స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మహా నిరాశ
ABN, Publish Date - Jul 18 , 2025 | 01:17 AM
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2024 పోటీలో జీవీఎంసీ చతికిలపడింది.
పది లక్షలు జనాభా పైబడిన నగరాల కేటగిరీలో తొమ్మిదో ర్యాంకు
గత రెండేళ్లు నాలుగో ర్యాంకు
డోర్ టు డోర్ చెత్తసేకరణలో వెనుకబాటు
ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ సరిగా లేకపోవడంతో తగ్గిన మార్కులు
గార్బేజ్ ఫ్రీ సిటీ (జీఎఫ్‌సీ)లో ఫైవ్ స్టార్ సర్టిఫికెట్‌కు పరిమితం
విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి):
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2024 పోటీలో జీవీఎంసీ చతికిలపడింది. పది లక్షలకు పైబడిన జనాభా కలిగిన నగరాల కేటగిరీలో గడచిన రెండేళ్లు నాలుగో ర్యాంకును దక్కించుకున్న జీవీఎంసీ గురువారం వెల్లడైన ఫలితాల్లో తొమ్మిదో ర్యాంకుకు దిగజారిపోయింది. ఆరు నెలలపాటు జీవీఎంసీకి పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని అధికారులు చెబుతున్నా, క్షేత్రస్థాయిలో పారిశుధ్య నిర్వహణ, డంపింగ్ యార్డుల్లో చెత్త రీసైక్లింగ్, ప్రజా మరుగుదొడ్ల నిర్వహణ విషయాల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోవడమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేశంలోని నగరాలు, పట్టణాల్లో పరిశుభ్రతను పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం 2016 నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో పోటీ నిర్వహిస్తోంది. పోటీలో పాల్గొనే నగరాలు, పట్టణాల్లో పారిశుధ్యం మెరుగుపరచడం, పరిశుభ్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం, చెత్తను రోడ్లపై పడేయకుండా ఇంటి వద్దకు వచ్చే వాహనాలకు అందజేయడం, తడి-పొడి చెత్తను ఇంటి వద్దనే వేరుచేసి వాహనాలకు అందజేయడం, యార్డులకు చేరిన చెత్తను తిరిగి వినియోగించుకునేందుకు వీలుగా వివిధ రకాల వనరులను అందుబాటులోకి తెచ్చి సంపదగా మార్చడం వంటి వాటికి కేంద్ర ప్రభుత్వమే నిధులను మంజూరుచేసి స్థానిక సంస్థల ద్వారా పనులు చేయిస్తుంది. ఏడాది చివరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక బృందాలు వచ్చి నగరాల్లో పరిశుభ్రత, స్థానిక సంస్థల పనితీరు, ప్రజల భాగస్వామ్యం, పరిశుభ్రత గురించి ప్రజల్లో ఉన్న అవగాహన, ఇంటివద్దనే చెత్త విభజన, డోర్ టు డోర్ చెత్తసేకరణ, యార్డుల్లో చెత్త నిర్వహణ వంటి అంశాలను నేరుగా పరిశీలిస్తాయి. ఉత్తమ ఫలితాలు సాధించిన నగరాలకు అవార్డులు అందజేస్తుంది. 2016లో దేశవ్యాప్తంగా 73 నగరాలు స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో పాల్గొంటే జీవీఎంసీ ఐదో ర్యాంకు దక్కించుకుంది. 2017లో 434 నగరాలు పాల్గొంటే మూడో ర్యాంకు దక్కించుకుంది. 2018లో 4,203 నగరాలు పోటీ పడితే పది లక్షల పైబడి జనాభా కలిగిన నగరాల కేటగిరీలో జీవీఎంసీ ఏడో ర్యాంక్ దక్కించుకుంది. 2019లో 4,237 నగరాలు పోటీపడితే 23, 2020లో 4,242 నగరాలు పోటీపడగా 9, 2021లో 4,320 నగరాలు పోటీపడితే 9, 2022లో 4,354 నగరాలు పోటీపడితే 4, 2023లో 4,416 నగరాలు పోటీపడితే నాలుగో ర్యాంకు దక్కింది. అయితే 2024లో 4,589 నగరాలు పోటీపడగా జీవీఎంసీ తొమ్మిదో ర్యాంకుకు దిగజారిపోయింది.
జీవీఎంసీకి ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకూ పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడం వల్లనే స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీవీఎంసీ వెనుకబడిందని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు అధికారులు మాత్రం స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే బృందాలు ఈ ఏడాది ఫిబ్రవరిలోనే నగరంలో పర్యటించాయని, దానికి, పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడానికి సంబంధం లేదని పేర్కొంటున్నారు. అధికారుల్లో ఉదాసీతన పెరిగిపోవడం, క్షేత్రస్థాయిలో కొందరు సిబ్బంది విధి నిర్వహణలో అలసత్వం వహించడంతో నగరంలో పారిశుధ్యం క్షీణించిందని, అదే ర్యాంకు దిగజారడానికి కారణమని పేర్కొంటున్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో దిగజారడానికి అనేక కారణాలు
స్వచ్ఛ సర్వేక్షణ్-2024లో మొత్తం 12,500 మార్కులకు పోటీ నిర్వహించారు. వీటిలో డోర్ టూ డోర్ చెత్త సేకరణ, విభజన, చెత్తను సంపదగా మార్చడం, పునర్వినియోగానికి వీలుగా చెత్తను మార్చే వనరులను అందుబాటులోకి తేవడం, క్షేత్రస్థాయిలో మార్కెట్లు, రోడ్లు, జనావాసాలు, ప్రజా మరుగుదొడ్లు, గెడ్డలను శుభ్రంగా ఉంచడానికి సంబంధించి పది వేల మార్కులు కేటాయించగా, యార్డులో చెత్త నిల్వలు లేకుండా చేయడం, బహిరంగ మలవిసర్జన నిర్మూలించడం, మురుగునీటిని శుద్ధి చేసి పునర్వినియోగానికి వాడడం వంటి విభాగాల్లో సాధించిన సర్టిఫికెట్‌లకు 2,500 మార్కులు కేటాయించారు. అయితే జీవీఎంసీకి చెందిన కాపులుప్పాడలోని డంపింగ్ యార్డులో చెత్తకుప్పలను బయో మైనింగ్ ద్వారా పునర్వినియోగానికి వీలుగా తయారుచేయడం, అక్కడ భూమిని ఖాళీ చేసి పచ్చదనం పెంపు దిశగా పనులు జరుగుతున్నాయి. 2025 జనవరి నాటికి యార్డులో చెత్తలేకుండా చేయాల్సి ఉండగా, ఇంకా 20 శాతానికిపైగా అలాగే ఉండిపోవడంతో గార్బేజ్ ఫ్రీసిటీ (జీఎఫ్‌సీ)లో ఫైవ్ స్టార్ ర్యాంకు సర్టిఫికెట్ మాత్రమే కేంద్రం జారీచేసింది. సూపర్ స్వచ్ఛ లీగ్‌లో స్థానం దక్కించుకున్న విజయవాడ, గుంటూరు, తిరుపతి నగరాలతోపాటు స్వచ్ఛ సర్వేక్షణ్‌లో జీవీఎంసీ కంటే మెరుగైన ర్యాంకులు సాధించిన నగరాలన్నీ జీఎఫ్‌సీలో సెవెన్ స్టార్ ర్యాంకులను దక్కించుకున్నాయి. దీనివల్ల జీవీఎంసీ 2,500 మార్కులకు గాను కేవలం 2,300 మార్కులు మాత్రమే దక్కించుకుంది. అలాగే డోర్ టూ డోర్ చెత్తసేకరణ నగరంలో 96 శాతం మాత్రమే జరుగుతుండడం, తడి పొడి చెత్తవిభజన 81 శాతం మాత్రమే జరగడం, జోన్ స్థాయిలో ఉన్న డంపింగ్ యార్డులో చెత్తను ఏరోజుకారోజు యార్డుకు తరలించే ప్రక్రియ 98 శాతం మాత్రమే జరగడం, ప్రజా మరుగుదొడ్ల పరిశుభ్రతలో 97 శాతానికే పరిమితం కావడం వంటి కారణాల వల్ల పది వేల మార్కులకు 9,336 మార్కులే వచ్చాయి. దీంతో మొత్తం 12,500 మార్కులకు 11,636 మార్కులను దాటలేకపోయింది. దీనివల్ల పదిలక్షల జనాభా కలిగిన నగరాల కేటగిరిలో జీవీఎంసీ తొమ్మిదో ర్యాంకుకు దిగజారిపోవాల్సి వచ్చింది.
‘సఫాయిమిత్ర సురక్షిత్’ కేటగిరీలో జీవీఎంసీ టాప్
స్వచ్ఛ సర్వేక్షణ్-2024 ర్యాంకులు విడుదల
ఢిల్లీలో కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి చేతుల మీదుగా అవార్డు అందుకున్న మేయర్, కమిషనర్
ఓవరాల్‌గా జాతీయ స్థాయిలో తొమ్మిదో ర్యాంకు
విశాఖపట్నం, జూలై 17 (ఆంధ్రజ్యోతి):
స్వచ్ఛ సర్వేక్షణ్-2024లో గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సఫాయిమిత్ర సురక్షిత్ పెహర్ కేటగిరీలో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు దక్కించుకుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో గురువారం జరిగిన జరిగిన కార్యక్రమంలో కేంద్ర గృహ, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి మనోహర్‌లాల్ మీదుగా జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు, ఏపీ పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్, కమిషనర్ కేతన్ గార్గ్ అవార్డును అందుకున్నారు. జీవీఎంసీలో డ్రైనేజీల్లో పూడికతీత, యూజీడీ బ్లాక్ అయినప్పుడు పనులను మనుషులతో (సఫాయి కార్మికులు) కాకుండా యంత్రాలతో చేయిస్తున్నారు. జెట్టింగ్ యంత్రాలు, రోబోలు వంటి వాటితో ప్రస్తుతం పూడిక తీస్తున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం జీవీఎంసీకి సఫాయిమిత్ర సురక్షిత్ పెహర్ కేటగిరీలో మొదటి ర్యాంకు లభించింది. ఈ సందర్భంగా మేయర్ పీలా శ్రీనివాసరావు మాట్లాడుతూ నగర ప్రజల సహకారం, జీవీఎంసీ పారిశుధ్య కార్మికులు, అధికారులతోపాటు కార్పొరేటర్ల కృషి కారణంగానే జీవీఎంసీకి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించిందన్నారు. ఇదే స్ఫూర్తితో వచ్చే ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీలో మరింత ఉత్తమ ప్రతిభ కనబరిచేందుకు కృషిచేస్తామని ఆశాభావం వ్యక్తంచేశారు. కమిషనర్ కేతన్ గార్గ్ మాట్లాడుతూ వచ్చే ఏడాది స్వచ్ఛ సర్వేక్షణ్ పోటీ కోసం ఇప్పటి నుంచే కార్యాచరణ రూపొందించుకుని అధికారులు, ప్రజలను భాగస్వాములను చేస్తూ ముందుకువెళతామన్నారు. ఇదిలావుండగా స్వచ్ఛ సర్వేక్షణ్-2025 పోటీలో అవార్డు అందుకున్న వారిలో జవీఎంసీ ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఈఎన్‌వీ నరేష్‌కుమార్, చీఫ్ ఇంజనీర్ పల్లంరాజు ఉన్నారు.
స్వచ్ఛ సర్వేక్షణ్‌లో 2016 నుంచి జీవీఎంసీ సాధించిన ర్యాంకులు
సంవత్సరం పోటీలో పాల్గొన్న నగరాలు జీవీఎంసీ ర్యాంక్
2016 73 5
2017 434 3
2018 4,203 7
2019 4,237 23
2020 4,242 9
2021 4,320 9
2022 4,354 4
2023 4,416 4
2024 4,589 9
---------------------------------------------------
Updated Date - Jul 18 , 2025 | 01:17 AM