస్సు వస్తుంది. అందులో ఎక్కి రుషికొండ బీచ్‌లో దిగి అక్కడ బోటు షికార్లు చేసుకోవచ్చు. ఆ తరువాత మళ్లీ బస్సు ఎక్కి తొట్లకొండ వెళ్లొచ్చు. అవన్నీ చూశాక రిటర్న్‌లో ఎక్కడ కావాలంటే అక్కడ దిగొచ్చు. ఒకే టిక్కెట్‌తో 24 గంటల పాటు ఎన్ని సార్లయినా ఎక్కి దిగొచ్చు. పర్యాటకులు అన్ని ప్రాంతాలను చూడాలనే ఉద్దేశంతో ఈ వెసులుబాటు కల్పించారు.
బస్సు ఎక్కడుందో తెలిపేందుకు క్యూఆర్ కోడ్
పర్యాటకులు ఒక కేంద్రంలో అక్కడ అన్నీ చూసేసిన తరువాత బస్సు ఎక్కడుందో, ఎంత సేపటిలో వస్తుందో తెలుసుకోవలసి ఉంటుంది. కానీ అన్నిచోట్ల సమాచారం ఉండదు. అందుకని ఇచ్చే టికెట్‌పైనే క్యుఆర్ కోడ్ ఇస్తారు. దానిని స్కాన్ చేస్తే బస్సు ఎక్కడుంది? ఎంతసేపటిలో వచ్చే అవకాశం ఉందనే సమాచారం తెలుస్తుంది. ఈ సౌకర్యం వల్ల బస్సు వచ్చేలోగానే అక్కడి పర్యాటక కేంద్రం సందర్శన పూర్తి చేసుకోవచ్చు.
ఎంత సమయం పడుతోంది?
మార్గమధ్యంలో సమస్యలు ఏమైనా ఉన్నాయా?, చెట్ల కొమ్మలు, విద్యుత్ తీగలు ఎక్కడైనా అడ్డం వస్తున్నాయా? అనే విషయాలు గమనిస్తున్నారు. వాటిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి తగిన చర్యలు తీసుకుంటున్నారు. టిక్కెట్ ధర ఎంత అనేది? ఇంకా ఖరారు చేయలేదు. అందరికీ అందుబాటులో ఉండేలా పెడతారని చెబుతున్నారు. ఈ బస్సుల నిర్వహణకు కొంత వ్యయం అవుతుంది కాబట్టి ఆ మొత్తం రాబట్టుకునేలా చార్జీలు నిర్ణయిస్తారు.
త్వరలో ఓపెన్ టాప్ బస్సు
మాధవి, జిల్లా పర్యాటక శాఖ అధికారిణి.
ఈ రెండు బస్సులకు తోడుగా త్వరలో మరో బస్సు వస్తుంది. అది ఓపెన్ టాప్ బస్సు. అంటే పైన అంతా ఓపెన్‌గా ఉంటుంది. సాయంత్రం వేళ ఈ బస్సులో బీచ్ రోడ్డులో ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుంది. వీటిని వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావడానికి యత్నిస్తున్నాం. రాష్ట్రంలో ఈ తరహా బస్సుల వినియోగం ఇదే మొదటిసారి కాబట్టి సీఎం చంద్రబాబునాయుడు చేతులు మీదుగా ప్రారంభింపజేయాలని పర్యాటక శాఖ ఉన్నతాధికారులు భావిస్తున్నారు.
Updated Date - Jul 20 , 2025 | 01:29 AM