కాంట్రాక్టు కార్మికుల తొలగింపు చట్ట విరుద్ధం
ABN, Publish Date - Jun 10 , 2025 | 01:44 AM
స్టీల్‌ప్లాంటులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగించడం చట్ట విరుద్ధమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్‌లు అన్నారు.
కూర్మన్నపాలెంలో దీక్షా శిబిరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవడం దారుణం
ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్
కూర్మన్నపాలెం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి):
స్టీల్‌ప్లాంటులో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులను తొలగించడం చట్ట విరుద్ధమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి.ఆదినారాయణ, జె.అయోధ్యరామ్‌లు అన్నారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను నిరసిస్తూ, ప్లాంటుకు సొంత గనులు కేటాయించాలంటూ కూర్మన్నపాలెంలో 1,579 రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షల శిబిరాన్ని సోమవారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయినప్పటికీ కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు శిబిరం బయట మండుటెండలో నేలపై కూర్చునే ఆందోళనను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శాంతియుతంగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలను పోలీసులతో అణచివేయాలని చూడడం దారుణమన్నారు. నలభై ఏళ్లుగా తాము ఎన్నో పోరాటాలు చేశామని, ఏనాడూ దీక్షల శిబిరాన్ని పోలీసులు స్వాధీనం చేసుకోవటం చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్టు కార్మికుల తొలగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయడంతో పాటు ఇప్పటికే తొలగించిన వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని, నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని, స్టీల్‌ప్లాంటును సెయిల్‌లో విలీనం చేయాలని వారు డిమాండ్ చేశారు.
78వ వార్డు కార్పొరేటర్ బి.గంగారామ్ మాట్లాడుతూ స్టీలుప్లాంటును విక్రయించాలన్న నిర్ణయాన్ని కేంద్రం విరమించుకోలేదని, కార్మికులను తగ్గించి ప్రైవేటు వాళ్లకు అప్పగించేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలకు పాలకులు కొమ్ముకాయడం సమంజసం కాదన్నారు. ప్లాంటుకు సొంత గనులు కేటాయించి, సెయిల్‌లో విలీనం చేస్తేనే సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. సీఐటీయూ ప్లాంట్ కార్యదర్శి రామస్వామి, ఇంటక్ నాయకుడు నీరుకొండ రామచంద్రరావులు మాట్లాడుతూ కార్మికులకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వాలకు పతనం తప్పదన్నారు. ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు రమణమూర్తి, సీపీఎం నాయకుడు కేఎం శ్రీనివాస్‌లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలో ఇంత దారుణంగా కార్మికులను తొలగించడం మునుపెన్నడూ చూడలేదన్నారు. పోరాటాలను, నాయకులను అణచివేయాలని చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. కాంట్రాక్టు లేబర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి నమ్మి రమణ మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే స్టీల్‌ప్లాంటును కాపాడతామన్న పాలకులు ఇప్పుడు కాంట్రాక్టు కార్మికులను తొలగిస్తుంటే చోద్చం చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు. కార్యక్రమంలో నాయకులు వైటీ దాస్, శ్రీనివాసరాజు, టీవీకే రాజు, మసేను, కనకరాజు, వీవీ రమణ, సోమేశ్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jun 10 , 2025 | 01:44 AM