ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

19న డిప్యూటీ మేయర్‌ ఎన్నిక

ABN, Publish Date - May 14 , 2025 | 12:44 AM

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్‌ పదవి కోసం కూటమి కార్పొరేటర్లలో పలువురు పోటీపడుతున్నారు.

  • పదవి కోసం ఆశావహుల ముమ్మర ప్రయత్నాలు

  • ఎంపికలో సామాజికవర్గాల సమీకరణలే కీలకం

  • యాదవ, కాపు సామాజికవర్గాల మధ్యే పోటీ

  • ఎవరికివారు ముమ్మర ప్రయత్నాలు

  • ఏం చేయాలనేదానిపై తలలుపట్టుకుంటున్న మేయర్‌, ప్రజాప్రతినిధులు

  • ముఖ్యమంత్రి వద్దకు చేరిన పంచాయితీ

  • నేడు చంద్రబాబును కలవనున్న మేయర్‌, నగర ఎమ్మెల్యేలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

మహా విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్‌ పదవి కోసం కూటమి కార్పొరేటర్లలో పలువురు పోటీపడుతున్నారు. తమకు సన్నిహితంగా ఉండే ప్రజాప్రతినిధులు, నాయకుల ద్వారా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ మేయర్‌ ఎంపికను సీఎం చంద్రబాబునాయుడుకు విడిచిపెట్టేయాలని మేయర్‌తోపాటు ప్రజా ప్రతినిధులు నిర్ణయించారు. ఈ విషయమై అమరావతిలో బుధవారం సీఎంతో జరిగే సమావేశం కోసం మేయర్‌తోపాటు ఎమ్మెల్యేలంతా మంగళవారం రాత్రి బయలుదేరి వెళ్లారు.

జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరి వెంకటకుమారితోపాటు డిప్యూటీ మేయర్‌ జియ్యాని శ్రీధర్‌పై కూటమి కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం పెట్టడంతో ఇద్దరూ పదవి కోల్పోయారు. కొత్త మేయర్‌గా టీడీపీకి చెందిన 96వ వార్డు కార్పొరేటర్‌ పీలా శ్రీనివాసరావు ఎన్నికవ్వగా, డిప్యూటీ మేయర్‌ ఎన్నిక ఈ నెల 19న జరగాల్సి ఉంది. డిప్యూటీ మేయర్‌ పదవి కోసం పలువురు కార్పొరేటర్లు పోటీపడుతున్నారు. మేయర్‌ పదవి నుంచి తప్పించిన గొలగాని హరివెంకటకుమారి యాదవ సామాజిక వర్గానికి చెందినవారు అయినందున... డిప్యూటీ మేయర్‌ పదవిని తమకు కేటాయించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు డిమాండ్‌ చేస్తున్నారు. లేనిపక్షంలో సామాజిక వర్గం నుంచి ఒత్తిడిని ఎదుర్కొనాల్సి వస్తుందని ప్రజాప్రతినిధుల ముందు వాదన వినిపిస్తున్నారు. డిప్యూటీ మేయర్‌ పదవి కోసం యాదవ సామాజిక వర్గం నుంచి ఐదో వార్డు కార్పొరేటర్‌ మొల్లి హేమలత, 18వ వార్డు కార్పొరేటర్‌ గొలగాని మంగవేణితోపాటు 90వ వార్డు కార్పొరేటర్‌ బొమ్మిడి రమణ పోటీ పడుతున్నారు. వైసీపీ నుంచి కార్పొరేటర్‌గా గెలిచి, స్టాండింగ్‌ కమిటీ సభ్యుడిగా ఉంటూనే సాధారణ ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన 29వ వార్డు కార్పొరేటర్‌ ఉరుకూటి నారాయణరావు కూడా ఈ పదవిని తనకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఇదిలావుండగా కాపు సామాజిక వర్గానికి చెందిన జియ్యాని శ్రీధర్‌ను పదవి నుంచి తొలగించినందున అదే వర్గానికి చెందిన వారికి కేటాయించడం ద్వారా సామాజిక సమతుల్యాన్ని పాటించాలని ఆ సామాజిక వర్గానికి చెందిన కార్పొరేటర్లు పట్టుబడుతున్నారు. ప్రధానంగా 76వ వార్డు కార్పొరేటర్‌ గంధం శ్రీనివాసరావు, 97వ వార్డు కార్పొరేటర్‌ సేనాపతి వసంత, 94వ వార్డు కార్పొరేటర్‌ బల్ల శ్రీనివాసరావులు డిప్యూటీ మేయర్‌ పోస్టు కోసం తమవంతు ప్రయత్నాలను ముమ్మరంగా సాగిస్తున్నారు. పార్టీలో సీనియారిటీని, జీవీఎంసీలో గత నాలుగేళ్ల వైసీపీ పాలనపై కౌన్సిల్‌లో పోరాటం చేయడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే గంధం శ్రీనివాసరావుకు అవకాశం దక్కడం ఖాయమని పార్టీ నేతలు చెబుతున్నారు. కానీ యాదవ సామాజిక వర్గ మహిళను మేయర్‌ పదవి నుంచి అవిశ్వాసం ద్వారా తొలగించినందున తిరిగి అదే సామాజిక వర్గం నుంచి మహిళను మేయర్‌ పదవికి ఎంపిక చేయాల్సి ఉన్నప్పటికీ ప్రత్యేక పరిస్థితులు, పార్టీ పట్ల విధేయతను చూపడాన్ని దృష్టిలో పెట్టుకుని గవర సామాజిక వర్గానికి చెందిన పీలా శ్రీనివాసరావుకు అవకాశం ఇచ్చినందున... కనీసం డిప్యూటీ మేయర్‌ పదవిని యాదవ వర్గానికి చెందిన మహిళకు కేటాయిస్తే బాగుంటుందని కొందరు ప్రజాప్రతినిధులు అభిప్రాయపడుతున్నారు. దీనిని కొందరు ఎమ్మెల్యేలు కూడా సమర్థిస్తుండడంతో యాదవ వర్గానికి చెందిన మహిళకు పదవిని కేటాయించడం దాదాపు ఖాయమని టీడీపీకి చెందిన ఒక కీలక ప్రజాప్రతినిధి అభిప్రాయం వ్యక్తం చేశారు. బుధవారం సీఎం సమక్షంలో జరిగే సమావేశంలోనూ ఇదే నిర్ణయం వెలువడే అవకాశం ఉందని ఆయననన్నారు. అలాగైతే ఐదో వార్డు కార్పొరేటర్‌ మొల్లి హేమలత, 17వ వార్డు కార్పొరేటర్‌ గొలగాని మంగవేణి మధ్య పోటీ నెలకొంటుంది కాబట్టి విద్యావంతురాలైన మొల్లి హేమలత వైపు సీఎం మొగ్గుచూపే అవకాశం ఉంటుంది. ఒకవేళ డిప్యూటీ మేయర్‌గా యాదవ మహిళను ఎంపిక చేస్తే టీడీపీ ఫ్లోర్‌ లీడర్‌గా గంధం శ్రీనివాసరావుకు అవకాశం ఇవ్వడం ఖాయమని చెప్పుకోవచ్చు.

మరోవైపు డిప్యూటీ మేయర్‌ పదవిని తమకు కేటాయించాలని జనసేన ఫ్లోర్‌ లీడర్‌ భీశెట్టి వసంతలక్ష్మి పట్టుబడుతున్నప్పటికీ ఆమె సామాజిక వర్గానికే చెందిన వ్యక్తి పీలా శ్రీనివాసరావు మేయర్‌గా ఉండడం ఆమెకు అడ్డంకిగా మారింది. ఆ పార్టీలో మరొకరికి ఇవ్వాలనుకుంటే 22వ వార్డు కార్పొరేటర్‌ మూర్తియాదవ్‌, 64వ వార్డు కార్పొరేటర్‌ దల్లి గోవిందరెడ్డికి అవకాశం ఇవ్వాలి. కానీ మూర్తియాదవ్‌ తాను ఎలాంటి పదవి తీసుకోనని స్పష్టం చేయగా, దల్లి గోవిందరెడ్డికి సామాజిక వర్గాల సమీకరణలు అడ్డుగా నిలిచాయి. వైసీపీ నుంచి ఆ పార్టీలో చేరిన వారికి ఇవ్వాలనుకున్నాసరే డిప్యూటీ మేయర్‌గా పోటీ చేసినపుడు బీ-ఫారం జారీలో సాంకేతిక ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఇతరులకు అవకాశం లేదని కూటమి ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. ఏదిఏమైనా కొత్త డిప్యూటీ మేయర్‌ ఎవరనేది అమరావతిలో బుధవారం సీఎం చంద్రబాబు సమక్షంలో మేయర్‌తోపాటు ఎమ్మెల్యేలతో జరిగే సమావేశంలో తేలుతోంది.

Updated Date - May 14 , 2025 | 12:44 AM