ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

పడకేసిన డయాలసిస్‌ యూనిట్లు

ABN, Publish Date - Jul 15 , 2025 | 01:14 AM

కేజీహెచ్‌లోని నెఫ్రాలజీ విభాగంలో డయాలసిస్‌ సేవలు అందించే మెషీన్లు మూలకు చేరాయి.

  • కేజీహెచ్‌ నెఫ్రాలజీ విభాగంలో 10 మెషీన్లు

  • ఐదు మెషీన్లు మూడు వారాలుగా పనిచేయని వైనం

  • రోగులకు సేవలు అందించడంలో ఇబ్బందులు

  • గతంలో 20 నుంచి 30 మందికి డయాలసిస్‌

  • ప్రస్తుతం పది, పదిహేను మందికే...

  • తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని ఆవేదన

  • ఉన్నతాధికారులు సమస్య పరిష్కరించాలని డిమాండ్‌

విశాఖపట్నం, జూలై 14 (ఆంధ్రజ్యోతి):

కేజీహెచ్‌లోని నెఫ్రాలజీ విభాగంలో డయాలసిస్‌ సేవలు అందించే మెషీన్లు మూలకు చేరాయి. కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడే రోగులకు డయాలసిస్‌ చేసేందుకు విభాగంలో పది మెషీన్లు ఉన్నాయి. వీటి సాయంతో ప్రతిరోజూ 20 నుంచి 30 మందికి డయాలసిస్‌ చేస్తుంటారు. రోగుల సంఖ్యను బట్టి, వారికి ఉన్న సమస్యను బట్టి వైద్యులు షెడ్యూల్‌ ఇస్తారు. రోగి పరిస్థితిని బట్టి నెలలో రెండు నుంచి మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అయితే, ప్రస్తుతం ఈ విభాగంలో మెషీన్లు పనిచేయకపోవడంతో సేవలు అందించడంలో జాప్యం జరుగుతోంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోందని, అధిక మొత్తంలో డబ్బులు వెచ్చించాల్సి వస్తోందని రోగులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. కేజీహెచ్‌లో డయాలసిస్‌ సేవలు పొందుతున్నట్టు ఆన్‌లైన్‌లో నమోదు కావడంతో మరోచోట ఎన్‌టీఆర్‌ వైద్య సేవ కింద డయాలసిస్‌ సేవలు పొందలేని పరిస్థితి ఏర్పడినట్టు పేర్కొంటున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న మెషీన్లు సహాయంతో రోజుకు పది నుంచి 15 మందికి మాత్రమే సేవలు అందిస్తున్నట్టు తెలుస్తోంది.

మూడు వారాల నుంచి...

నెఫ్రాలజీ విభాగంలో ఉన్న పది మెషీన్లలో రెండు, మూడు సాంకేతిక సమస్యలతో పనిచేయవు. మిగిలిన ఏడు, ఎనిమిదింటితో రోగులకు సేవలు అందిస్తుంటారు. అయితే, గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఒకేసారి ఐదు మెషీన్లు మూలకు చేరడంతో రోగులకు సేవలు అందించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మూడు వారాలుగా మెషీన్లు పనిచేయకపోయినా ఆస్పత్రి అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదు. ఉన్నతాధికారులు సమస్యను పరిష్కరించేందుకు కృషిచేయాలని, దూర ప్రాంతాల నుంచి వచ్చే తమలాంటి వారికి ఇబ్బందులు లేకుండా చూడాలని రామారావు అనే రోగి సహాయకుడు పేర్కొన్నారు. ఉదయం నుంచి డయాలసిస్‌ కోసం నిరీక్షిస్తున్నామని, ఇంకా సమయం పడుతుందని చెబుతున్నారని వెల్లడించాడు.

కొత్తవి కొనుగోలు అవసరం

ఇకపోతే, పాడైన ఐదు మెషీన్లలో మూడు పూర్తిగా పనిచేయని స్థితికి చేరినట్టు తెలిసింది. మిగిలిన మెషీన్లు కూడా ఏళ్ల తరబడి నుంచి సేవలు అందిస్తున్నవి కావడంతో ఎప్పటికప్పుడు మొరాయిస్తున్నాయి.దీనివల్ల రోగులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. కొత్త డయాలసిస్‌ మెషీన్లు కొనుగోలు చేయడం ఒక్కటే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారమని వైద్యులు సూచిస్తున్నారు.

Updated Date - Jul 15 , 2025 | 01:14 AM