చెరువులో చెట్లు నరికివేత
ABN, Publish Date - Apr 12 , 2025 | 12:36 AM
మండలంలోని గొటివాడ సూరపురాజ్ చెరువులో నేరేడు వృక్షాలు, నీలగిరి చెట్ల నరికివేతను పంచాయతీ పాలవర్గ సభ్యులు, రైతులు అడ్డుకున్నారు. అయితే కోర్టు తీర్పు మేరకు చెరువులో చెట్లు నరికిస్తున్నట్టు సాగునీటి సంఘం అధ్యక్షుడు చెబుతున్నారు.
అడ్డుకున్న పంచాయతీ సభ్యులు, రైతులు
కోర్టు తీర్పుమేరకు నరికిస్తున్నట్టు సాగునీటి సంఘం అధ్యక్షుడు వెల్లడి
సబ్బవరం, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): మండలంలోని గొటివాడ సూరపురాజ్ చెరువులో నేరేడు వృక్షాలు, నీలగిరి చెట్ల నరికివేతను పంచాయతీ పాలవర్గ సభ్యులు, రైతులు అడ్డుకున్నారు. అయితే కోర్టు తీర్పు మేరకు చెరువులో చెట్లు నరికిస్తున్నట్టు సాగునీటి సంఘం అధ్యక్షుడు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఉపసర్పంచ్ గొలజాన దుర్గాప్రసాద్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు బొండా కల్యాణ్‌రాజ్, లగిశెట్టి కుమార్, విరోతి రామారావు, సాలాపు చిట్టిబాబు తదితరులు మాట్లాడుతూ.. గొట్టివాడ సూరపురాజ్ చెరువులో సుమారు 15 ఏళ్లు క్రితం అటవీ శాఖ అధికారుల సహకారంతో నీలగిరి మొక్కలు నాటామని, అప్పటికే నేరేడు వృక్షాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది కూలీలు నేరేడు వృక్షాలు, నీలగిరిచెట్లను నరుకుతున్నట్టు తెలియడంతో ఇక్కడకు వచ్చి అడ్డుకున్నట్టు చెప్పారు. చెట్లు నరుకుతున్న వారిని ప్రశ్నించగా. అసకపల్లికి చెందిన గవర అప్పనాయుడు పురమాయించడంతో నరుకున్నామని చెబుతున్నారని, దీనిపై అప్పలనాయుడును ప్రశ్నించగా చెరువు సంఘం అద్యక్షుడు సాలాపు సూరిబాబు, ఉపాద్యక్షుడు బొండా శివరాం, చెట్లను తమకు విక్రయించారని చెప్పాడన్నారు.
కోర్టు తీర్పుతోనే చెట్లు విక్రయం
సాగునీటి సంఘం అధ్యక్షుడు సాలాపు సూరిబాబు మీడియాతో మాట్లాడుతూ, 2014లో హుద్‌హుద్ తుఫాన్ కారణంగా చెరువులో కూలిపోయిన చెట్లను నరుక్కోవడానికి ప్రభుత్వానికి రూ.2.5 లక్షలు చెల్లించినట్టు చెప్పారు. అప్పుడు కూడా తానే సాగునీటి సంఘం అద్యక్షుడిగా ఉన్నాననీ, కొంత మంది వ్యక్తులు తనకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించారని తెలిపారు. గత ఏడాది తనకు అనుకూలంగా కోర్టు తీర్పు ఇచ్చిందని దీంతో చెట్లను విక్రయించానని వివరించారు.
Updated Date - Apr 12 , 2025 | 12:36 AM