ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పోర్టుల్లో డిజిటల్‌ ఆపరేషన్లు

ABN, Publish Date - Jul 15 , 2025 | 01:12 AM

జల రవాణాను అత్యంత తక్కువ ధరకు అందించడమే లక్ష్యంగా బిమ్స్‌ టెక్‌ సదస్సును ఏర్పాటు చేశామని కేంద్ర పోర్టులు, జల రవాణా శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్‌ చెప్పారు.

  • రవాణా వ్యయం తగ్గించడమే లక్ష్యం

  • భవిష్యత్తులో భారీగా క్రూయిజ్‌ టూరిజం

  • కేంద్ర పోర్టులు, జలరవాణా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌

  • విశాఖ పోర్టులో రూ.320 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి):

జల రవాణాను అత్యంత తక్కువ ధరకు అందించడమే లక్ష్యంగా బిమ్స్‌ టెక్‌ సదస్సును ఏర్పాటు చేశామని కేంద్ర పోర్టులు, జల రవాణా శాఖా మంత్రి శర్బానంద సోనోవాల్‌ చెప్పారు. సోమవారం ఉదయం నగరంలోని నోవాటెల్‌ హోటల్‌లో ప్రారంభమైన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన...సాయంత్రం పోర్టులో రూ.320 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పోర్టులన్నీ డిజిటల్‌ ఆపరేషన్ల మోడ్‌లోకి మారుతున్నాయన్నారు. సరకు రవాణాదారులకు నిబంధనల సరళీకరణ, కస్టమ్స్‌ ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నామన్నారు. సముద్ర తీర ప్రాంతం కలిగిన దేశాలన్నీ పోర్టు ఆధారిత అభివృద్ధిని కోరుకుంటున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్‌ గొప్ప సహకారం అందిస్తున్నదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీర ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తున్నారని ప్రశంసించారు. జల రవాణాలో అనేక సవాళ్లు ఉన్నాయని, విశాఖలో నిర్వహిస్తున్న సదస్సులో వాటిపై చర్చ జరుగుతుందన్నారు. వివిధ దేశాల నుంచి 26 మంది ప్రతినిధులు హాజరయ్యారని, మారిటైమ్‌ వ్యాపారంపై విస్తృత చర్చలు జరుగుతాయన్నారు. భవిష్యత్తులో క్రూయిజ్‌ పర్యాటకం విశేష ప్రాచుర్యం పొందుతుందన్నారు. పోర్టులు, జల రవాణా శాఖ సెక్రటరీ రామచంద్రన్‌ మాట్లాడుతూ, పోర్టులు, హార్బర్ల మధ్య కనెక్టివిటీ పెంచడానికి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తున్నామని చెప్పారు. పోర్టులు సరకు రవాణా సామర్థ్యం పెంచుకోవలసి ఉందన్నారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, గ్రీన్‌ టెక్నాలజీ వంటివి ఉపయోగించుకుంటూ పోర్టులను ఆటోమేషన్‌ దిశగా నడిపించాల్సి ఉందన్నారు.

ప్రతి నెల క్రూయిజ్‌ షిప్‌

విశాఖపట్నం నుంచి ప్రతి నెల క్రూయిజ్‌ షిప్‌ నడిచేలా చర్యలు చేపడుతున్నామని విశాఖపట్నం ఎంపీ ఎం.శ్రీభరత్‌ తెలిపారు. బంగాళాఖాతం మిగిలిన సముద్రల్లా నిలకడగా ఉండదని, కొంత అలజడిగా ఉంటుందని, కార్గో నౌకలు నడిపినట్టు పర్యాటక నౌకలను నడపలేరని వివరించారు. ఏదేమైనా విశాఖపట్నం క్రూయిజ్‌ టెర్మినల్‌ నుంచి మొదలై ఇతర ప్రాంతాలకు వెళ్లేలా విహార నౌకలను తీసుకువస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పోర్టులు, జల రవాణా శాఖ సహాయ మంత్రి శాంతన్‌ ఠాకూర్‌, పోర్టు ఛైర్మన్‌ అంగముత్తు తదితరులు పాల్గొన్నారు.

పోర్టులో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులు

- పోర్టు ఏరియాలో రూ.33.49 కోట్లతో బి-ర్యాంప్‌ నిర్మాణం

- ఫిషింగ్‌ హార్బర్‌లో రూ.32.61 కోట్లతో ఫింగర్‌ జెట్టీ, విఫ్‌ నిర్మాణం

- ఓఎస్‌టీటీ వద్ద రూ.20.87 కోట్లతో రెండు అదనపు బ్రీస్టింగ్‌ డాల్ఫిన్ల నిర్మాణం

- క్రూయిజ్‌ టెర్మినల్‌ వద్ద రూ.15.9 కోట్లతో ప్రజా ప్రొమెనేడ్‌ అభివృద్ధి

- అంబేడ్కర్‌ శతాబ్ది ఫ్లైఓవర్‌ నుంచి రూ.8.31 కోట్లతో అదనపు ర్యాంప్‌

- పోర్టు ఏరియాలో రూ.5.5 కోట్లతో 15 శౌచాలయాల నిర్మాణం

ప్రారంభించిన ప్రాజెక్టులు

- నూతన ఆయిల్‌ రిఫైనరీ బెర్త్‌-2 - రూ.42 కోట్లు

- ఓఎస్‌టీటీ వద్ద ఫైర్‌ ఫైటింగ్‌ సదుపాయాలు రూ.27 కోట్లు

- ఆర్‌-10 ప్రాంతంలో కవర్డ్‌ స్టోరేజీ షెడ్‌ రూ.22.5 కోట్లు

- డబ్ల్యుక్యు జంక్షన్‌ నుంచి ఎస్సార్‌ జంక్షన్‌ వరకు రోడ్డు నిర్మాణం - రూ.19.69 కోట్లు

- కస్టమ్స్‌ ప్రహరీ నిర్మాణం - రూ.7.17 కోట్లు

- ఆర్‌ఎఫ్‌ఐడీ గేట్‌ మేనేజ్‌మెంట్‌ - రూ.15 కోట్లు

- నూతన పోర్టు ఆపరేటింగ్‌ సిస్టమ్‌ - రూ.10.77 కోట్లు

- వెసల్‌ ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ - రూ.15.83 కోట్లు

Updated Date - Jul 15 , 2025 | 01:12 AM