ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

కాకి లెక్కలు

ABN, Publish Date - May 05 , 2025 | 12:34 AM

సింహాచలేశుడి చందనోత్సవంలో అధికారుల తీరు అంతా మాయగా కనిపిస్తోంది.

  • చందనోత్సవంపై అధికారుల గారడీ మాటలు

  • 44,384 టికెట్లు అమ్మినట్టు ప్రకటన

  • గత ఏడాది కంటే ఎక్కువ ఇచ్చామని వెల్లడి

  • అన్నీ తప్పుడు లెక్కలేనంటున్న ప్రజాప్రతినిధులు

  • అధికారులపై క్రిమినల్‌ కేసులు పెడతామన్న త్రిసభ్య కమిటీ

విశాఖపట్నం, మే 4 (ఆంధ్రజ్యోతి):

సింహాచలేశుడి చందనోత్సవంలో అధికారుల తీరు అంతా మాయగా కనిపిస్తోంది. చందనోత్సవం టికెట్ల విక్రయాల్లో అడ్డగోలుగా వ్యవహరించారని, మంగళవారం రాత్రి 11 గంటల వరకు పడిగాపులు పడేలా చేశారని ‘ఆంధ్రజ్యోతి’ ఆదివారం ప్రచురించిన కథనంపై ఆలయ ఈఓ సుబ్బారావు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గత ఏడాది 32,461 టికెట్లు విక్రయించగా, ఈ ఏడాది 44,384 టికెట్లు ఇచ్చామని పేర్కొన్నారు. రూ.వెయ్యి టికెట్ల కౌంటర్లలో 13,803, ఆన్‌లైన్‌లో 3,999 విక్రయించామన్నారు. వీఐపీ టికెట్లు రూ.1,500 విలువైనవి మూడు వేలు విక్రయించామన్నారు. కానీ వీటిని 2,500 మాత్రమే ముద్రించామని విలేకరుల సమావేశంలో ఈఓ వెల్లడించారు. అదనంగా మరో 500 టికెట్లు ఎలా వచ్చాయో, ఎవరికి ఇచ్చారో వివరించలేదు. ఇక అంతరాలయం టికెట్లు 496 ఇచ్చామన్నారు. ఇవి ప్రొటోకాల్‌ టికెట్లుగా భావించాలి. రూ.300 టికెట్లు కౌంటరలో 15,495, ఆన్‌లైన్‌లో 7,591 మొత్తంగా 23,086 టికెట్లు అమ్మామని ఈఓ తెలిపారు. అన్నిరకాల టికెట్లు 44,384గా లెక్క చూపించారు.

చందనోత్సవానికి సిద్ధం చేసిన టికెట్లలో 24వ తేదీనే 14,584, 25న 7,130, 26న 2,939, 28న 8,849, 29న5,417 టికెట్లు విక్రయించామని ప్రకటనలో వివరించారు. అంటే ఆఖరి రోజు వరకు అన్ని టికెట్లు ఉంచుకోలేదని పరోక్షంగా చెప్పే ప్రయత్నం చేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా టికెట్లు లభించేలా ప్రతి రోజూ టికెట్లు విక్రయించామని పేర్కొన్నారు.

అన్నీ అవాస్తవాలే

చందనోత్సవం టికెట్ల విక్రయానికి సంబంధించి ఈఓ సుబ్బారావు విడుదల చేసిన ప్రకటనలో 90 శాతం అవాస్తవాలే ఉన్నాయి. రూ.వెయ్యి టికెట్లను వందల సంఖ్యలోనే ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో విక్రయించి మిగిలినవన్నీ బ్లాక్‌ చేశారు. గత ఏడాది కూడా ఓ ఏఈఓ రూ.వెయ్యి టిక్కెట్లు బ్యాంకులో బ్లాక్‌ చేశారని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధి నాటి కలెక్టర్‌ మల్లికార్జునకు విలేకరుల సమావేశంలో వివరించగా, విచారణ చేయిస్తామని చెప్పినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ టిక్కెట్లను బ్లాక్‌ చేసి అవసరమైన వారికి ఇచ్చుకోవడంలో కమిషనర్‌ నుంచి ఈవో వరకు ప్రతి ఒక్కరి పాత్ర ఉందని సమాచారం.

ప్రజా ప్రతినిధులకూ చుక్కలే...

కాగా ఈ ఏడాది చందనోత్సవం ముందురోజు మంగళవారం సాయంత్రం వరకు ప్రజా ప్రతినిధులకు టిక్కెట్లు ఇవ్వలేదు. వారు కోరినన్ని ఇవ్వకపోవడం, అదనంగా అడిగితే ఆ రోజు రాత్రి 11 గంటల వరకు ఈఓ తన కార్యాలయం చుట్టూ తిప్పించుకున్నారు. డబ్బులు చెల్లించి కొనుక్కునే టిక్కెట్లు ఆన్‌లైన్‌లో, బ్యాంకులో అందుబాటులో ఉంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్ల పీఏలు అక్కడ కాకుండా కలెక్టరేట్‌, ఈఓ కార్యాలయం చుట్టూ ఎందుకు తిరగాల్సి వచ్చిందో ఈఓ వెల్లడించాల్సిన అవసరం ఉంది. ఏటా టిక్కెట్లను బ్లాక్‌ చేసి ఆలయ అధికారులే బ్లాకులో అమ్ముకుంటున్నారు. ఇది వాస్తవం. పత్రికల్లో కథనాలు అవాస్తవమని నిరూపించదలుచుకుంటే మంగళవారం సాయంత్రం నుంచి రాత్రి 11 గంటల వరకు ఈఓ కార్యాలయం బయట ఏమి జరిగిందో సీసీ టీవీ ఫుటేజీ బయటపెట్టాలి.

ఇవీ వాస్తవాలు

దేవస్థానానికి భూరి విరాళాలు ఇచ్చేవారికి ఏటా టిక్కెట్లు ఇచ్చేవారు. ఈ సారి ఇవ్వలేదు.

గత ఏడాది జీవీఎంసీ కార్పొరేటర్లు ఒక్కొక్కరికి ఐదేసి టిక్కెట్లు ఇచ్చారు. ఈసారి కేవలం రెండు మాత్రమే ఇచ్చారు.

ప్రజాప్రతినిధులు కోరినన్ని ఇవ్వలేదు. అందరికీ సమానంగానూ అందిచలేదు. విశాఖలో కీలకమైన ఓ ప్రజాప్రతినిధి 80 టిక్కెట్లు అడిగితే 50 మాత్రమే అదీ మంగళవారం మధ్యాహ్నం ఇచ్చారు. మరో 30 కావాలంటే కలెక్టరేట్‌కు, ఈఓ కార్యాలయానికి రాత్రి 11 గంటల వరకు తిప్పించుకొని అప్పుడు ఇచ్చారు. ఓ కార్పొరేషన్‌ చైర్మన్‌కు కూడా ఇదే అనుభవం ఎదురయింది. దీంతో తాజాగా ఈఓ విడుదల చేసిన ప్రకటన అంతా బూటకమని పీఏలు ఆదివారం రాత్రి ‘ఆంధ్రజ్యోతి ప్రతినిధి’కి ఫోన్‌లో తెలిపారు.

టిక్కెట్లు కావాలని లెటర్‌ హెడ్‌లపై దరఖాస్తు చేసిన వారందరికీ మంగళవారం సాయంత్రం నుంచి జారీ ప్రారంభించారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌ లైన్‌లో సులువుగా లభిస్తేవీరంతా ఈఓ కార్యాలయం చుట్టూ ఎందుకు తిరగాల్సి వచ్చిందో ఈఓ చెప్పలేదు. ఈ నేపథ్యంలో తప్పులు చేయడం, సమర్థించుకోవడం సింహాచలం దేవస్థానం అధికారులకు అలవాటుగా మారందనే విమర్శలు వినిపిస్తున్నారు. ఈ తీరు గమనించిన త్రిసభ్య కమిటీ ఈ అధికారులపై క్రిమినల్‌ కేసులు పెట్టాలని వ్యాఖ్యానించారంటే పరిస్థితి ఎలా ఉందో తెలుస్తోంది.

చందనోత్సవ ఘటనపై దేవదాయశాఖ సీఈ సమీక్ష

సింహాచలం, మే 4 (ఆంధ్రజ్యోతి):

వరాహలక్ష్మీనృసింహస్వామి నిజరూప దర్శనం చందనోత్సవ వేళ సింహగిరిపై గోడకూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వ ఆదేశాల మేరకు దేవదాయశాఖ చీప్‌ ఇంజినీర్‌ శేఖర్‌ సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ప్రసాద్‌ పథకం కింద నిర్మాణంలో ఉన్న టూరిజం సమాచారం కేంద్రం, క్యూకాంప్లెక్స్‌, దుకాణ సముదాయం, మల్టీప్లెక్స్‌ భవనం, కోల్డ్‌ స్టోరేజి, రెండో ఘాట్‌రోడ్డు సమీపంలోని నిర్మాణాలను టూరిజం, దేవదాయశాఖ ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి శని, ఆదివారాల్లో క్షేత్ర పరిశీలన చేశారు. అనంతరం ఇరుశాఖల ఇంజినీరింగ్‌ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చందనోత్సవ ఘటనకు కారణమైన గోడ నిర్మాణం తీరున పరిశీలించామన్నారు. ప్రసాద్‌ పథకం పనుల్లో జాప్యంపై చర్చించామని, లోటుపాట్లపై ప్రత్యేక దృష్టి సారించామని, నివేదికను ప్రభుత్వానికి అందిస్తామన్నారు. ఆయన వెంట పర్యాటక శాఖ ఇంజననీర్లు రమణ, స్వామి, మదన్‌, దేవదాయశాఖ ఇంజనీర్లు శ్రీనివాసరాజు, రాంబాబు, తదితరులున్నారు.

Updated Date - May 05 , 2025 | 12:34 AM