ఏకోపాధ్యాయులకు నిరాశ
ABN, Publish Date - Jun 19 , 2025 | 01:12 AM
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో బదిలీ అయిన ఏకోపాధ్యాయులకు విచిత్రమైన సమస్య ఎదురైంది. జిల్లాలో కేటగిరీ-3,4 పాఠశాలల్లో (మారుమూల ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లు) ఏకోపాధ్యాయులుగా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన వారు రిలీవ్ కాలేని పరిస్థితి నెలకొంది. తాజా బదిలీల్లో ఏకోపాధ్యాయులు పనిచేసే పాఠశాలలకు మిగిలిన టీచర్లు ఆప్షన్స్ ఇవ్వకపోవడంతో ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టిన తరువాత ఏకోపాధ్యాయ పాఠశాలలకు టీచర్లను పంపుతామని, అప్పటివరకూ బదిలీ అయిన ఉపాధ్యాయులు అదే పాఠశాలల్లో పనిచేయాలని విద్యా శాఖ స్పష్టంచేసింది.
బదిలీ అయినా రిలీవ్ కాలేని పరిస్థితి
ఆయా పాఠశాలలకు ఎవరినీ నియమించకపోవడమే కారణం
డీఎస్సీ నియామకాలు పూర్తయ్యేంత వరకూ ఆగాలని విద్యా శాఖ అధికారుల ఆదేశం
ఉమ్మడి జిల్లాలో 250 నుంచి
300 మందిపై ప్రభావం
అన్ని కేడర్లు కలిపి 4,903 మంది బదిలీ
153 మంది టీచర్లకు పదోన్నతి
విశాఖపట్నం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి):
ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో బదిలీ అయిన ఏకోపాధ్యాయులకు విచిత్రమైన సమస్య ఎదురైంది. జిల్లాలో కేటగిరీ-3,4 పాఠశాలల్లో (మారుమూల ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లు) ఏకోపాధ్యాయులుగా పనిచేస్తూ ఇటీవల బదిలీ అయిన వారు రిలీవ్ కాలేని పరిస్థితి నెలకొంది. తాజా బదిలీల్లో ఏకోపాధ్యాయులు పనిచేసే పాఠశాలలకు మిగిలిన టీచర్లు ఆప్షన్స్ ఇవ్వకపోవడంతో ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం నిర్వహిస్తున్న డీఎస్సీ ద్వారా నియామకాలు చేపట్టిన తరువాత ఏకోపాధ్యాయ పాఠశాలలకు టీచర్లను పంపుతామని, అప్పటివరకూ బదిలీ అయిన ఉపాధ్యాయులు అదే పాఠశాలల్లో పనిచేయాలని విద్యా శాఖ స్పష్టంచేసింది.
ఉమ్మడి జిల్లాలో అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మారుమూల ప్రాంతాలు అంటే ప్రఽధాన రోడ్లకు 20 నుంచి 40 కి.మీ. దూరంలో ఉన్న పాఠశాలలను కేటగిరీ 3, 4గా పరిగణిస్తారు. ఉమ్మడి జిల్లాలో 250 నుంచి 300 వరకూ ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. బదిలీల సమయంలో అక్కడ పనిచేసే టీచర్లకు ఎక్కువగా ప్రాధాన్యం ఉంటుంది. దీంతో మైదానం, నగరం, ప్రధాన కూడళ్లకు సమీపంలోని పాఠశాలలకు వచ్చేశారు. అదే సమయంలో నగరం, మైదానంలో టీచర్లు మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంది. అయితే ఎస్జీటీల కొరత ఉండడంతో బదిలీలు తప్పనిసరి అయిన వారిలో చాలామంది నగరం నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని స్కూళ్లకు వెళ్లారు. మారుమూల ప్రాంతాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలకు వెళ్లడానికి ఎవరూ ఇష్టపడలేదు. దీంతో బదిలీ అయిన ఉపాధ్యాయుల నుంచి బాధ్యతలు తీసుకునేవారు లేకపోవడంతో సమస్య ఉత్పన్నమైంది. ఈ విషయమై పలువురు టీచర్ల నుంచి విద్యా శాఖపై ఒత్తిడి రావడంతో సమస్యను ఉన్నతాధికారులకు నివేదించారు. బదిలీ అయిన ఏకోపాధ్యాయులంతా కొత్తగా పోస్టింగ్ వచ్చిన పాఠశాలల్లో రిపోర్టు చేసి, తిరిగి ఏకోపాధ్యాయ పాఠశాలకు వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. త్వరలో డీఎస్సీ నియామకాలు చేపడతామని, కొత్తగా రానున్న టీచర్లను ఏకోపాధ్యాయ పాఠశాల్లో నియమిస్తామని చెప్పారు. ఈ విషయాన్ని విశాఖ డీఈవో ఎన్.ప్రేమ్‌కుమార్ తెలిపారు. అప్పటివరకూ ప్రస్తుతం ఎక్కడ పనిచేస్తున్నారో అక్కడే పనిచేయాల్సిందిగా చెప్పడంతో ఏకోపాధ్యాయులంతా నిరాశ చెందారు. ప్రస్తుతం డీఎస్సీ రాత పరీక్షలు నెలాఖరు వరకు జరుగుతాయి. తరువాత ఫలితాలు విడుదల చేసి నియామక షెడ్యూల్ ఖరారుకు కనీసం రెండు, మూడు నెలలు పడుతుందని ఉపాధ్యాయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
4,903 మంది టీచర్లకు బదిలీలు
ఉమ్మడి జిల్లాలో వివిధ కేటగిరీలలో 4,903 మంది టీచర్లకు బదిలీలు అయ్యాయి. ప్రధానో పాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు, లాంగ్వేజ్ పండిట్ల బదిలీలు ఆన్‌లైన్‌లో చేపట్టారు. సెకండరీగ్రేడ్ టీచర్లు, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లకు మాత్రం మాన్యువల్‌గా బదిలీలు నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలో గ్రేడ్-2 హెచ్‌ఎంలు 89 మంది, మోడల్ ప్రాథమిక పాఠశాలల హెచ్‌ఎంలు 177, స్కూల్ అసిస్టెంట్ తత్సమాన హోదా టీచర్లు 2,305 మంది, ఎస్జీటీలు 2,229 మంది, లాంగ్వేజ్ పండిట్లు 78 మంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు 10 మంది, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు 15 మందికి బదిలీ అయింది.
153 మంది టీచర్లకు పదోన్నతి
ఉమ్మడి జిల్లాలో వివిధ కేటగిరీలలో 153 మంది టీచర్లకు పదోన్నతి కల్పించారు. గ్రేడ్-2 హెచ్‌ఎంలుగా 72 మంది, మోడల్ ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులుగా 36 మంది, స్కూలు అసిస్టెంట్ కేటగిరీలో ఇంగ్లీష్‌లో ఒకటి, హిందీ, తెలుగులో రెండేసి, బయాలజీలో 16, గణితంలో మూడు, సోషల్ స్టడీస్‌లో 9, ఫిజికల్ ఎడ్యుకేషన్‌లో 12 మందికి పదోన్నతి వచ్చింది.
Updated Date - Jun 19 , 2025 | 01:12 AM