ప్రకృతి వనరుల విధ్వంసం
ABN, Publish Date - May 24 , 2025 | 01:06 AM
చోడవరం మండలంలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలను అధికారులు తక్షణమే నిలుపుదల చేయించకపోతే తమ పార్టీ శ్రేణులు అడ్డుకోవాల్సి వస్తుందని జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్ రాజు హెచ్చరించారు.
ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలను అధికారులు ఎందుకు అడ్డుకోవడం లేదు?
జనసేన ‘చోడవరం’ ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్ రాజు ఆగ్రహం
చోడవరం, మే 23 (ఆంధ్రజ్యోతి): చోడవరం మండలంలో విచ్చలవిడిగా సాగుతున్న ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకాలను అధికారులు తక్షణమే నిలుపుదల చేయించకపోతే తమ పార్టీ శ్రేణులు అడ్డుకోవాల్సి వస్తుందని జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి పీవీఎస్‌ఎన్ రాజు హెచ్చరించారు. ఆయన జనసేన నాయకులతో కలిసి శుక్రవారం నరసాపురం, శేమునాపల్లి, వెంకన్నపాలెం, గవరవరం, లక్కవరం ప్రాంతాల్లో ఇసుక, గ్రావెల్ అక్రమంగా తవ్వుతున్న ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇసుక కోసం శారదా నదిని ధ్వంసం చేస్తున్నారని, కొన్నిచోట్ల నది తీరంలో దాదాపు 20 అడుగుల లోతున ఇసుక తవ్వేస్తున్నారని చెప్పారు. అధికారులు కట్టడి చేసి, అక్రమ తవ్వకందారులపై చర్యలు తీసుకోకపోతే శారదా నదికి, తద్వారా ప్రజలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇతర ప్రాంతాలకు చెందిన వ్యక్తులు యంత్రాలతో ఇసుకను తవ్వి, తరలించుకుపోతున్నట్టు స్థానికులు చెబుతున్నారని, దీనివల్ల కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఆయన అన్నారు. ఉచితం పేరుతో ఇష్టారాజ్యాంగా ఇసుక తవ్వకాలు జరుపుతుంటే రెవెన్యూ, మైనింగ్, పోలీసు శాఖల అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇసుక, గ్రావెల్ అక్రమ తవ్వకందారులను గుర్తించి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఒకవేళ అక్రమ తవ్వకాలకు అడ్డుకట్ట వేయకపోతే జనసేన శ్రేణులు రంగంలోకి దిగాల్సి వస్తుందని పీవీఎస్‌ఎన్ రాజు స్పష్టం చేశారు. ఆయన వెంట జనసేన నాయకులు అల్లం రామప్పారావు, సిరిపురపు రమేశ్, గూనూరు మూలినాయుడు, సియ్యాద్రి జగదీశ్, ప్రసాద్ తదితరులు వున్నారు.
Updated Date - May 24 , 2025 | 01:06 AM