ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

గిరి ప్రదక్షిణకు పోటెత్తిన భక్తులు

ABN, Publish Date - Jul 10 , 2025 | 01:11 AM

సింహ‘గిరి ప్రదక్షిణ’కు భక్త జనసంద్రం పోటెత్తింది. రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి.

  • జనసంద్రంగా మారిన రహదారులు

  • రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది రాక

  • తొలిపావంచా వద్ద స్వామి వారి ప్రచార రథాన్ని ప్రారంభించిన ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు

  • పాల్గొన్న ఎంపీలు ఎం.భరత్‌, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గణబాబు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

సింహ‘గిరి ప్రదక్షిణ’కు భక్త జనసంద్రం పోటెత్తింది. రహదారులన్నీ కిక్కిరిసిపోయాయి. ఎటు చూసినా భక్తులే. పిల్లలు, పెద్దలు, వృద్ధులు, మహిళలు అనే తేడా లేకుండా మండే ఎండలో కాళ్లకు చెప్పులు లేకుండా హరి నామ స్మరణ చేస్తూ గిరి ప్రదక్షిణ చేశారు. ఏటా వరుణుడు కరుణించి కాసింత ఉపశమనం కలిగించేవాడు. కానీ ఈసారి సూరీడు చురచురలాడాడు. మధ్యాహ్నం గిరి ప్రదక్షిణ ప్రారంభించే సమయానికి చాలామందికి చెమటలు పట్టేశాయి. కాళ్లు బొబ్బలెక్కిపోయాయి. అయినా వెనకడుగు వేయలేదు. సాయంత్రం కాసింత చల్ల గాలి వీయడంతో భక్తులు హుషారుగా నడక కొనసాగించారు.

ఏటా మాదిరిగానే బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు కొండదిగువన తొలిపావంచా వద్ద స్వామివారి పుష్పతేరు (ప్రచార రథం)కు ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్‌గజపతిరాజు జెండా ఊపి సింహగిరి ప్రదక్షిణను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు మతుకుమిల్లి శ్రీభరత్‌, కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పీజీవీఆర్‌ నాయుడు (గణబాబు) పాల్గొన్నారు. ఉదయం 9.00 గంటల నుంచే కొందరు గిరిప్రదక్షిణను ఆరంభించగా, మరికొందరు స్వామివారి రథాన్ని అనుసరించారు. తొలి పావంచా వద్ద కొబ్బరికాయ కొట్టి అడవివరం, శ్రీకృష్ణాపురం, హనుమంతవాక జంక్షన్‌, విశాలాక్షి నగర్‌, తెన్నేటి పార్కు, అప్పుఘర్‌, ఎంవీపీ కాలనీ, ఇసుకతోట, హెచ్‌బీ కాలనీ, సీతమ్మధార, నరసింహనగర్‌, కైలాసపురం, మాధవధార, ఎన్‌ఎస్‌టీఎల్‌, గోపాలపట్నం, శ్రీనివాసనగర్‌ మీదుగా తిరిగి తొలి పావంచాకు చేరుకొని ప్రదక్షిణ ముగించారు. ఆ తరువాత కొందరు కొండపైకి వెళ్లి స్వామిని దర్శించుకోగా, మరికొందరు తొలిపావంచా నుంచి వెనుతిరిగారు.

గిరి ప్రదక్షిణకు ఈసారి అధికారులు ఊహించినట్టుగానే భక్తులు లక్షలాదిగా తరలివచ్చారు. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి మొక్కులు తీర్చుకునేందుకు క్యూకట్టారు. స్వచ్ఛంద సంస్థలకు ఆంక్షలు పెట్టకుండా సేవలు అందించేందుకు అవకాశం కల్పించడంతో వారు గిరి ప్రదక్షిణ మార్గంలో ఎక్కడికక్కడ శిబిరాలు ఏర్పాటుచేసి భక్తులకు ఫలహారాలు, పండ్లు, పానీయాలు అందించారు. ఎవరికీ ఆకలి దప్పిక లేకుండా చేశారు. కాళ్ల నొప్పులతో మార్గం మధ్యంలో కూలబడిపోయిన వారికి సత్యసాయి సేవా సంస్థ సభ్యులు ఆప్యాయంగా ఆయుర్వేద తైలం రాసి, మసాజ్‌ చేసి పునరుత్తేజం కల్పించారు.

ఏఐ సాయంతో భక్తుల సంఖ్య లెక్కింపు

ఏటా గిరి ప్రదక్షిణకు ఎంత మంది భక్తులు వచ్చారనేది ఒక అంచనాగా చెప్పేవారు. గత ఏడాది నాలుగు లక్షల మంది పాల్గొనగా ఈసారి ఐదు లక్షల మంది వస్తారని భావించి అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. బందోబస్తు, భక్తుల భద్రత కోణంలో గిరి ప్రదక్షిణ మార్గం 32 కి.మీ. పొడవునా ఈసారి సీసీ కెమెరాలు పెట్టారు. ముఖ్యమైన జంక్షన్లలో కొన్నింటికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించారు. మనుషుల ముఖాలను గుర్తు పట్టే విధంగా చేశారు. దాంతో గిరి ప్రదక్షిణలో ఎంత మంది పాల్గొన్నారనేది కచ్చితంగా తెలుసుకునే అవకాశం ఏర్పడింది. పోలీసులు, జీవీఎంసీ అధికారులు కలిసి ఈ వ్యవస్థను ఏర్పాటుచేశారు.

ట్రాఫిక్‌ జామ్‌

గిరి ప్రదక్షిణకు ఇబ్బందులు లేకుండా పోలీసులు ట్రాఫిక్‌ మళ్లించారు. అయితే శివారు ప్రాంతాలతో పాటు సాయంత్రం నుంచి జాతీయ రహదారిపైనా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. వేపగుంట జంక్షన్‌ పద్మవ్యూహంగా మారిపోయింది. హనుమంతవాక జంక్షన్‌, వెంకోజీపాలెం, ఎన్‌ఏడీ జంక్షన్‌లలో కూడా వాహన చోదకులు ఇబ్బందిపడ్డారు.

గొప్ప అనుభూతి

- వై.ప్రకాష్‌బాబు, శ్రీకాకుళం

ఏడాదికి ఒకసారి కొండ చుట్టూ తిరిగి వెళ్లి అప్పన్న స్వామిని దర్శించుకుంటే గొప్ప అనుభూతి కలుగుతుంది. ఈ దర్శనం తరువాత మనసు ఎంతో నిబ్బరంగా ఉంటుంది. స్వామి దర్శనం అనంతరం వేయి ఏనుగుల బలం వచ్చినట్టు అనిపిస్తుంది. అందుకే గడిచిన ఆరేళ్లుగా గిరి ప్రదక్షిణ తరువాత స్వామిని దర్శనం చేసుకుని వెళుతుంటా. స్వామి నాకు అవకాశం కల్పించినంత వరకూ వస్తూనే ఉంటాను.

ఎన్ని పనులు ఉన్నా...

- వెలువల వీర వెంకటరమణ, అన్నవరం

గడిచిన ఆరేళ్లుగా గిరి ప్రదక్షిణకు వస్తున్నా. తొలిసారి వచ్చినప్పుడు స్వామికి నా కష్టాన్ని చెప్పుకున్నా. నా మొర విన్న స్వామి దాని నుంచి నన్ను గట్టెక్కించారు. అప్పటి నుంచి స్వామిని బలంగా విశ్వసించడం మొదలు పెట్టాను. అందుకే ఎన్ని పనులు ఉన్నా ఏటా గిరి ప్రదక్షిణకు వస్తుంటాను.

Updated Date - Jul 10 , 2025 | 01:11 AM