హైడ్రో ప్రాజెక్టులు ఏర్పాటు చేయొద్దు
ABN, Publish Date - Jul 10 , 2025 | 12:17 AM
రైవాడ క్యాచ్‌మెంట్ పరిధి అరకు, అనంతగిరి ఏజెన్సీ ప్రాంతాల్లో హైడ్రో ప్రాజెక్టుల ఏర్పాటుకు అదానీ, నవయుగ కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని పలువురు జడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు.
అనుమతులను వెంటనే రద్దు చేయాలి
గిరిజనులకు మెరుగైన వైద్యం అందించాలి
గిరిజన ప్రాంతాల్లో వేధిస్తున్న టీచర్ల కొరత
రైతులకు సరిపడా విత్తనాలు ఇవ్వడం లేదు
జడ్పీ సమావేశంలో సభ్యుల ఆందోళన
విశాఖపట్నం, జూలై 9 (ఆంధ్రజ్యోతి): రైవాడ క్యాచ్‌మెంట్ పరిధి అరకు, అనంతగిరి ఏజెన్సీ ప్రాంతాల్లో హైడ్రో ప్రాజెక్టుల ఏర్పాటుకు అదానీ, నవయుగ కంపెనీలకు ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని పలువురు జడ్పీటీసీ సభ్యులు డిమాండ్ చేశారు. బుధవారం చైర్‌పర్సన్ జల్లిపల్లి సుభద్ర అధ్యక్షతన జడ్పీ హాలులో జడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభానికి ముందుగా చైర్‌పర్సన్ స్వాగతం పలుకుతుండగానే అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు దీదిరి గంగరాజు లేచి రెండు హైడ్రో ప్రాజెక్టుల ఏర్పాటుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తరువాత అరకు జడ్పీటీసీ సభ్యురాలు శెట్టి రోష్ని, అరకు ఎమ్మెల్యే రేగా మత్స్యలింగం కలిపి ప్లకార్డుతో సభ ముందుకు వచ్చి నిరసన తెలిపారు. వారికి మిగిలిన సభ్యులు మద్దతు పలికారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లా కలెక్టర్లు దినేశ్‌కుమార్, విజయకృష్ణన్‌లకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ రెండు ప్రాజెక్టుల వల్ల అరకు, అనంతగిరి ప్రాంతాల్లో పర్యావరణం దెబ్బతింటుందని, రైవాడ ప్రాజెక్టు కింద 30 వేల ఆయకట్టు, విశాఖ నగరానికి తాగునీటికి ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. గిరిజన ప్రాంతంలో గిరిజనుల హక్కులకు భిన్నంగా గ్రామసభలు నిర్వహించకుండా రెండు హైడ్రో ప్రాజెక్టులను మంజూరు చేశారని, తాజాగా సర్వే కోసం అధికారులు ఎలా వస్తారని ప్రశ్నించగా, అల్లూరి కలెక్టర్ దినేశ్‌కుమార్ బదులిస్తూ బుధవారం అనంతగిరి మండలంలో గ్రామసభ నిర్వహణకు అధికారులు వెళ్లారని, అన్ని విషయాలపై అనుమతులు తీసుకున్న తరువాతే ముందుకు వెళతామని హామీ ఇచ్చారు. త్వరలో అరకు ఎమ్మెల్యే మత్య్సలింగం అధ్యక్షతన సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో వ్యవసాయం, జలవనరులు, వైద్యం, పంచాయతీరాజ్, రోడ్లు భవనాలు, విద్యాశాఖలపై సమీక్ష నిర్వహించారు. తొలుత జడ్పీస్టాండింగ్ కమిటీ సమావేశాలు నిర్వహించడంపై పరవాడ జడ్పీటీసీ సభ్యుడు పైల సన్యాసిరాజు అభ్యంతరం వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీ, సర్వసభ్య సమావేశం ఒకే రోజు ఏర్పాటు వల్ల ఉపయోగం లేదు సరికదా గందరగోళం ఏర్పడుతుందన్నారు. కె.కోటపాడు జడ్పీటీసీ సభ్యురాలు ఈర్లె అనురాధ మాట్లాడుతూ స్టాండింగ్ కమిటీ సమావేశం వేరుగా నిర్వహించాని సూచించగా, చైర్‌పర్సన్ స్పందించి స్టాండింగ్ కమిటీ సమావేశాలను వాయిదా వేస్తూ, మరో తేదీన వాటి నిర్వహణకు ఏర్పాట్లుచేయాలని సీఈవో పి. నారాయణమూర్తిని ఆదేశించారు.
రైతులకు అన్ని రకాల విత్తనాల సరఫరా
వ్యవసాయశాఖపై చర్చ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యవసాయాధికారి నందా మాట్లాడుతూ రైతులకు అన్ని రకాల విత్తనాలు సరఫరా చేస్తున్నామన్నారు. దీనిపై కొయ్యూరు ఎంపీపీ రమేశ్ మాట్లాడుతూ రైతులు వద్దంటున్నా ఆర్‌జీఎల్ రకం వరి విత్తనాలు ఇస్తున్నారని, ఇంకా రైతులకు సరిపడా విత్తనాలు ఇవ్వడం లేదని ఆరోపించారు. వెంటనే కలెక్టర్ దినేశ్‌కుమార్ జోక్యం చేసుకుని అందరికీ విత్తనాలు ఇవ్వాలని ఆదేశించారు. ఆ తరువాత వైద్య ఆరోగ్యశాఖపై పలు అంశాలను చైర్‌పర్సన్ ప్రస్తావిస్తూ పాడేరు ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గిరిజన ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కేజీహెచ్‌లో మెరుగైన సేవలు అందించాలని సూపరింటెండెంట్ డాక్టర్ వాణికి సూచించారు. ఈ దశలో కొయ్యూరు జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు మాట్లాడుతూ గిరిజనులకు కేజీహెచ్‌లో సరైన వైద్యం అందకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారని, దీంతో వేలాది రూపాయలు ఖర్చు అవుతోందని చెప్పగా, విశాఖ కలెక్టర్ ఎంఎన్.హరేంధిరప్రసాద్ బదులిస్తూ వైద్యం అందని వారి వివరాలు ఇస్తే మంచి వైద్యం అందిస్తామని, అక్కడ ఎస్టీ సెల్ పని చేస్తోందన్నారు. కేజీహెచ్‌కు రోజూ వచ్చే ఓపీ రోగులు, ఇన్‌పెషేంట్ కింద వైద్యం చేసుకునేవారి వివరాలను విభాగాల వారీగా సభ్యులకు తెలియజేయాలని కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణికి సూచించారు. అనంతగిరి జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు మాట్లాడుతూ అరకు, అనంతగిరి ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు, ఇతరత్రా అత్యవసర చికిత్స కోసం రోగులను మొదటగా ఎస్.కోటకు తరలిస్తున్నారని, అక్కడ నుంచి విశాఖపట్నానికి బదులు విజయనగరానికి తీసుకువెళుతున్న విషయాన్ని గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి సమావేశంలో ప్రస్తావిస్తూనే ఉన్నానని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అల్లూరి కలెక్టర్ దినేశ్‌కుమార్ స్పందిస్తూ సమస్య పరిష్కరిస్తానని అంటూనే వేదిక నుంచి విజయనగరం జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. తరువాత వైద్య అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇక నుంచి అరకు, అనంతగిరి నుంచి ఎస్.కోటకు వచ్చే రోగులను మెరుగైన చికిత్సకు విశాఖపట్నానికి తరలించాలని ఆదేశించారు. అరకులో గైనికాలజిస్టులు లేరని, దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని జడ్పీటీసీ సభ్యులు రోష్ని తెలిపారు. గిరిజన ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలంటే గైనికాలజిస్టులు, ఇతర నిపుణులు అందుబాటులో ఉండాలన్నారు. విద్యాశాఖపై జరిగిన చర్చ సందర్భంగా అరకు ఎమ్మెల్యే మత్స్యలింగం, జడ్పీటీసీ సభ్యులు రోష్ని మాట్లాడుతూ పాఠశాలలు ప్రారంభించి దాదాపు నెల రోజులైనా ఉపాధ్యాయులు లేరని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ వెంటనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో పలువురు సభ్యులు, మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి, డీసీసీబీ పర్సన్ ఇన్‌చార్జి కోన తాతారావు, ఇతర అఽధికారులు పాల్గొన్నారు.
Updated Date - Jul 10 , 2025 | 12:17 AM