ఖాకీల అవినీతిపై సీపీ సీరియస్!
ABN, Publish Date - May 19 , 2025 | 12:41 AM
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో లంచాలకు పాల్పడడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభియోగాలను ఎదుర్కొంటున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్లపై సీపీ శంఖబ్రత బాగ్చి సీరియస్ అయినట్టు తెలిసింది.
రేంజ్ వీఆర్‌కు మల్కాపురం సీఐ
ఇతర సీఐల అవినీతిపై సీల్డ్ కవర్లు అందజేత
తగిన వివరణ ఇవ్వాలని ఆదేశించిన శంఖబ్రత బాగ్చి
నేడో, రేపో పలువురిపై బదిలీ వేటు?
విశాఖపట్నం, మే 18 (ఆంధ్రజ్యోతి):
నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో లంచాలకు పాల్పడడం, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే అభియోగాలను ఎదుర్కొంటున్న సర్కిల్ ఇన్‌స్పెక్టర్లపై సీపీ శంఖబ్రత బాగ్చి సీరియస్ అయినట్టు తెలిసింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐలతో శనివారం ఆయన తన చాంబర్‌లో సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఒక్కో సీఐను పిలిచి వారి స్టేషన్ పరిధిలో మద్యం దుకాణాలు, బార్‌లతో పాటు స్టేషన్‌కు వచ్చే కేసుల్లో వసూళ్లకు సంబంధించిన అంశాలను సీపీ వారికి వివరించి, సమాధానం కోరినట్టు తెలియవచ్చింది. అలాగే ఆయా స్టేషన్ల పరిధిలో సీఐతోపాటు సిబ్బంది పనితీరు, అవినీతికి సంబంధించి తనవద్దకు వచ్చిన వివరాలను ఒక కవరులో పెట్టి వారికి అందజేసినట్టు సమాచారం. వాటిపై తగిన వివరణ ఇవ్వడంతోపాటు ఆరోపణలను సరిదిద్దుకునేందుకు చేపట్టిన చర్యలను తనకు తెలియజేయాలని సీఐలను ఆదేశించినట్టు తెలిసింది. పీఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధికి సంబంధించి బీచ్ రోడ్డులో వాహనచోదకుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారనే అభియోగంపై ఆధారాలు లభించడంతో ఆయన్ను వీఆర్‌కు సరెండర్ చేసినట్టు తెలియవచ్చింది.
అదేవిధంగా మల్కాపురం సీఐ విద్యాసాగర్ స్టేషన్‌కు వచ్చిన మహిళను లైంగికంగా వేధించడం, అదే పనిగా ఆమెకు ఫోన్ చేసి ఇబ్బంది పెడుతున్నట్టు ఫిర్యాదు అందడంతో ఆయనను కూడా రేంజ్ వీఆర్‌కు సరెండర్ చేసినట్టు చేసినట్టు సమాచారం. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సీఐలపై ఒకటి రెండు రోజుల్లో శంఖబ్రత బాగ్చి బదిలీ వేటు వేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎవరిపై వేటు పడుతుందనే దానిపై పోలీస్ వర్గాల్లో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది.
Updated Date - May 19 , 2025 | 12:41 AM