ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

జడ్పీ చైర్‌పర్సన్‌పై అసంతృప్తి గళం

ABN, Publish Date - Jul 12 , 2025 | 12:49 AM

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్రకు, స్వపక్షానికి చెందిన జడ్పీటీసీ సభ్యులకు మధ్య తలెత్తిన విభేదాలపై శుక్రవారం బీచ్‌రోడ్డులో గల వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ కార్యాలయంలో పంచాయితీ జరిగింది.

  • నిధుల కేటాయింపులో పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని సొంత పార్టీ సభ్యుల ఆరోపణ

  • కార్యాలయానికి వెళ్లినా పట్టించుకోరని మరికొందరి ఫిర్యాదు

  • బుజ్జగించిన నేతలు

  • బొత్స కార్యాలయంలో పంచాయితీ

  • అవిశ్వాసం ప్రవేశపెట్టాలన్న డిమాండ్‌కు ప్రస్తుతానికి నో

  • అందరినీ జగన్‌ వద్దకు తీసుకువెళతానన్న బొత్స

విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి):

జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ జల్లిపల్లి సుభద్రకు, స్వపక్షానికి చెందిన జడ్పీటీసీ సభ్యులకు మధ్య తలెత్తిన విభేదాలపై శుక్రవారం బీచ్‌రోడ్డులో గల వైసీపీ సీనియర్‌ నేత బొత్స సత్యనారాయణ కార్యాలయంలో పంచాయితీ జరిగింది. ఈ సమావేశానికి అరకులోయ, పాడేరు ఎమ్మెల్యేలు రేగా మత్స్యలింగం, కిముడు విశ్వేశ్వరరాజు, మాజీ మంత్రులు బూడి ముత్యాలనాయుడు, గుడివాడ అమర్‌నాథ్‌, మాజీ ఎంపీ జి.మాధవి, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, కన్నబాబురాజు, కంబాల జోగులు, అదీప్‌రాజ్‌, జడ్పీటీసీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ తీరుపై అత్యధిక జడ్పీటీసీ సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. దీనికి సంబంధించి అందిన వివరాలిలా ఉన్నాయి.

సమావేశంలో తొలుత జడ్పీటీసీ సభ్యుల అభిప్రాయాలను నాయకులు తెలుసుకున్నారు. దాదాపు సభ్యులంతా చైర్‌పర్సన్‌ వ్యవహారశైలిని తప్పుబడుతూ మాట్లాడారు. జడ్పీ కార్యాలయానికి వచ్చినా తమను పట్టించుకోవడం లేదని కొందరు ఆరోపించారు. నిధుల కేటాయింపులో పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని మరికొందరు ఫిర్యాదుచేశారు. అయితే అధిష్ఠానం నిర్ణయం మేరకు నడుచుకుంటామని, పార్టీకి ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేయబోమని కొంతమంది చెప్పారు. పార్టీ పెద్దలు జోక్యం చేసుకుంటారేమోనని నాలుగైదు నెలలుగా వేచి చూస్తున్నామని, కానీ ఎవరూ కనీసం పట్టించుకోలేదని మరికొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ దశలో ఎలమంచిలి మాజీ ఎమ్మెల్యే కన్నబాబురాజు జోక్యం చేసుకుని చైర్‌పర్సన్‌కు అనుకూలంగా ఎంతమంది, వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నారో తేలాలంటే చేతులెత్తే పద్ధతిని పాటించవచ్చునని, లేనిపక్షంలో నియోజకవర్గ ఇన్‌చార్జులు సమావేశమై ఒక నిర్ణయానికి రావచ్చునని అన్నారు. దీంతో సభ్యులను బయటకు పంపి నాయకులు చర్చించుకున్నారు. ఆ తరువాత అందరినీ లోపలకు రప్పించారు. అనంతరం బొత్స మాట్లాడుతూ జడ్పీటీసీ సభ్యుల అభిప్రాయాలు తెలుసుకున్నానని, అధినేత జగన్మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళతానని చెప్పారు. అంతవరకూ సంయమనం పాటించాలన్నారు. దీంతో కొందరు సభ్యులు లేచి వారం, పది రోజుల్లో జగన్మోహన్‌రెడ్డి వద్దకు తీసుకువెళ్లాలని అడగ్గా...నెల తరువాత తీసుకువెళతానన్నారు. అయితే జడ్పీ చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టాలన్న సభ్యుల డిమాండ్‌కు నేతలు అంగీకరించలేదు. మరో ఏడాదిలో జడ్పీ కాలపరిమితి ముగుస్తోందని, అప్పటివరకూ అందరూ కలిసి వెళ్లాలని సూచించారు. సభ్యులంతా మాట్లాడినప్పటికీ చైర్‌పర్సన్‌ మాత్రం మౌనంగా ఉన్నారు. జి.మాడుగుల జడ్పీటీసీ సభ్యురాలు డాక్టర్‌ వెంకటలక్ష్మి మాట్లాడుతూ చైర్‌పర్సన్‌ పదవి ఇస్తామన్న హామీతోనే అప్పట్లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చానని గుర్తుచేస్తూ తనకు అన్యాయం జరిగిందన్నారు. ఈ దశలో బొత్స జోక్యం చేసుకుని అధినేతను కలిసి సమస్య విన్నవించుకోవాలన్నారు. ఇదిలావుండగా పార్టీ నేతల వద్ద ఏర్పాటుచేసిన పంచాయితీలో ఏమీ తేలకపోవడంపై పలువురు జడ్పీటీసీ సభ్యులు బయటకు వచ్చి అసంతృప్తి వ్యక్తంచేశారు. చైర్‌పర్సన్‌పై అవిశ్వాసం పెట్టాల్సిందేనని కొందరు అన్నారు.


ఐఫ్‌ఆర్‌, మిలాన్‌ నిర్వహణపై సమీక్ష

విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి):

భారత నౌకాదళం ఆధ్వర్యంలో 2026 ఫిబ్రవరిలో జరగనున్న ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ (ఐఎఫ్‌ఆర్‌), మిలాన్‌, అయాన్స్‌ కాన్‌క్లేవ్‌ ఆఫ్‌ చీఫ్స్‌ వేడుకల ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. తొలుత కమాండర్‌ ఐఎఫ్‌ఆర్‌ ఎబీ మాథ్యూ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఏ శాఖ ఏయే విధులు నిర్వహించాలో వివరించారు. దానికి అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు. అన్ని శాఖలు, విభాగాల అధిపతులు సమన్వయంతో వ్యవహరించాలని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ సూచించారు. ఈ సమావేశంలో నేవీ, విమానాశ్రయం, విశాఖపట్నం పోర్టు, కస్టమ్స్‌, రెవెన్యూ, వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీ, పోలీస్‌, పర్యాటక శాఖ అధికారులు పాల్గొన్నారు. నేవల్‌ ఆఫీస్‌ ఇన్‌చార్జి రజనీశ్‌శర్మ, జాయింట్‌ కలెక్టర్‌ మయూర్‌ అశోక్‌, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, డీసీపీలు అజిత, మేరీ ప్రశాంతి, నేవీ అధికారులు పాల్గొన్నారు.


రైతు సేవా కేంద్రాల్లో అన్నదాత సుఖీభవ జాబితాలు

అర్జీలకు రేపే చివరిరోజు

విశాఖపట్నం, జూలై 11 (ఆంధ్రజ్యోతి):

జిల్లాలోని గ్రామీణ మండలాల పరిధిలోని 57 రైతు సేవా కేంద్రాల వద్ద అన్నదాత సుఖీభవ అర్హుల జాబితాలు ప్రదర్శించినట్టు వ్యవసాయాధికారి అప్పలస్వామి తెలిపారు. అన్నదాత సుఖీభవకు జిల్లాలో మొత్తం 17,776 మంది అర్హులుగా గుర్తించామన్నారు. పద్మనాభం మండలంలో 6,417 మంది, ఆనందపురం మండలంలో 4,717, భీమిలి మండలంలో 3,286, పెందుర్తి మండలంలో 2,839, పెదగంట్యాడలో 256, గాజువాక మండలంలో 206 మందిని అర్హులుగా గుర్తించామన్నారు. వీరంతా తమ పరిధిలో రైతు సేవా కేంద్రాలకు వెళ్లి జాబితాలో తమ పేర్లు ఉన్నాయా? లేదో...పరిశీలించుకోవాలన్నారు. ఒకవేళ పేర్లు లేకపోతే రైతు సేవా కేంద్రంలోని గ్రామ వ్యవసాయ సహాయకుడిని కలిసి ఈనెల 13వ తేదీలోగా అర్జి పెట్టుకోవాలన్నారు. గ్రామ వ్యవసాయ సహాయకుడు ఆన్‌లైన్‌లో పరిశీలించి జాబితాలో పేరు లేకపోతే కారణాలు తెలుసుకుని వెంటనే సవరణ చేసి తహశీల్దారుకు పంపుతారన్నారు. ఇంకా మనమిత్రకు వాట్సాప్‌ ద్వారా 9552300009కు లేదా కాల్‌సెంటర్‌ నంబరు 155251కు కాల్‌ చేయాలని సూచించారు.

Updated Date - Jul 12 , 2025 | 12:49 AM