ప్రభుత్వ పరిశీలనలో దసపల్లా భూముల వ్యవహారం
ABN, Publish Date - Jul 28 , 2025 | 01:21 AM
నగరంలో విలువైన దసపల్లా భూముల వ్యవహారం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఇప్పటికే కేబినెట్‌లో చర్చ జరిగిందని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు.
నేడు కలెక్టరేట్‌లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తా
మంత్రి అనగాని సత్యప్రసాద్
విశాఖపట్నం, జూలై 27 (ఆంధ్రజ్యోతి):
నగరంలో విలువైన దసపల్లా భూముల వ్యవహారం ప్రభుత్వ పరిశీలనలో ఉందని, ఇప్పటికే కేబినెట్‌లో చర్చ జరిగిందని రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలో విలువైన ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై గతంలో టీడీపీ నేతలు పోరాటం చేశారన్నారు. దీనిలో భాగంగా దసపల్లా భూములతోపాటు మరికొన్ని భూములపై ప్రస్తుతం విచారణ జరుగుతోందని, నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. పలు కారణాలతో 22-ఏలో ఉన్న ప్రైవేటు భూములను తప్పిస్తున్నామని, దీనికి సంబంధించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తానని ప్రకటించారు. ప్రజలు నేరుగా కలిసి వినతులు అందజేయాలని పిలుపునిచ్చారు. ఉత్తరాంధ్ర పట్టభద్ర ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు. భోగాపురం ఎయిర్‌పోర్టు శరవేగంగా నిర్మాణంసాగుతుందని, విశాఖకు పలు ఐటీ కంపెనీలు వస్తున్నాయన్నారు. మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ ఉత్తరాంధ్రపై తెలుగుదేశం పార్టీకి ఎనలేని అభిమానం ఉందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవులను ఎర్రన్నాయుడు, కళా వెంకటరావు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, ప్రస్తుతం పల్లా శ్రీనివాసరావుకు దక్కాయని, తాజాగా కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్‌గా నియమించారన్నారు.
రాష్ట్రంలో పాజిటివ్ గవర్నెన్స్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో పాజిటివ్ గవర్నెన్స్ నడుస్తున్నదని మంత్రి అన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఏడాదిలోనే రూ.పది లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, యువతకు పెద్దఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. వైసీపీ హయాంలో పెట్టుబడులకు పెట్టేందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలను జగన్ వెళ్లగొట్టారని ఆరోపించారు. సింగపూర్‌లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి.. అక్కడ పారిశ్రామికవేత్తలను కలిసి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారన్నారు. జగన్‌రెడ్డి హయాంలో నకిలీ మద్యం విక్రయించారని, మద్యం షాపుల్లో డిజిటల్ చెల్లింపులు లేకపోవడం వెనుక కుట్రకోణం ఉందన్నారు. వైసీపీ హయాంలో జరిగిన భూముల అక్రమ లావాదేవీలపై విచారణ చేస్తామన్నారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గండి బాబ్జి, పొలమరశెట్టి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి లొడగల కృష్ణ పాల్గొన్నారు.
Updated Date - Jul 28 , 2025 | 01:21 AM