ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

మసాజ్‌ సెంటర్లపై సీపీ కన్ను!

ABN, Publish Date - May 31 , 2025 | 01:06 AM

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మసాజ్‌ సెంటర్లను గాడిలో పెట్టడంపై సీపీ శంఖబ్రత బాగ్చి దృష్టిసారించారు.

  • ఇకపై జంబ్లింగ్‌ తరహాలో తనిఖీలు

  • ఒక స్టేషన్‌ పరిధిలోని మసాజ్‌ సెంటర్లలో వేరే పోలీస్‌ స్టేషన్‌ అధికారులతో సోదాలు

  • అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు నగర పోలీస్‌ కమిషనర్‌ ప్లాన్‌

  • అసాంఘిక కార్యక్రమాలకు అడ్డాగా మసాజ్‌ సెంటర్లు మారుతున్నాయని ఫిర్యాదులు

  • నిర్వాహకుల నుంచి పోలీసులు మామూళ్లు తీసుకుంటున్నట్టు ఆరోపణలు

  • వీటన్నింటికీ అడ్టుకట్ట వేసేందుకు శంఖబ్రత బాగ్చి ప్రణాళికలు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

నగర పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మసాజ్‌ సెంటర్లను గాడిలో పెట్టడంపై సీపీ శంఖబ్రత బాగ్చి దృష్టిసారించారు. కొన్ని మసాజ్‌ సెంటర్లలో మసాజ్‌ పేరుతో వ్యభిచారం నిర్వహిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తడం, వాటిపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు మామూళ్ల మత్తులో చోద్యం చూస్తున్నారనే ఆరోపణలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. ఇకపై ఒక స్టేషన్‌ పరిధిలో ఉండే మసాజ్‌ సెంటర్లలో ఇతర పోలీస్‌ స్టేషన్‌కు చెందిన అధికారులు, సిబ్బందితో తనిఖీలు చేయించాలని నిర్ణయించారు. దీనివల్ల మసాజ్‌ సెంటర్లలో అక్రమాలకు చెక్‌ పడుతుందని సీపీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

నగరంలో 300కి పైగా మసాజ్‌ సెంటర్లు ఉన్నాయి. వీటిలో కేవలం శరీర మర్ధన, కాస్మోటిక్స్‌కు సంబంధించిన సేవలను మాత్రమే అందించాలి. ఇవన్నీ ‘బ్యూటీషియన్‌ అండ్‌ కాస్మోటిక్‌ సెక్టార్‌’ కింద బ్యూటీ పార్లర్లు, స్పా, మసాజ్‌ సెంటర్లు, రిలాక్స్‌, వెల్‌నెస్‌ సెంటర్లు, హెల్త్‌ క్లబ్‌ వంటి పేర్లతో కార్యకలాపాలను సాగిస్తుంటాయి. నిబంధనల ప్రకారం ఇలాంటి వాటిలో క్రాస్‌ జెండర్‌ (మగవారికి ఆడవాళ్లు, ఆడవారికి మగవారు) మసాజ్‌ చేయడాన్ని పోలీసులు అనుమతించరు. మసాజ్‌ సెంటర్‌/స్పాలలో పురుషులకు, మహిళలకు వేర్వేరు సెక్షన్లను ఏర్పాటు చేయాలి. లోపలకు ప్రవేశించడానికి ఒక మార్గం, బయటకు వెళ్లేవారికి ఒక మార్గం వేర్వేరుగా ఉండాలి. వారికి టాయ్‌లెట్లు, బాత్‌రూమ్‌లు కూడా వేర్వేరుగా ఉండడంతో పాటు లోపల ఒక గది నుంచి మరొక గదిలోకి వెళ్లేలా అంతర్గత ద్వారాలు ఉండకూడదు. సెంటర్‌లోకి అడుగుపెట్టిన వారికి ప్రతీదీ కనిపించేలా ఉండే ట్రాన్స్‌ప్రింట్‌ అద్దాలను మాత్రమే ఏర్పాటు చేయాలి. పదిమంది కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నట్టయితే వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వడం, మహిళా సిబ్బంది భద్రత కోసం ప్రత్యేక పర్యవేక్షణ విభాగం వంటివి అందుబాటులో ఉంచాలి. మసాజ్‌ సెంటర్‌/స్పాలలో ఫిజియోథెరపిస్టు లేదా ఆక్యుప్రెజర్‌ లేదా ఆక్యూపేషనల్‌ థెరపీలో డిగ్రీ, డిప్లొమా లేదంటే సర్టిఫికెట్‌ కోర్సు చేసిన వాళ్లను మాత్రమే నియమించుకోవాలి. ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకూ మాత్రమే వీటిని తెరిచి ఉంచాలి. అలాగే సెంటర్‌కు వచ్చే వినియోగదారులకు అందించే సేవలను వీడియో రికార్డు చేసేలా అన్నిచోట్టా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు కనీసం మూడు నెలల ఫుటేజీ స్టోరేజీ ఉండేలా హార్డ్‌ డిస్క్‌ను ఏర్పాటు చేసుకోవాలి. కానీ నగరంలోని మసాజ్‌ సెంటర్‌/స్పాల్లో మాత్రం ఈ నిబంధనలేవీ మచ్చుకైనా అమలు కావడం లేదనేది నేది బహిరంగ రహస్యం.

మసాజ్‌ ముసుగులో వ్యభిచారం

నగరంలోని మసాజ్‌ సెంటర్‌లు/స్పాలలో ఒకటి, రెండు మినహా మిగిలిన వాటన్నింటిలోనూ క్రాస్‌ జెండర్‌ మసాజ్‌లు, వ్యభిచారం వంటివి విచ్చలవిడిగా జరుగుతున్నాయన్న ఆరోపణలున్నాయి. థాయ్‌లాండ్‌, కేరళ, గోవా వంటి ప్రాంతాల నుంచి యువతులను నగరానికి తెప్పించి వారితో మసాజ్‌ పేరుతో వ్యభిచారం చేయిస్తున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొన్నాళ్ల కిందట నగరంలోని మసాజ్‌ సెంటర్లపై పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేపట్టగా థాయ్‌లాండ్‌కు చెందిన యువతులు స్పా సెంటర్లలో ఎటువంటి అనుమతి లేకుండా పనిచేస్తున్నట్టు గుర్తించారు. అలాగే కొన్ని సెంటర్లలో వాడిపడేసిన కండోమ్‌లు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. సెంటర్లలో పనిచేస్తున్న వారిలో మసాజ్‌ గురించి అవగాహన లేని యువతులే పనిచేస్తున్నట్టు తేలింది. ఈ నేపథ్యంలో పోలీస్‌ అధికారులు మసాజ్‌ సెంటర్ల నిర్వాహకులను పిలిచి ఆయా సెంటర్లకు సంబంధించిన నియమ నిబంధనలు, పాటించాల్సిన జాగ్రత్తలు, ఉల్లంఘించిన వారిపై తీసుకునే చర్యలు, ఎదురయ్యే శిక్షల గురించి వివరించారు. అయినప్పటికీ వారిలో మార్పు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనిపై పోలీసులకు సమాచారం ఉన్నప్పటికీ ఒక్కో మసాజ్‌ సెంటర్‌ స్థాయిని బట్టి సగటున రూ.పది వేల చొప్పున నెలనెలా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు చేరిపోతోందని, అందువల్లే చర్యలు ఉండడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

జంబ్లింగ్‌ తనిఖీలతో అక్రమాలకు చెక్‌

మసాజ్‌ సెంటర్ల నిర్వాహకులతో పలువురు పోలీసులు అవగాహన ఏర్పరుచుకున్నారని సీపీ శంఖబ్రత బాగ్చికి తరచూ ఫిర్యాదులు అందుతున్నాయి. సంబంధిత పోలీస్‌ స్టేషన్‌ అధికారుల ఆదేశాలతో సిబ్బంది నిర్వాహకుల నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటున్నార నే సమాచారం సీపీకి చేరింది. పోలీసులు మసాజ్‌ సెంటర్లు/స్పాల నిర్వాహకులతో మిలాఖత్‌ కావడంతో దాడులు చేసినప్పుడు ముందుగానే వారికి సమాచారం అందజేసి అప్రమత్తం చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అందువల్లే తనిఖీల సమయంలో పోలీసులు తమకు ఎలాంటి ఉల్లంఘనలు కనిపించలేదని నివేదిక ఇస్తున్నారని సీపీ భావిస్తున్నారు. ఇకపై దీనికి అడ్డుకట్ట వేయాంటే తరచూ మసాజ్‌ సెంటర్లు/స్పాలపై దాడులు నిర్వహించాల్సిందేనని భావిస్తున్నారు. అలా దాడులు చేసినప్పుడు ఒక స్టేషన్‌ పరిధిలోని మసాజ్‌ సెంటర్‌లు/స్పాలలో తనిఖీలు చేసేందుకు వేరే పోలీస్‌ స్టేషన్‌కు చెందిన అధికారులు, సిబ్బందికి బాధ్యతలు (జంబ్లింగ్‌) అప్పగించడం వల్ల అక్రమార్కులు తప్పించుకునే అవకాశం ఉండదని సీపీ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే ఈ విధానంలో మసాజ్‌ సెంటర్లు/స్పాలలో తనిఖీలకు శ్రీకారం చుడతామని ఆయన తెలిపారు.

Updated Date - May 31 , 2025 | 01:06 AM