ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మేయర్‌పై అవిశ్వాసం?

ABN, Publish Date - Mar 18 , 2025 | 01:30 AM

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో రాజకీయం వేడెక్కింది.

  • గొలగాని హరివెంకటకుమారి బాధ్యతలు చేపట్టి నేటికి నాలుగేళ్లు

  • అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు చట్టపరంగా అవకాశం

  • ఇప్పటికే సంతకాలు సేకరణ చేపట్టిన కూటమి

  • రెండు, మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్‌కు నోటీసు ఇచ్చే అవకాశం

  • మేయర్‌ మార్పుపై విజయవాడలో సీఎంతో చర్చించిన ఎమ్మెల్యేలు

  • నేడు టీడీపీలో చేరనున్న ముగ్గురు వైసీపీ కార్పొరేటర్లు

  • ప్రతివ్యూహ రచనలో వైసీపీ

  • పార్టీ కార్యాలయంలో సమావేశమైన నేతలు

  • నేడు మాజీ మంత్రి కన్నబాబు ఆధ్వర్యంలో కార్పొరేటర్లతో సమావేశం

  • వేడెక్కిన గ్రేటర్‌ రాజకీయం

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో రాజకీయం వేడెక్కింది. మేయర్‌గా గొలగాని హరివెంకటకుమారి బాధ్యతలు చేపట్టి మంగళవారం నాటికి నాలుగేళ్లు పూర్తికానుండ డంతో అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు చట్టపరంగా అవకాశం ఏర్పడింది. అందుకు కూటమి సిద్ధమవుతోంది. ఈ మేరకు వారంలోగా అవిశ్వాస తీర్మానంపై వారంలోగా కలెక్టర్‌కు నోటీస్‌ ఇచ్చే అవకాశం ఉందని తెలిసింది.

జీవీఎంసీకి నాలుగేళ్ల కిందట జరిగిన ఎన్నికల్లో వైసీపీ 59, టీడీపీ 29, జనసేన 3, సీపీఐ, సీపీఎం, బీజేపీ ఒక్కొక్క వార్డు గెలుచుకున్నాయి. ఇండిపెండెంట్లు నాలుగుచోట్ల విజయం సాధించారు. రాష్ట్రంలో అప్పటికి వైసీపీ అధికారంలో ఉండడం, మెజారిటీ వార్డులను ఆ పార్టీ దక్కించుకోవడంతో ఇండిపెండెంట్‌లుగా గెలిచిన నలుగురు కార్పొరేటర్లు అధికార పార్టీకి మద్దతు పలికారు. టీడీపీకి చెందిన ఒక కార్పొరేటర్‌ వైసీపీలో చేరిపోగా, మరో ఇద్దరు కూడా ఆ జగన్‌ పార్టీకి మద్దతు పలికారు. వైసీపీకి భారీ మెజారిటీ ఉండడంతో మూడు సార్లు స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలను ఏకగ్రీవం చేసుకుంది. అయితే 2024 సాధారణ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి రావడంతో కౌన్సిల్‌లో బలాలు తారుమారయ్యాయి. వైసీపీలో చేరిన నలుగురు ఇండిపెండెంట్‌ల్లో ఇద్దరు టీడీపీ, మరో ఇద్దరు జనసేనలో చేరిపోయారు. అలాగే వైసీపీకి చెందిన దాదాపు 20 మంది కార్పొరేటర్లు టీడీపీ, జనసేనలో చేరిపోయారు. టీడీపీ నుంచి గెలిచినప్పటికీ వైసీపీకి మద్దతు పలికిన ఇద్దరు కార్పొరేటర్లు తిరిగి టీడీపీకి మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం కౌన్సిల్‌లో కూటమి బలం 53కి పెరగ్గా, వైసీపీ బలం 38కి తగ్గిపోయింది. దీంతో గత ఏడాది జూలైలో జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు విజయం సాధించారు. ఆ తర్వాత మేయర్‌ గొలగాని హరివెంకటకుమారిని పదవి నుంచి దింపే ప్రయత్నాలు కూటమి నేతలు మొదలుపెట్టారు. కానీ అవిశ్వాసం పెట్టాలంటే కనీసం నాలుగేళ్లు పదవీకాలం పూర్తవ్వాలనే నిబంధన మునిసిపల్‌ చట్టంలో ఉండడంతో వీలుకాలేదు. ఈనెల 18 నాటికి మేయర్‌ పదవి చేపట్టి నాలుగేళ్లు పూర్తవడంతో కూటమి నేతలు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కూటమి కార్పొరేటర్లతోపాటు ఎక్స్‌ అఫీషియో సభ్యుల హోదాలో నగర పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సంతకాలతో నోటీస్‌ సిద్ధం చేశారు. కలెక్టర్‌కు నోటీసు అందజేసేముందు సీఎం చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ను కలిసి మేయర్‌ మార్పు విషయాన్ని వివరించాలని నిర్ణయించారు. ఈ మేరకు విజయవాడలో సోమవారం సీఎంతో ఎమ్మెల్యేలు చర్చించినట్టు తెలిసింది. వారి ఆదేశం మేరకు టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌ పీలా శ్రీనివాసరావు సోమవారం సాయంత్రం విజయవాడ బయలుదేరి వెళ్లారు. సీఎం, డిప్యూటీ సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన తర్వాత బుధ, గురువారాల్లో మేయర్‌పై అవిశ్వాస తీర్మానానికి సంబంధించి కలెక్టర్‌కు నోటీసు అందజేసే అవకాశం ఉంది.

కూటమి, వైసీపీ నేతల వ్యూహ ప్రతివ్యూహాలు

కొత్త మేయర్‌ ఎన్నికకు కావాల్సిన సంఖ్యాబలం కూటమికి ఉన్నప్పటికీ, వైసీపీకి చెందిన కార్పొరేటర్లను మరింతమందిని చేర్చుకోవాలని టీడీపీ, జనసేన నేతలు వ్యూహరచన చేస్తున్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో వైసీపీకి చెందిన ఇద్దరు కార్పొరేటర్లు, పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని మరొక కార్పొరేటర్‌ మంగళవారం అమరావతిలో సీఎం చంద్రబాబునాయుడు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. తర్వాత మరికొందరు వైసీపీని వీడి టీడీపీ, జనసేనలో చేరిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. మరోవైపు వైసీపీ కూడా కూటమి వ్యూహాలను తిప్పికొట్టే పనిలో పడింది. అవిశ్వాస తీర్మానం కోసం నోటీసు ఇస్తే ఏం చేయాలి?, అవిశ్వాసం తీర్మానానికి అనుకూలంగా తమ పార్టీ సభ్యులు వ్యవహరిస్తే వారిపై ఎలాంటి చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉంది?, కూటమి ఎత్తులు పారకుండా చట్టపరంగా అందుబాటులో ఉన్న అవకాశాలపై చర్చించేందుకు ఆ పార్టీ నేతలు గుడివాడ అమర్‌నాథ్‌, మజ్జి శ్రీనివాసరావు, తైనాల విజయ్‌కుమార్‌తోపాటు మరికొందరు సోమవారం రాత్రి సమావేశమయ్యారు. పార్టీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త కురసాల కన్నబాబు సమక్షంలో పార్టీ కార్పొరేటర్లతో మంగళవారం మరోమారు సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వైసీపీ, కూటమి నేతల వ్యూహప్రతివ్యూహాలతో జీవీఎంసీ రాజకీయాలు వేడెక్కాయి.

Updated Date - Mar 18 , 2025 | 01:30 AM