మ్యుటేషన్ ప్రక్రియ జాప్యం చేస్తే ఉపేక్షించం
ABN, Publish Date - Apr 29 , 2025 | 11:27 PM
మ్యుటేషన్ ప్రక్రియను జాప్యం చేస్తే ఉపేక్షించబోనని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ హెచ్చరించారు. భూముల రీ సర్వే మ్యుటేషన్‌పై జిల్లాలోని రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
అధికారులకు కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ హెచ్చరిక
ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక చర్యలపై సూచనలు
పాడేరు, ఏప్రిల్ 29ఆంధ్రజ్యోతి): మ్యుటేషన్ ప్రక్రియను జాప్యం చేస్తే ఉపేక్షించబోనని కలెక్టర్ ఏఎస్ దినేశ్‌కుమార్ హెచ్చరించారు. భూముల రీ సర్వే మ్యుటేషన్‌పై జిల్లాలోని రెవెన్యూ అధికారులతో కలెక్టరేట్ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. భూముల రీ సర్వేలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, రెవెన్యూ కార్యక్రమాలను పక్కాగా అమలు చేయాలన్నారు. వ్యవసాయ భూములకు నీటి వినియోగం చేసే చోట నీటి పన్నులను వసూలు చేయాలని ఆదేశించారు. ఇప్పటికీ 26 వేల మంది ఆదిమజాతి గిరిజనులకు ఆధార్ కార్డులు జారీ చేయాల్సి ఉందని, వాటిని త్వరగా జారీ చేయాలన్నారు. అలాగే 35 వేల జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాల్సి ఉందని, చిరునామా, జనన ధ్రువీకరణ, గుర్తింపు కార్డుతో కూడిన వివాస ఽధ్రువపత్రాలను గ్రామ సచివాలయాల్లో జారీ చేయాలన్నారు.
ప్రభుత్వ భూముల రక్షణకు ప్రత్యేక చర్యలు
ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్ దినేశ్‌కుమార్ ఆదేశించారు. ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై హైకోర్టు సీరియస్‌గా ఉందని, ఆక్రమణలకు గురైన ప్రభుత్వ భూములను సర్వే చేసి నివేదిక సమర్పించాలన్నారు. రెవెన్యూ అధికారులు, ఎంపీడీవోలు, పంచాయతీ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి ఆక్రమణలకు గురైన భూములను గుర్తించాలన్నారు. అలాగే ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు.
జలపాతాల వద్ద హెచ్చరిక బోర్డులు
జిల్లాలోని జలపాతాల వద్ద ప్రమాదాల నివారణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు కలెక్టర్ సూచించారు. మధ్యాహ్నం ఒంటి గంట తరువాత జలపాతాల వద్ద పర్యాటకులను అనుమతించవద్దని స్పష్టం చేశారు. అలాగే గ్రామస్థులతో వీఆర్‌వోలు, మహిళా పోలీసులు చర్చించి జలపాతాల వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే. అభిషేక్‌గౌడ, పాడేరు సబ్ కలెక్టర్ శౌర్యమన్ పటేల్, రంపచోడవరం సబ్ కలెక్టర్ కల్పశ్రీ, అసిస్టెంట్ కలెక్టర్ కనల చిరంజీవి నాగవెంకటసాహిత్, జిల్లా రెవెన్యూ అధికారి కె.పద్మలత, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎంవీఎస్.లోకేశ్వరరావు, సర్వే విభాగం ఏడీ కె.దేవేంద్రుడు, జిల్లాలోని 22 మండలాల తహసీల్దార్లు, సర్వేయర్లు, వీఆర్‌వోలు పాల్గొన్నారు.
పింఛన్ల పంపిణీలో అక్రమార్కులపై క్రిమినల్ కేసులు
సామాజిక పింఛన్ల పంపిణీలో అక్రమాలకు పాల్పడిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అధికారులను కలెక్టర్ ఏఎస్.దినేశ్‌కుమార్ అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్ నుంచి మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. పింఛన్ల పంపిణీలో మిగిలిన సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలన్నారు. అలాగే క్షేత్ర స్థాయిలో పింఛన్లను పక్కాగా పంపిణీ చేయాలని, స్త్రీ నిధి రుణాలు రికవరీ సక్రమంగా జరగాలని, ఉపాధి హామీ పనులకు నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలన్నారు. ప్రతి మండలంలో నాలుగు వేల మందికి ఉపాధి హామీ పనులు కల్పించాలని ఆదేశించారు. మంజూరు చేసిన ఫారంపాండ్స్ పనులు ప్రారంభించి నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలన్నారు. ఎంపీడీవోలు, సీడీపీవోలు అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీ చేయాలని తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలకు మంజూరు చేసిన మరుగుదొడ్లను పూర్తి చేయాలన్నారు. అలాగే సికిల్ సెల్ ఎనీమియా పరీక్షలు నిర్వహించాలని, దోమల మందులు పిచికారీ పనులు నిర్దిష్టమైన గడువులోగా పూర్తి చేయాలన్నారు. దోమల మందు పిచికారీ పనులకు పంచాయతీ అధికారులు, సిబ్బంది సహకారం అందించకపోతే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని జిల్లా పరిషత్ సీఈవోను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డ్వామా పీడీ విద్యాసాగర్, డీఆర్‌డీఏ పీడీ వి.మురళి, ఐసీడీఎస్ పీడీ ఎన్.సూర్యలక్ష్మి, జిల్లాలోని 22 మండలాలకు చెందిన ఎంపీడీవోలు పాల్గొన్నారు.
Updated Date - Apr 29 , 2025 | 11:28 PM